
కెనడాలోని క్యూబెక్ ప్రావిన్స్ ప్రభుత్వం పాఠశాలల్లో మతపరమైన గుర్తులు, సంప్రదాయ వస్త్రధారణపై కఠిన ఆంక్షలు విధించేందుకు సిద్ధమైంది. ప్రైమరీ స్కూల్ విద్యార్థులు సిక్కుల టర్బన్లు, ముస్లింల నిఖాబ్‌లు ధరించడాన్ని పూర్తిగా నిషేధించాలని నిర్ణయించింది. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం ప్రధానంగా సిక్కు, ముస్లిం, యూదు వర్గాలకు చెందిన విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది.
Also Read : బిల్‌బోర్డులు హ్యాక్.. అడ్వర్టైజ్‌మెంట్ల ప్లేస్‌లో పోర్న్ వీడియోలు
గత అక్టోబర్‌లో జరిగిన ప్రావిన్షియల్ ఎన్నికల్లో వేర్పాటువాద భావజాలం ఉన్న ‘పార్టీ క్యుబెకోయిస్’ అధికారాన్ని చేజిక్కించుకుంది. తాము అధికారంలోకి వస్తే పాఠశాలల్లో మతపరమైన గుర్తులను బహిరంగంగా ప్రదర్శించకుండా బ్యాన్ చేస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చింది. అందులో భాగంగానే ఇప్పుడు ఆ ప్రామిస్‌ను అమలు చేసేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.
వాస్తవానికి క్యూబెక్‌లో మతపరమైన గుర్తులపై ఆంక్షల పర్వం 2019లోనే మొదలైంది. అప్పటి ప్రభుత్వం తీసుకువచ్చిన సెక్యులరిజం చట్టం ప్రకారం ఉపాధ్యాయులు, పోలీసు అధికారులు, జడ్జిలు వంటి అధికార హోదాల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు డ్యూటీలో మతపరమైన గుర్తులు ధరించడంపై ఇప్పటికే నిషేధం అమల్లో ఉంది. ఇప్పుడు ఈ నిబంధనలను ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు కూడా విస్తరించాలని తాజా ప్రభుత్వం భావిస్తోంది.
అయితే ప్రభుత్వ తాజా ప్రతిపాదనపై కెనడియన్ సివిల్ లిబర్టీస్ అసోసియేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం క్రమంగా మత స్వేచ్ఛపై ఆంక్షలు పెంచుతోందని ఆ సంస్థ ప్రతినిధి అనైస్ బుసియర్స్ మెక్‌నికోల్ మండిపడ్డారు. ముఖ్యంగా స్కూల్ చిన్నారులను టార్గెట్ చేయడం వల్ల వారిలో చిన్నతనం నుంచే వివక్ష భావన పెరిగే ప్రమాదం ఉందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ చర్య ప్రాథమిక హక్కులను కాలరాయడమేనని హక్కుల సంఘాలు విమర్శిస్తున్నాయి.









