
Gurpreet Singh Gopi : పంజాబ్‌లో దారుణ సంఘటన జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ నేత ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. రాజకీయ కారణాలే ఈ హత్యకు కారణమని భావిస్తున్నారు. ప్రత్యర్థులు ఆయనను వెంబడించి తుపాకితో కాల్చి చంపారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆమ్ ఆద్మీ పార్టీ నేత గుర్ప్రీత్ గోపి తన స్నేహితుడు హర్‌ప్రీత్‌తో కలిసి పనిమీద మోటార్ సైకిల్‌పై వెళ్తున్నారు. అదే సమయంలో ఆయన స్నేహితులు మరి కొంతమంది కారులో బైకును ఫాలో అవ్వసాగారు.
కొంతదూరం వెళ్లిన తర్వాత ఎవ్వరూ ఊహించని విధంగా ఒక కారులో వచ్చిన కొంతమంది దుండగులు గుర్ప్రీత్ గోపి ప్రయాణిస్తున్న బైక్‌ను వెంబడించి వెంటపడ్డారు. ప్రమాదాన్ని గుర్తించిన వారు బైక్ ను వేగంగా తీసుకెళ్లినప్పటికీ దుండుగలు గుర్ప్రీత్, హర్‌ప్రీత్‌లపై తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో గుర్ప్రీత్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అంతటితో ఆగకుండా బైకు వెనుక కారులో వస్తున్న గుర్ప్రీత్ స్నేహితులపై కూడా దుండగులు కాల్పులు జరపడంతో వారు భయంతో కారును ముందుకు ఉరికించారు. పంజాబ్ లోని మమ్‌దోత్ టౌన్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దారుణంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, రాజకీయ కక్షల కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసుల ప్రాథమికంగా నిర్ధారించారు. హత్యకు పాల్పడిన ప్రధాన నిందితుడికి నేరచరిత్ర ఉందని చెప్పారు, అతడు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తి అని ఎస్ఎస్పీ భూపీందర్ సింగ్ వివరించారు. నిందితులను ఇప్పటికే గుర్తించామని, వారిని పట్టుకోవడానికి ప్రత్యేక పోలీస్ బృందాలు రంగంలోకి దింపామని వెల్లడించారు. త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు.









