ఏపీలో నేడు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్(AP Municipal Elections Counting) కొనసాగుతోంది. అయితే పులివెందుల మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో రీపోలింగ్ నిర్వహించాలని, అంతవరకు ఓట్ల లెక్కింపును నిలిపివేయాలని కోరుతూ వైసీపీ అభ్యర్థి వైఎస్ ప్రమీల, ఎంపీ అవినాష్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ అనుబంధ పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు.. పులివెందుల మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపును కొనసాగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే పులివెందుల కౌంటింగ్ కేంద్రం వద్ద మాత్రం అభ్యర్థి లేదా ఏజెంట్లలో ఎవరో ఒకరికి మాత్రమే అనుమతి ఇస్తామని అధికారులు చెప్పడంతో తీవ్ర గందరగోళం చెలరేగింది. స్థలం సరిపోదంటూ ఇద్దరికి పాస్‌లు ఇచ్చి ఇప్పుడు బయటకి వెళ్లమంటే ఎలా అంటూ అభ్యర్థులు అధికారులను నిలదీశారు. మరోవైపు పోలింగ్ రోజున పులివెందుల మున్సిపల్ కార్యాలయం ఎదుట అనుమతి లేకుండా ధర్నా నిర్వహించి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై మాజీ సీఎం వైఎస్ జగన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Also Read : APకి ‘మురసు’ తుఫాన్ అలర్ట్.. రేపు స్కూళ్లు, కాలేజీలకు హాలిడే

రాష్ట్రంలో మురసు తీవ్ర తుపాను బీభత్సం సృష్టించింది. ఒంగోలు సమీపంలో తీరాన్ని దాటిన ఈ తుపాను కారణంగా గంటకు 120 కిలోమీటర్ల వేగంతో భీకర గాలులు వీచాయి. దీని ప్రభావంతో ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురవడంతో ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఉదయం 8 గంటలకు ప్రారంభం కావాల్సిన కౌంటింగ్‌ను ఉదయం 11:30 గంటలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే, ఏలూరు జిల్లా నూజివీడులో భారీ వర్షం కారణంగా కౌంటింగ్ కేంద్రం వద్ద వేసిన టెంట్లు నేలకూలి. లోపలికి వర్షపు నీరు చేరడంతో ప్రాంగణమంతా జలమయమైంది. ఎన్టీఆర్ జిల్లాలో భారీ వర్షాల ముప్పు కారణంగా విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు.

పార్వతీపురం మున్సిపాలిటీ పరిధిలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ తాళం చెవి కనిపించకపోవడంతో కౌంటింగ్ ఆలస్యమైంది. అధికారుల నిర్లక్ష్యంపై అభ్యర్థులు, ఏజెంట్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో పార్టీల మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. అన్నమయ్య జిల్లా పుంగనూరు 9వ వార్డు కౌంటింగ్‌లో టీడీపీ చెల్లని ఓట్లను కూడా అధికారులు లెక్కిస్తున్నారంటూ జనసేన ఏజెంట్లు అభ్యంతరం తెలపడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఇలాంటి అనేక ఆటంకాలు, సవాళ్ల మధ్యే రాష్ట్రవ్యాప్తంగా కౌంటింగ్ కొనసాగుతోంది. తొలి ఫలితాల్లో కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ తన జోరును ప్రదర్శించింది. కుప్పంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీడీపీ క్లీన్‌స్వీప్ చేయగా.. ఛైర్మన్ అభ్యర్థి రాజ్‌కుమార్‌కు రావాల్సిన అన్ని పోస్టల్ ఓట్లు దక్కాయి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 1వ వార్డు నుంచి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి లాలం మురళీకృష్ణ 430 ఓట్ల మెజారిటీతో గెలుపొందగా.. 9వ వార్డులో గొలుసు సుమజ విజయం సాధించి పార్టీకి తొలి విజయాలు అందించారు. సాయంత్రానికి పూర్తి స్థాయి ఎన్నికల ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.

Also Read : ఏపీ మున్సిపల్ ఎన్నికల పోల్స్‌లో హైటెన్షన్.. లేటెస్ట్ అప్‌డేట్స్ ఇవే!