Ice Cream Founder :  థాయ్‌లాండ్‌కు చెందిన ప్రముఖ ఐస్‌క్రీమ్ బ్రాండ్ హావెల్స్ వ్యవస్థాపకుడు సిరిపోంగ్ అక్కరస్రియుక్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన కంపెనీని రూ.47 కోట్లకు అమ్మకానికి పెట్టారు. వ్యాపారం నుంచి తప్పుకుని బౌద్ధ సన్యాసిగా మారేందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 21న ఫేస్‌బుక్‌లో కంపెనీ అమ్మకానికి సంబంధించిన ప్రకటనను సిరిపోంగ్ చేశారు. తాను అడిగిన ధరకు కంపెనీని కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్న వ్యక్తిని పరిచయం చేసిన వారికి 50 లక్షల బాట్‌ల రిఫరల్ ఫీజు కూడా ఇస్తానని ప్రకటించారు. ఈ డీల్‌లో 2.77 ఎకరాల భూమి, ఆఫీస్, ఐస్‌క్రీమ్ ఫ్యాక్టరీ, యంత్రాలు, అవసరమైన లైసెన్సులు, హావెల్స్ ఐస్‌క్రీమ్ అండ్ ఫాస్ట్‌ఫుడ్ అవుట్‌లెట్, కంపెనీ ట్రేడ్‌మార్క్, వ్యాపారానికి సంబంధించిన పరిజ్ఞానం, ఐస్‌క్రీమ్ తయారీ రెసిపీల మొత్తం సేకరణ ఉన్నాయి.

Also Read : కిడ్స్ సోషల్ మీడియా అకౌంట్లపై మెటా కన్ను.. ఏఐతో ఏజ్ కాల్యుకేషన్.. ఎలాగంటే?

సిరిపోంగ్ 1999లో హావెల్స్‌ను ప్రారంభించారు. చిన్నప్పటి నుంచే ఐస్‌క్రీమ్ అంటే ఆయనకు చాలా ఇష్టం. తన కెరీర్‌ను కూడా ఐస్‌క్రీమ్ అమ్మకందారుడిగానే ప్రారంభించారు. 1999 డిసెంబర్‌లో బ్యాంకాక్‌లోని సెంట్రల్ పింక్లావో షాపింగ్ మాల్‌లో హావెల్స్ మొదటి స్టోర్‌ను ప్రారంభించారు. కొద్ది కాలంలోనే ఆ బ్రాండ్‌కు మంచి ఆదరణ వచ్చింది. కేవలం మూడేళ్లలోనే 22 బ్రాంచ్‌లకు విస్తరించింది. మంచి క్వాలిటీ ఐస్‌క్రీమ్‌ను తక్కువ ధరకు అందించడంతో హావెల్స్‌కు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. Y2K కాలంలో థాయ్‌లాండ్‌లో గుర్తింపు పొందిన బ్రాండ్లలో ఒకటిగా నిలిచింది. వ్యాపారవేత్తలపై వచ్చే థాయ్ టీవీ కార్యక్రమాల్లో సిరిపోంగ్ కూడా కనిపించేవారు.

ఆ తర్వాత ఐస్‌క్రీమ్ మార్కెట్‌లో పోటీ పెరిగింది. పెద్ద కంపెనీలు షాపింగ్ మాల్స్‌తో ప్రత్యేక ఒప్పందాలు చేసుకోవడం మొదలుపెట్టాయి. దీంతో అదే మాల్స్‌లో ఇతర ఐస్‌క్రీమ్ బ్రాండ్లు స్టోర్లు పెట్టుకునే అవకాశం లేకుండా పోయింది. దీంతో హావెల్స్ బ్రాంచ్‌లు ఒక్కొక్కటిగా మూతపడటం ప్రారంభించాయి. చివరకు సెంట్రల్ పింక్లావోలో మొదలైన తొలి స్టోర్ కూడా 2014లో మూతపడింది. అయినా సిరిపోంగ్ బ్రాండ్‌ను తిరిగి నిలబెట్టేందుకు చాలా సంవత్సరాలు ప్రయత్నించారు. గత రెండేళ్లుగా షాపింగ్ మాల్స్‌లో కొత్త బ్రాంచ్‌లు ప్రారంభించేందుకు చర్చలు జరిపినప్పటికీ.. “స్థలం లేదు” అంటూ మాల్స్ నుంచి సమాధానం వచ్చేదని ఆయన చెప్పారు.

మాల్స్‌లో స్టోర్లు పెట్టడం కుదరకపోవడంతో సొంతంగా షాపులు ప్రారంభించాలంటే భారీ పెట్టుబడి అవసరమైంది. ఫ్రాంచైజీ విధానాన్ని కూడా పరిశీలించారు. అయితే చాలా వేగంగా విస్తరించడం వల్ల సమస్యలు వచ్చి బ్రాండ్ పేరు దెబ్బతినే అవకాశం ఉందని భావించి ఆ ఆలోచనను కూడా విరమించుకున్నారు. చివరకు 2023లో నోంథబురిలోని బ్యాంగ్ బువా థాంగ్‌లో సొంత స్టోర్‌తో హావెల్స్ మళ్లీ ప్రారంభమైంది. ప్రస్తుతం అదే ఆ సంస్థకు ఉన్న ఏకైక ఆపరేటింగ్ బ్రాంచ్.

Also Read : ట్రంప్‌కు బిగ్ షాక్.. గేమ్ ప్లాన్ అంతా రివర్స్.. పౌరసత్వంపై అమెరికా కోర్టు సంచలన ట్విస్ట్!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.