Pakistan : పాకిస్థాన్‌లోని గుజ్రన్‌వాలాలో దారుణ ఘటన జరిగింది. టిక్‌టాక్‌లో ఫాలోవర్ల విషయంలో ఇద్దరు అక్కాచెల్లెళ్ల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ చివరకు చెల్లి ప్రాణాలు పోయేలా చేసింది. 15 ఏళ్ల బాలికను ఆమె 18 ఏళ్ల అక్క కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు తెలిపారు. లధేవాలా వరైచ్‌ పోలీసులు నిందితురాలైన అక్కను అరెస్ట్‌ చేశారు. ఆమె హత్యకు ఉపయోగించిన కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నారు.

Also Read : నైజీరియాలో పైప్‌లైన్‌ నుంచి ఆయిల్‌ దొంగతనం.. 37 మంది మృతి?

ఆరుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్న కుటుంబానికి అబ్దుల్‌ షకూర్‌ తండ్రిగా ఉన్నారు. ఆయన డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. సెప్టెంబర్‌ 1న కొంతమంది అతిథులు ఇంటికి రావడంతో ఆయన కింద అంతస్తులో వారితో ఉన్నారు. ఇంతలో పై అంతస్తు నుంచి కేకలు వినిపించాయి. వెంటనే పైకి వెళ్లిన అబ్దుల్‌ షకూర్‌కు తన కుమార్తె మనాహిల్‌ రక్తపు మడుగులో కనిపించింది. ఆమెను అక్క వంటగదిలో ఉపయోగించే కత్తితో పొడిచినట్లు గుర్తించారు.

వెంటనే మనాహిల్‌ను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. అయితే తీవ్రంగా రక్తం పోవడంతో చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. ఇద్దరు అక్కాచెల్లెళ్ల మధ్య డబ్బు విషయానికి సంబంధించి కూడా గొడవలు జరుగుతున్నట్లు తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. దీంతో ఇద్దరు అక్కాచెల్లెళ్లు టిక్‌టాక్‌లో వీడియోలు చేస్తూ కొంత డబ్బు సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ క్రమంలో తన ఫాలోవర్లను చెల్లి దొంగిలించిందని అక్క ఆరోపించినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయంతో ఇద్దరి మధ్య గొడవ మరింత పెరిగినట్లు తెలుస్తోంది. చివరకు అక్క తన చెల్లిపై కత్తితో దాడి చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. తండ్రే నిందితురాలిని పోలీసులకు అప్పగించినట్లు సమాచారం. కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనపై పూర్తి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read : దక్షిణాఫ్రికా మొత్తాన్ని ఫొటో తీసే కెపాసిటీ.. శత్రువుల దాడులను పసిగట్టే శక్తి.. GSLV-F17 ప్రత్యేకతలివే!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.