
YouTuber Nandana : యూట్యూబర్ నందూస్ వరల్డ్ నందన అలియాస్ రమా నందనను పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లండన్‌లో ఉద్యోగాలు, వీసాలు ఇప్పిస్తామని చెప్పి భారీగా డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలపై నందన, ఆమె భర్త మధుకర్‌పై కేసు నమోదైంది. ఈ కేసులో నందనపై లుక్‌అవుట్ నోటీసులు ఉండటంతో ఎయిర్‌పోర్టులోనే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో గతేడాది నవంబర్‌లో నందన దంపతులపై కేసు నమోదైంది. యూకేలో ఉద్యోగాలు, వర్క్ వీసాలు, సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్‌షిప్ , వీసా రెన్యువల్ పేరుతో పలువురి నుంచి లక్షల రూపాయలు వసూలు చేశారంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఒక్కొక్కరి నుంచి రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు తీసుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. బాధితుల సంఖ్య 50 నుంచి 100 వరకు ఉండొచ్చని, మొత్తం లావాదేవీలు రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు ఉండొచ్చనే ప్రచారం కూడా అప్పట్లో జరిగింది. అయితే ఈ మొత్తాలపై అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.
ఈ వ్యవహారంలో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు అందడంతో దర్యాప్తు మొదలైంది. యూకే వీసా రెన్యువల్‌తో పాటు ఉద్యోగం, స్పాన్సర్‌షిప్ ఇప్పిస్తామని నమ్మించి డబ్బులు తీసుకున్నారని బాధితులు ఆరోపించారు. బ్యాంక్ లావాదేవీలు, వాట్సాప్ చాట్స్, ఫోన్ కాల్ రికార్డింగ్స్ వంటి ఆధారాలను కూడా పోలీసులకు అందించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కేసు దర్యాప్తులో భాగంగా నందన, ఆమె భర్త మధుకర్‌కు పోలీసులు లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు. ఇద్దరూ లండన్‌లో ఉన్నట్లు అప్పట్లో సమాచారం ఉండటంతో.. భారత్‌కు వస్తే విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకునేలా చర్యలు తీసుకున్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి.
ఇప్పుడు నందన భారత్‌కు రావడంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులోనే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. RGIA పోలీసులు నందనను ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించనున్నట్లు సమాచారం. అనంతరం కేసుకు సంబంధించిన పూర్తి వివరాలపై ఆమెను విచారించే అవకాశం ఉంది. డబ్బుల వసూళ్లు, వీసా ప్రక్రియ, బాధితుల ఫిర్యాదులు, బ్యాంక్ లావాదేవీలు తదితర అంశాలపై పోలీసులు ఆరా తీయనున్నట్లు తెలుస్తోంది.









