
బాలాపూర్ గణనాథుడి సుదీర్ఘ శోభాయాత్ర కాసేపట్లో వైభవంగా ప్రారంభం కానుంది. ప్రతిఏటా ఎంతో ఉత్కంఠగా సాగే ప్రసిద్ధ బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం పాట ముగిసిన వెంటనే ఈ ఊరేగింపు అధికారికంగా మొదలవుతుంది. భాగ్యనగరంలో జరిగే వినాయక నిమజ్జన ఊరేగింపుల్లో బాలాపూర్ గణేషుడి శోభాయాత్ర అత్యంత ప్రత్యేకమైనది.
Also Read : ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనానికి వెళ్లే భక్తులకు అలర్ట్.. సర్వం సిద్ధం!
ఈ శోభాయాత్ర పాతబస్తీ ప్రధాన వీధుల మీదుగా ముందుకు సాగుతుంది. బాలాపూర్ నుంచి బయలుదేరిన ఊరేగింపు మొదటగా చాంద్రాయణగుట్ట క్రాస్‌రోడ్స్, కేశవగిరి ప్రాంతాల మీదుగా ప్రయాణిస్తుంది. ఆ తర్వాత ఆలియాబాద్, ఇంజిన్ బౌలి, నాగుల్ చింతా జంక్షన్ల గుండా చార్మినార్ వైపు కదులుతుంది. చార్మినార్ వద్దకు చేరుకున్న తర్వాత అక్కడ ప్రత్యేక పూజలు అందుకుని, మదీనా, అఫ్జల్‌గంజ్ జంక్షన్ల మీదుగా ఎంజే మార్కెట్ వైపు ఊరేగింపు కొనసాగుతుంది. ఎంజే మార్కెట్ జంక్షన్ వద్ద నగరంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రధాన శోభాయాత్ర మార్గంలోకి బాలాపూర్ గణనాథుడు ప్రవేశిస్తాడు. అక్కడి నుంచి అబిడ్స్, బషీర్‌బాగ్, లిబర్టీ మీదుగా పయనిస్తూ చివరకు అప్పర్ ట్యాంక్‌బండ్ చేరుకుని నిమజ్జనం పూర్తి చేసుకుంటాడు.
హైదరాబాద్ నగరంలోనే అత్యంత సుదీర్ఘమైనదిగా పేరుగాంచిన ఈ శోభాయాత్ర దాదాపు 18.5 కిలోమీటర్ల మేర సాగుతుంది. ప్రయాణించే మార్గ పొడవునా లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. భక్తుల రద్దీని తట్టుకోవడానికి, శాంతిభద్రతలను కాపాడటానికి పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేశారు. శోభాయాత్ర ప్రశాంతంగా సాగేందుకు హైదరాబాద్ సిటీ పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. ముఖ్యంగా చాంద్రాయణగుట్ట, ఆలియాబాద్, చార్మినార్, ఎంజే మార్కెట్ జంక్షన్ల వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శోభాయాత్ర మార్గాన్ని అత్యాధునిక డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
Also Read : బీజేపీలో కీలక మార్పులు.. తెలుగు రాష్ట్రాలకు కొత్త ఇన్‌చార్జీలు!









