Nikitha Godishala :  అమెరికాలో జరిగిన ఓ హత్య కేసులో నిందితుడైన భారతీయ యువకుడు చివరికి పోలీసులకు చిక్కాడు. అమెరికా నుంచి పారిపోయి ఇండియాకు వచ్చిన అతడిని పోలీసులు పట్టుకున్నారు. ఇంతకు ఏం జరిగిందంటే.. అమెరికాలోని మేరీల్యాండ్‌లో నికిత గోడిశాల (27) అనే యువతి హత్యకు గురైంది. న్యూ ఇయర్ సెలబ్రెషన్స్ టైమ్ లో ఆమె తన మాజీ రూమ్‌మేట్ అయిన అర్జున్ శర్మ (26) అపార్ట్‌మెంట్‌లో కత్తిపోట్లతో చనిపోయి ఉంది. నికిత జనవరి 2న కనిపించకుండా పోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆమెపై దాడి చేసి చంపిన తర్వాత అర్జున్ శర్మ అక్కడి నుంచి పరారయ్యాడు. అతనిపై అమెరికా పోలీసులు మర్డర్ కేసులు నమోదు చేసి, అరెస్ట్ వారెంట్ జారీ చేశారు.

నిందితుడు అర్జున్ శర్మ అమెరికా నుంచి నేరుగా ఇండియాకు వచ్చి తలదాచుకున్నాడు. అయితే, అంతకుముందే అతను నికిత దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేశాడని ఆమె తండ్రి తెలంగాణలో ఒక చీటింగ్ కేసు పెట్టారు. ఆ కేసును విచారిస్తున్న హైదరాబాద్ పోలీసులు.. కొన్ని ఆధారాల ద్వారా శర్మ ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఉన్నట్లు గుర్తించారు.

అక్కడ ఒక ఫ్లాట్‌లో ఉన్న అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమెరికాలో అతనిపై హత్య కేసు పెండింగ్‌లో ఉండటం, నాన్-బెయిలబుల్ వారెంట్ ఉండటంతో వెంటనే కేంద్ర అధికారులకు సమాచారం అందించారు. దీంతో కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగి శర్మను ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచాయి. కోర్టు ఆదేశాల మేరకు ఆగస్టు 25న అతన్ని రిమాండ్‌కు తరలించారు. త్వరలోనే అతన్ని అమెరికాకు అప్పగించే అవకాశం ఉంది.

హైదరాబాద్‌కు చెందిన నికిత గత నాలుగేళ్లుగా అమెరికాలో డేటా అనలిస్ట్‌గా ఉద్యోగం చేస్తోంది. నిందితుడు అర్జున్ శర్మ గతంలో ఆమెకు రూమ్‌మేట్‌గా ఉండేవాడు. అయితే 2025 ఆగస్టు-సెప్టెంబర్ మధ్యలో శర్మ తన ఉద్యోగం కోల్పోయాడని, ఆ తర్వాత నికిత దగ్గర, ఆమె కుటుంబ సభ్యుల దగ్గర పెద్దఎత్తున అప్పులు తీసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ డబ్బులు సరిగ్గా ఇవ్వకపోవడం వల్లనే వారి మధ్య ఆర్థిక గొడవలు జరిగాయని, ఈ హత్య వెనుక డబ్బుల గొడవలే ప్రధాన కారణం కావచ్చని నికిత తండ్రి చెబుతున్నారు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.