Rains
Rains

Rain Alert : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నేపథ్యంలో బుధ, గురువారాల్లో తెలంగాణలోని పలు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ ‘రెడ్‌’ ఎలర్ట్‌ జారీ చేసింది. మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో రంగు హెచ్చరికలు జారీ చేసింది. ఒక వైపు వాయుగుండం ముంచుకొస్తుండగా… మరోవైపు కర్ణాటక, కోస్తాంధ్ర మీదుగా ద్రోణి కూడా కొనసాగుతున్నట్లు వెల్లడించింది. ఈ రెండింటి ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 20.4 సెం.మీకి మించి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మరికొన్ని చోట్ల 11.5 సెం.మీ నుంచి 20.4 సెం.మీలోపు అతి భారీ వర్షాలు దంచి కొట్టే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఇతర జిల్లాల్లోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 25, 26 తేదీల్లోనూ పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

బుధవారం ‘రెడ్‌’ ఎలర్ట్‌ జారీ అయిన జిల్లాలలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, పెద్దపల్లి, జయంశంకర్‌ భూపాలపల్లి, ములుగు, , కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, సూర్యాపేట, జనగామ, సిద్దిపేట. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, నల్గొండ తదితర జిల్లాలున్నాయి.

ఆరెంజ్‌ ఎలర్ట్‌జారీ చేసిన జిల్లాలలో ఆదిలాబాద్, నిర్మల్‌ జిల్లాలున్నాయి.

గురువారం భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్‌ కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు ‘రెడ్‌’ ఎలర్ట్‌ జారీ చేశారు.

ఇక ఆరెంజ్‌ ఎలర్ట్‌ జారీ అయిన జిల్లాలలో ఆదిలాబాద్, నిర్మల్, నల్గొండ, సూర్యాపేట, జనగామ, సిద్దిపేట, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ఖమ్మం జిల్లాలున్నాయి.

Also Read : ప్యారడైజ్‌ కు బిగ్ షాక్‌… టికెట్‌ ధరల పెంపుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

పలు చోట్ల భారీ వర్షాలు

మంగళవారం రాత్రి హైదారాబాద్‌ సహా పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల్లో వానలు ముంచెత్తాయి. ఖైరతాబాద్‌లో 3.2 సెం.మీ., కూకట్‌పల్లి 2.8, ముషీరాబాద్‌ 2.5, అబ్దుల్లాపూర్‌మెట్‌ 2.3 సెం.మీ. వర్షం కురిసింది. కాగా, ఆర్థరాత్రి వరకు కురిసిన వర్షాలతో నగరం అతలాకుతలం అయింది.

Also Read : మందు బాబులకు అలర్ట్‌.. వరుసగా 3 రోజులు.. బార్లు, వైన్‌ షాప్‌లు బంద్‌

అప్రమత్తంగా ఉండండి: సీఎం

రాష్ర్టంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌ పరిధిలోని మూడు మున్సిపల్‌ కార్పొరేషన్ల కమిషనర్లు, హైడ్రా, పోలీసు కమిషనర్లు అంతా కూడా పూర్తి సమన్వయంతో పనిచేస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రధాన రహదారులు, జంక్షన్లు, కాలనీల్లో వర్షపు నీరు నిలిచిపోకుండా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.