
Nigeria : నైజీరియాలో దారుణ ఘటన జరిగింది. ఆయిల్ పైప్‌లైన్ నుంచి పెట్రోల్‌ను అక్రమంగా తీసుకునే ప్రయత్నంలో విషవాయువులు పీల్చుకుని 37 మంది చనిపోయారు. అయితే ఈ మరణాల సంఖ్యను అధికారులు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.
దక్షిణ నైజీరియాలోని రివర్స్ స్టేట్‌లో ఓకారికి జెట్టీ వద్ద ఈ ఘటన జరిగింది. కొంతమంది అనుమానిత ఆయిల్ దొంగలు హై ప్రెజర్లో ఉన్న పైప్‌లైన్ నుంచి పెట్రోలియంను పడవల్లోకి తీసుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. నదిలో కొన్ని మృతదేహాలు తేలుతూ కనిపించాయి.
ముడి చమురును దొంగిలించే ప్రయత్నంలోనే బాధితులు చనిపోయినట్లు అనుమానిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు దర్యాప్తు జరుగుతోందన్నారు. అసలు ఏం జరిగిందో, ఎంతమంది చనిపోయారో దర్యాప్తు తర్వాతే తెలుస్తుందని తెలిపారు.
Also Read : టిక్‌టాక్ ఫాలోవర్ల కోసం చెల్లితో గొడవ.. 15 ఏళ్ల చెల్లిని కత్తితో చంపిన అక్క!
నైజీరియా సెక్యూరిటీ అండ్ సివిల్ డిఫెన్స్ కార్ప్స్ కూడా ప్రస్తుతం బయటకు వస్తున్న మరణాల సంఖ్యను నిర్ధారించలేదని తెలిపింది. ప్రమాదానికి కారణమైన పదార్థం ఏదో కూడా సాంకేతికంగా నిర్ధారించాల్సి ఉందని చెప్పింది. ఎంతమంది చనిపోయారు, ఎంతమంది గాయపడ్డారు, ఇంకా ఎంతమంది కనిపించడం లేదనే విషయాన్ని తెలుసుకునేందుకు భద్రతా సంస్థలతో కలిసి పని చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరి నిర్లక్ష్యం ఉందా, ఎవరైనా సహకరించారా, ఏదైనా నేరం జరిగిందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.
నైజీరియాలోని నైజర్ డెల్టా ప్రాంతంలో ఆయిల్ దొంగతనాలు, పైప్లైన్లను పగలగొట్టి చమురు తీసుకోవడం తరచూ జరుగుతుంటాయి. వీటి వల్ల గతంలో కూడా పలువురు ప్రాణాలు కోల్పోయారు. అలాగే చమురు నదుల్లో కలవడంతో కాలుష్యం పెరగడంతో పాటు ఆయిల్ కంపెనీలకు భారీ నష్టాలు వస్తున్నాయి. ఈ ఘటనలో 37 మంది చనిపోయినట్లు వచ్చిన వార్త నిజమైతే, 2023 అక్టోబర్ తర్వాత ఇలాంటి ఘటనల్లో ఇదే అత్యధిక మరణాల సంఖ్య కావచ్చని రాయిటర్స్ తెలిపింది.
Also Read : సన్యాసం కోసం రూ.47 కోట్ల కంపెనీ అమ్మకం.. ఐస్‌క్రీమ్ కింగ్ సంచలనం!









