
Fake Doctors: ఎలాంటి విద్యార్హతలు లేకపోయినప్పటికీ క్లినిక్‌లు నడుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పలువురు నకిలీ డాక్టర్ల గుట్టును పోలీసులు రట్టు చేశారు. చాలా కాలంగా వైద్యుల పేరుతో చలామణి అవుతున్న నకిలీ డాక్టర్ల దందాపై సైబరాబాద్ పోలీసులు దాడులు నిర్వహించారు. వీరంతా ఎలాంటి అర్హత లేకపోయినా వైద్యుల అవతారమెత్తి క్లినిక్‌లు నడుపుతున్నట్లు గుర్తించారు. మొత్తం10 మంది ఫేక్ డాక్టర్లను అరెస్ట్ చేశారు. సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (SOT), వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త ఆధ్వర్యంలో అధికారులు మెరుపు దాడులు నిర్వహించి వారిని అదుపులోకి తీసుకున్నట్లు కుత్బుల్లాపూర్ జోన్ డీసీపీ కోటి రెడ్డి వివరించారు.
మేడ్చల్ – మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని పలు ప్రాంతాల్లో చాలాకాలంగా ఈ శంకర్‌దాదాలు డాక్టర్ల అవతారం ఎత్తి అమాయకుల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఆయా జిల్లాల్లో క్లినిక్‌ల దందా విచ్చలవిడిగా సాగుతోందన్న పక్కా సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగి వారిని అదుపులోకి తీసుకున్నారు. పేట్ బషీరాబాద్, మేడ్చల్, జగద్గిరిగుట్ట, సూరారం, పటాన్ చెరు, ఆర్సీ పురం తదితర పోలీసు స్టేషన్ల పరిధిలో ఏకకాలంలో దాడులు నిర్వహించడంతో పాటు, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 10 నకిలీ క్లినిక్‌లను సీజ్ చేశారు.
కాగా, వీరిలో చాలామంది టెన్త్, ఇంటర్, బీకామ్ వంటి చదువులు మాత్రమే చదివిన నకిలీ కుటుగాళ్లు, ఎలాంటి కనీస మెడికల్ నాలెడ్జ్ లేదా గుర్తింపు పొందిన డిగ్రీలు లేకుండానే క్లినిక్‌లు నిర్వహిస్తూ ప్రాక్టీస్ చేస్తున్నారని విచారణ సందర్భంగా అధికారులు గుర్తించారు. వీరంతా ఎలాంటి అర్హత లేకున్నా క్లినిక్‌లలో ఏకంగా బెడ్లు ఏర్పాటు చేసి, అమాయక రోగులకు, చిన్నపిల్లలకు వైద్యం అందిస్తున్నట్లు అధికారులు గుర్తించడం గమనార్హం. తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో వచ్చే పేషెంట్లకు కూడా ఎడాపెడా సెలైన్లు, ఐవీ ఫ్లూయిడ్స్ (IV Fluids) ఎక్కిస్తూ వారి ప్రాణాలతో ఆటలాడుకుంటున్నారని పోలీసులు తెలిపారు. దాడుల్లో భాగంగా ఈ క్లినిక్‌ల నుంచి పెద్ద ఎత్తున బీపీ మిషన్లు, స్టెతస్కోప్‌లు, గ్లూకోజ్ టెస్టింగ్ మిషన్లు, సిరంజీలతో పాటు భారీగా గడువు తీరిన మందులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్ జోన్ డీసీపీ కోటి రెడ్డి మాట్లాడుతూ.. నకిలీ డాక్టర్ల వల్ల రోగుల ప్రాణాలకు తీవ్రమైన ముప్పు ఉందని తెలిపారు. ప్రజల ఆరోగ్యంతో ఆడుకునే వారిపై చట్టపరంగా అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు చికిత్స కోసం వెళ్లే ముందు సదరు వైద్యులకు సరైన మెడికల్ సర్టిఫికేషన్లు, అర్హతలు ఉన్నాయో లేదో చూసుకోవాలని ఆయన సూచించారు. మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎలాంటి అర్హత లేని వ్యక్తులు క్లినిక్‌లు నడుపుతున్నట్లు అనుమానం వస్తే వెంటనే స్థానిక పోలీసులకు గానీ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు గానీ సమాచారం అందించాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు.









