US Court : అమెరికాలో జన్మతః లభించే పౌరసత్వం వ్యవహారంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. విదేశీ వలసదారుల పిల్లలకు తమంతట తామే లభించే పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు లేదా పరిమితం చేసేందుకు ఆయన జారీ చేసిన కొత్త కార్యనిర్వాహక ఉత్తర్వులను యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు తాత్కాలికంగా నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చింది.

అమెరికా రాజ్యాంగం ప్రకారం ఆ దేశంలో జన్మించిన ఎవరికైనా స్వయంచాలకంగా పౌరసత్వం లభిస్తుంది. అయితే అక్రమంగా దేశంలోకి వచ్చిన వలసదారులు, అలాగే తాత్కాలిక వీసాలపై వచ్చే వారి పిల్లలకు ఈ హక్కును వర్తింపజేయకూడదని ట్రంప్ ప్రభుత్వం భావించింది. దీనికితోడు పౌరసత్వం కోసమే గర్భవతులు అమెరికాకు వచ్చే ‘బర్త్ టూరిజం’ ను పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా ఇటీవల ట్రంప్ కొత్త నిబంధనలపై సంతకం చేశారు.

Also Read : అమెరికా టూ లండన్‌.. 86 టన్నుల బంగారం.. ఎందుకు?

అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం దేశంలో జన్మించిన ప్రతి ఒక్కరికీ సమాన పౌరసత్వ హక్కులు ఉంటాయి. అధ్యక్షుడు జారీ చేసిన ఉత్తర్వులు రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయని విమర్శకులు, హక్కుల సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. కేసును విచారించిన యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు, అధ్యక్షుడికి రాజ్యాంగబద్ధంగా లభించే ఈ హక్కును కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా మార్చే అధికారం లేదని స్పష్టం చేస్తూ ఆ ఉత్తర్వుల అమలును నిలిపివేసింది.

ఇదివరకు కూడా జన్మతః పౌరసత్వానికి సంబంధించి ట్రంప్ తీసుకున్న పలు నిర్ణయాలకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. అక్రమంగా నివసిస్తున్న వారి పిల్లలైనా లేదా తాత్కాలిక వీసాలపై ఉన్నవారి పిల్లలైనా అమెరికా గడ్డపై జన్మిస్తే చట్టప్రకారం పౌరులుగానే పరిగణించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ పరిణామాలతో పౌరసత్వ నిబంధనలను కఠినతరం చేయాలనే ట్రంప్ ప్రయత్నాలు వరుసగా వీగిపోతున్నాయి.

ఈ కోర్టు తీర్పు అమెరికాలో నివసిస్తున్న వేలాది మంది భారతీయ ఉద్యోగులకు, ప్రవాసులకు తీవ్ర ఊరటనిచ్చింది. హెచ్-1బి (H-1B), ఎల్-1 (L-1) వంటి తాత్కాలిక వర్క్ వీసాలపై అమెరికాలో ఉంటూ గ్రీన్ కార్డ్ కోసం దశాబ్దాలుగా ఉంటున్న భారతీయ కుటుంబాల పిల్లలకు జన్మతః పౌరసత్వం లభించే హక్కు సురక్షితంగా ఉంటుంది. కోర్టు తాజా ఉత్తర్వులతో ప్రవాస భారతీయుల్లో వ్యక్తమవుతున్న ఆందోళనలు తాత్కాలికంగా తొలగిపోయాయి.

Also Read : ఉబర్‌లో లేఆఫ్‌లు.. 3,300 మంది ఉద్యోగులు ఔట్‌ ?