Telangana Weather Update
Telangana Weather Update

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం తీవ్ర అల్పపీడనంగా మారి స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాగల 48 గంటల పాటు వాతావరణం మారనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర సమీపంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉన్నందున సముద్ర తీరం తీవ్ర అలజడిగా మారింది. తీరం వెంబడి గంటకు 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. అయితే రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర, ఉమ్మడి గోదావరి జిల్లాలపై ఈ అల్పపీడన ప్రభావం ఎక్కువగా ఉండనుంది.

Also Read : ఫిలిప్పీన్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఐదుగురు మృతి, 87 మంది గల్లంతు

శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే తీవ్ర ముప్పు పొంచి ఉందని అధికారులు హెచ్చరించారు. సముద్ర తీరప్రాంతాలైన విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, పోలవరం ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. అనకాపల్లి జిల్లాలోని దార్లపూడిలో గరిష్టంగా 37 మి.మీ, నంగినారపాడు, పూడిమడకల్లో 34.5 మి.మీ చొప్పున వర్షపాతం రికార్డయ్యింది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో చెదురుమదురుగా జల్లులు పడే అవకాశముంది.

అల్పపీడన ప్రభావం వల్ల తెలంగాణలో కూడా వర్షాలు పడే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు వాతావరణ శాఖ ప్రత్యేక హెచ్చరికలు జారీ చేసింది. వర్షం కురిసే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్త ఉండాలని వాతావరణ శాఖ అధికారులు కోరారు.

Also Read : నిరుద్యోగులకు మంత్రి ఉత్తమ్ బంపరాఫర్.. 250 కంపెనీల్లో 3 వేల జాబ్స్.. వివరాలివే!