Air India : కొచ్చి నుంచి అబుదాబికి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి గాల్లోనే ఇంజిన్‌ సమస్య తలెత్తింది. బోయింగ్‌ 737 విమానం IX 415లో మొదటి ఇంజిన్‌ ఆయిల్‌ పరిమాణం వేగంగా తగ్గుతున్నట్లు పైలట్లు గుర్తించారు. కొద్దిసేపటికే ఆయిల్‌ ప్రెజర్‌ ప్రమాద స్థాయికి చేరడంతో ఆ ఇంజిన్‌ను పూర్తిగా ఆపేశారు. అనంతరం విమానాన్ని కొచ్చికి వెనక్కి మళ్లించి సురక్షితంగా ల్యాండ్‌ చేశారు.

విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన ఎంత తీవ్రంగా ఉందో ప్రయాణికులకు తెలియలేదు. విమానం కొచ్చి నుంచి బయలుదేరిన సుమారు 50 నిమిషాల తర్వాత 36 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో పైలట్‌, కో-పైలట్‌ ఇంజిన్‌-1లో ఆయిల్‌ పరిమాణం వేగంగా తగ్గుతున్నట్లు గుర్తించారు. వెంటనే పరిస్థితిని అంచనా వేసేందుకు FORDEC విధానాన్ని అనుసరించారు. ఆయిల్‌ పరిమాణం మరింత తగ్గుతుండటంతో అబుదాబి ప్రయాణాన్ని కొనసాగించడం సురక్షితం కాదని నిర్ణయించి కొచ్చికి తిరిగి రావాలని నిర్ణయించారు.

కమాండర్‌ హై ఫ్రీక్వెన్సీ ద్వారా ముంబై రేడియోను సంప్రదించి విమానాన్ని కొచ్చికి మళ్లిస్తున్నట్లు ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌కు సమాచారం ఇచ్చారు. అనంతరం ప్రామాణిక భద్రతా విధానాలను పాటిస్తూ విమానం దిశను మార్చింది. తిరుగు ప్రయాణంలో ఇద్దరు పైలట్లు ఇంజిన్‌ పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ.. ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు.

విమానం కొచ్చికి తిరిగి మళ్లిన సుమారు 45 నిమిషాల తర్వాత ఇంజిన్‌-1 ఆయిల్‌ ప్రెజర్‌లో హెచ్చుతగ్గులు మొదలయ్యాయి. చివరకు కాక్‌పిట్‌ గేజ్‌లో ఆయిల్‌ ప్రెజర్‌ రెడ్‌ జోన్‌లోకి వెళ్లింది. అంటే ఇంజిన్‌ ఆయిల్‌ ప్రెజర్‌ ప్రమాదకర స్థాయికి పడిపోయిందన్నమాట. దీంతో పైలట్లు NNC ప్రకారం చర్యలు తీసుకుని ఇంజిన్‌-1ను షట్‌డౌన్‌ చేశారు.

ఒక ఇంజిన్‌ పనిచేయని సమయంలో బరువుగా ఉన్న బోయింగ్‌ 737 విమానాన్ని మరో ఇంజిన్‌ సాయంతో ల్యాండ్‌ చేయడం పైలట్లకు చాలా క్లిష్టమైన ప్రక్రియ. అయినప్పటికీ సిబ్బంది పరిస్థితిని సమర్థంగా ఎదుర్కొని విమానాన్ని కొచ్చి విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్‌ చేశారు. కాక్‌పిట్‌లో పరిస్థితి తీవ్రంగా ఉన్నప్పటికీ ప్రయాణికులు మాత్రం దాని తీవ్రతను గుర్తించలేదు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.