Konda Surekha : తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇటీవల గీసుకొండలో సీఎం రేవంత్‌రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిపై కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో కొండా సురేఖపై అధిష్టానం వేటు వేస్తుందన్న ప్రచారం సాగుతున్న క్రమంలో కాంగ్రెస్‌ అధిష్టానం ఆమెను ఢిల్లికి పిలవడంతో ఆమె అక్కడికి వెళ్లారు. ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సురేఖ సమావేశం కానున్నారు. అనంతరం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అపాయింట్‌మెంట్‌ను కూడా ఆమె కోరడంతో ఆయనను కూడా కలుస్తారనే ప్రచారం సాగుతోంది.

కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కొండా సురేఖకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ (డీఏసీ) ఇదివరకే షోకాజ్‌ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో కమిటీ ఛైర్మన్‌ మల్లు రవికి ఆమె వివరణ ఇచ్చారు. మరోవైపు కొండా సురేఖతో పాటు వనపర్తి వ్యవహారంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిపై కూడా క్రమశిక్షణ సంఘం నివేదికను తయారు చేసి అధిష్ఠానానికి పంపింది. ఈ పరిణామాల నేపథ్యంలో మంత్రి కొండా సురేఖను ఢిల్లీకి పిలిపించడంతో అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే ఉత్కంఠ రాష్ర్ట రాజకీయాల్లో నెలకొంది.

Also Read : తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ఫోక్‌ డ్యాన్సర్‌ ఈశ్వర్‌సాయి.. ఎందుకంటే?

ఢిల్లీ బాట పట్టిన నాయకులు

మరోవైపు సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు సీనియర్లు కూడా ఢిల్లీ బాట పట్టడంతో కొండా సురేఖ వ్యవహారంతో పాటు కేబినెట్ విస్తరణపై జోరుగా చర్చ సాగుతోంది. అధిష్టానం పిలుపుమేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. ఆయన వెళ్లిన కొద్దిసేపటికే మంత్రి కొండా సురేఖ సైతం హస్తిన బాట పట్టారు. మరో వైపు ఇవాళ ఉదయమే శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఢిల్లీకి వెళ్లడం, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ కావడం, మరికొందరు సీనియర్ కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి చేరుకోవడంతో తెలంగాణకు సంబంధించిన కీలక అంశాలపై అధిష్టానం సంచలన ప్రకటన చేయనుందనే ప్రచారం సాగుతోంది.

Also Read : టాలీవుడ్ లో మరో ప్రేమజంట…పెళ్లిపీటలెక్కనున్న కావ్య కళ్యాణ్ రామ్, కాల భైరవ?

రాజీనామా చేస్తారా.. కొనసాగుతారా?

కాగా, కొండా సురేఖ వ్యవహారంలో అధిష్టానం సీరియస్ గా ఉందనే ప్రచారం సాగుతోంది. దీంతో ఆమె ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఆమె విషయంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన విషయంలో చర్యలు తీసుకునే అవకాశముందా? లేక సురేఖను అధిష్టానం మందలింపుతోనే వదిలేసి మంత్రిగా కొనసాగిస్తుందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రాష్ర్ట నేతలు మాత్రం ఆమెను బర్తరఫ్‌ చేయాలనే బలంగా కోరుతున్నారు. ఇప్పటికే అనేక అవకాశాలు ఇచ్చినప్పటికీ పదే పదే ఆమె పార్టీకి నష్టం కలిగించే చర్యలకు పాల్పడుతున్నారని రాష్ర్ట నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆమెపై చర్యలు తప్పకపోవచ్చన్న సంకేతాలు వస్తున్నాయి. ఒకవేళ అధిష్టానం నుంచి ఆమెకు వ్యతిరేకంగా నిర్ణయం వెలువడే పరిస్థితి ఉంటే, అంతకంటే ముందే మంత్రి పదవికి సురేఖ రాజీనామా చేస్తారని ప్రచారం సాగుతోంది.

కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధం?

ఇదిలా ఉండగానే కొండా సురేఖను మంత్రి వర్గం నుంచి తప్పించడంతో పాటు మరికొంతమందిని మంత్రి వర్గంలోకి తీసుకుంటారనే సంకేతాల నేపథ్యంలో పలువురు నేతలు ఢిల్లీ బాట పట్టారు. కేబినెట్‌లో ఖాళీగా ఉన్న స్థానాల భర్తీ చేయడం, కొత్త మంత్రుల ఎంపిక చేయడం, పార్టీకి సంబంధించిన ఇతర కీలక అంశాలపై అధిష్టానంతో చర్చించేందుకే రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారని స్థానిక నాయకులు చెబుతున్నారు. దీంతో ఆశావాహులు పలువురు తమకు అవకాశః కల్పించాలని కోరేందుకు ఢిల్లీ బాట పడుతున్నారు. ఇందులో భాగంగానే స్పీకర్ గడ్డం ప్రసాద్ ఖర్గేతో భేటీ అయ్యారనే తెలుస్తోంది. తనకు మంత్రివర్గంలో చోటు ఇవ్వాలని ఆయన కోరినట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, జి.సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, బాలు నాయక్ వంటి కీలక నేతలు తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో కేబినెట్ విస్తరణ చేస్తే స్పీకర్ స్థానంలో కొత్తవారిని నియమించి ప్రసాద్ కుమార్‌ను మంత్రివర్గంలోకి తీసుకుంటారని తెలుస్తోంది. అలాగే మరికొంతమందికి అవకాశం దక్కవచ్చని తెలుస్తోంది.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.