హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర(Khairatabad Ganesh Immersion) కు సర్వం సిద్ధమైంది. కాసేపట్లో బడా గణేష్ విగ్రహాన్ని ప్రత్యేక ‘టస్కర్’ వాహనంపైకి ఎక్కించనున్నారు. అక్కడి నుంచి ఎన్టీఆర్ మార్గ్ మీదుగా శోభాయాత్ర కొనసాగి, మధ్యాహ్నం 12 గంటల సమయానికి హుస్సేన్‌సాగర్ తీరానికి చేరుకుంటుంది. క్రేన్ నంబర్-4 ద్వారా మధ్యాహ్నం 1:30 గంటలలోపే నిమజ్జన ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

శోభాయాత్ర సాగే మార్గమంతా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈ బడా గణేష్‌తో పాటు హైదరాబాద్ నగరంలో అన్ని విగ్రహాల నిమజ్జనం ఉండటంతో జలమండలి విస్తృత ఏర్పాట్లు చేసింది. రాబోయే 72 గంటల పాటు అధికారులు, సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు.

Also Read : రూ.450 నుంచి రూ.35 లక్షలకు.. బాలాపూర్ లడ్డూ వేలంలో ఈసారి బద్దలు కానున్న రికార్డులు

భాగ్యనగరం, ORR పరిధిలో భక్తుల దాహం తీర్చడానికి 137 ప్రత్యేక వాటర్ క్యాంపులతో పాటు, 90 బేబీ పాండ్స్ వద్ద కూడా తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నారు. ట్యాంక్‌బండ్, సచివాలయం వంటి ప్రధాన శోభాయాత్ర మార్గాల్లో 12 ప్రత్యేక వాటర్ క్యాంపులు ఏర్పాటు చేశారు. భక్తుల కోసం దాదాపు 40 లక్షల వాటర్ ప్యాకెట్లను సిద్ధం చేయడమే కాకుండా, అన్నదాన శిబిరాలకు ఉచితంగా వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు.

నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మెట్రో సేవల వేళలను పొడిగించారు. నగరం నలుమూలల నుండి వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఇవాళ అర్థరాత్రి ఒంటిగంట వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉండనున్నాయి. అన్ని మార్గాల్లోని చివరి స్టేషన్ల నుండి రాత్రి 1 గంటకు చివరి రైలు బయలుదేరుతుందని అధికారులు వెల్లడించారు. బస్సులు కూడా హుస్సేన్ సాగర్ నుంచి ఉంటాయని అధికారులు తెలిపారు.

Also Read : చార్మినార్, ఎంజే మార్కెట్ మీదుగా ట్యాంక్‌బండ్‌కు.. 18.5 కిలోమీటర్ల మేర బాలాపూర్ ఘనంగా ఊరేగింపు!