
Nepal Floods : నేపాల్ లో ఆకస్మికంగా వచ్చిన వరదలు ఆ దేశాన్ని అతలాకుతలం చేశాయి. వందలాది మంది మరణించారు. వేలాది నిర్మాణాలు నేలమట్టమయ్యాయి. అనేక మంది గల్లంతయ్యారు. వారి కోసం రెస్క్యూ ఆఫరేషన్ కొనసాగుతుండగానే మరో పిడుగులాంటి వార్త నేపాల్‌ను మరోసారి వణికించింది. నేపాల్‌కు వరద ముప్పు ఇంకా తొలగిపోలేదని దీన్ని బట్టి అర్థమవుతోంది. హిమాలయ ప్రాంతంలో ఒక ‘బ్యారియర్ లేక్’ (మంచు అడ్డంకి వల్ల ఏర్పడిన సరస్సు)ను నిపుణులు గుర్తించారు. ఈ సరస్సు ఛోచేన్ ఖోలా, పురేపు త్సాంగ్‌పో నదుల సంగమం వద్ద ఏర్పడింది.
నేపాల్‌లో వచ్చిన భయానక వరదల వల్ల ప్రతి ఒక్కరూ తీవ్ర భయాందోళనలో ఉన్నారు. అయితే ప్రమాదం ఇంకా పొంచి ఉందని తెలుస్తోంది . CCTV నివేదిక ప్రకారం, బీజింగ్ అధికారులు హిమాలయన్ బోర్డర్ క్రాసింగ్ ఎగువ ప్రాంతంలో ఒక బ్యారియర్ లేక్‌ను గుర్తించారు. ఇది సహాయక చర్యలకు పెద్ద ఆటంకంగా మారే అవకాశం ఉందని తెలుస్తోంది. చైనా అధికారిక మీడియా ప్రకారం, చైనా జలవనరుల మంత్రిత్వ శాఖ ప్రమాద స్థలానికి ఈశాన్యంలో ఉన్న ఛోచేన్ ఖోలా, పురేపు త్సాంగ్‌పో నదుల సంగమం వద్ద ఏర్పడిన ఈ సరస్సుపై పర్యవేక్షణ, విచారణను వేగవంతం చేసింది. సహాయక చర్యల్లో తోడ్పడటానికి, మరిన్ని ప్రమాదాలు జరగకుండా నిరోధించడానికి ఈ చర్యలు తీసుకున్నట్లు చైనా తెలిపింది.
Also Read : హర్మూజ్‌లో సీమైన్స్‌ను తొలగించేశాం: అమెరికా సంచలన ప్రకటన
ఓవర్ ఫ్లో అవుతున్న బ్యారియర్ లేక్
గురువారం నాటికి 20 లక్షల క్యూబిక్ మీటర్ల నీటితో ఉన్న ఈ బ్యారియర్ లేక్ ఇప్పటికే పొంగిపొర్లుతోంది. చైనా సెంట్రల్ టీవీ నివేదిక ప్రకారం, రాబోయే మూడు రోజుల్లో (72 గంటల్లో) ఈ సరస్సులోకి మరో 30 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు చేరే అవకాశం ఉందని అంచాన వేస్తున్నారు. బ్యారియర్ లేక్‌ను వైమానిక సర్వే చేయడానికి , 3D మోడలింగ్ సిద్ధం చేయడానికి చైనా అధికారులు ఎనిమిది మంది సభ్యులతో కూడిన ఇంజనీరింగ్ బృందాన్ని రంగంలోకి దించారు. ఈ స్థలానికి చేరుకోవడమే అత్యంత కష్టతరమైన విషయమని ఇంజనీర్లలో ఒకరైన చెన్ హాన్క్సియావో తెలిపారు. గురువారం సాయంత్రం ఆయన మాట్లాడూ, “గ్లేసియర్ (మంచు కొండలు) విరిగిపడి సరస్సు ఏర్పడిన తర్వాత, దాని ఒడ్డున చాలా నిటారుగా ఉండే కొండ రాళ్ళు ఏర్పడ్డాయి” అని ఆయన చెప్పారు.
సరస్సు వల్ల కలిగే ప్రమాదాన్ని తగ్గించడానికి సాధారణంగా ఆకస్మికంగా ఏర్పడిన ఆనకట్ట కింది భాగంలో నీటిని బయటకు పంపడానికి ఒక కాలువ (ఛానెల్) తవ్వుతారని చెన్ తెలిపారు. అయితే నీరు ఎంత వేగంగా ప్రవహిస్తుంది, సరస్సు ఎంత త్వరగా నిండుతుంది అనే దాని ఆధారంగా ఆ కాలువ వెడల్పు, లోతును లెక్కించాల్సి ఉంటుంది. వారి సర్వే డేటా ప్రకారం, ఈ సరస్సు సుమారు 150 మీటర్ల పొడవు, 40-50 మీటర్ల లోతు కలిగి ఉంది. ఇందులో ఇప్పటికే 1.5 నుండి 2 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు నిల్వ ఉందని చైనా ఒక అంచనాకు వచ్చింది.
రాబోయే 3 రోజుల్లో చైనా ఏం చేయనుంది?
సరస్సును నిరంతరం పర్యవేక్షించడం, సరస్సు అడుగుభాగం నుండి డేటాను సేకరించడం, రాబోయే రోజుల్లో వాతావరణాన్ని పర్యవేక్షించడం వారి తదుపరి పని. గైరోంగ్ బోర్డర్ పోర్ట్ ప్రాంతంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిశాయి, దీని వల్ల ఎగువన ఉన్న ప్రమాదకరమైన జోన్ చుట్టూ ఉన్న మట్టి, రాళ్ళు లూజ్‌గా మారి అస్థిరంగా తయారయ్యాయి. రాబోయే వారంలో కూడా వర్షాలు కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు. రాబోయే మూడు రోజుల్లో మరో 3 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు (సుమారు 1,200 ఒలింపిక్ స్విమ్మింగ్ పూల్స్‌కు సమానం) ఈ ప్రకృతి సిద్ధమైన ఆనకట్ట సరస్సులోకి ప్రవహిస్తుందని చైనా గురువారం ప్రకటించింది. దీనివల్ల సరస్సుకున్న సహజ ఆనకట్ట విరిగిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది. సెప్టెంబరు 1 నాటికి నీటి ప్రవాహం గరిష్ట స్థాయికి చేరుకుంటుందని భావిస్తున్నారు.
చైనా రెస్క్యూ టీమ్ తీసిన వైమానిక ఫుటేజ్‌లో, ఎటువంటి స్పష్టమైన అవుట్‌లెట్ (బయటకు వెళ్లే మార్గం) లేని ఒక బేసిన్‌లో గోధుమ రంగు నీరు పేరుకుపోవడం కనిపించింది. ఇది ఇప్పటికే పొదలు, చెట్లను ముంచెత్తింది,రాళ్ళు, శిధిలాలతో ఏర్పడిన ఆటంకంపై తీవ్ర ఒత్తిడి తెస్తోంది.
Also Read : రష్యాలో భారీ పేలుడు.. స్పాట్‌లో ఏడుగురు మృతి.. 152 మందికి గాయాలు
భారత్‌పై కూడా దీని ప్రభావం ఉంటుందా?
మ్యాప్ ప్రకారం చూస్తే భారత్ దీనికి నేరుగా సరిహద్దుగా లేదు, కానీ నదీ వ్యవస్థ (రివర్ సిస్టమ్) పరంగా మన దేశం దీనికి అనుసంధానమై ఉంది. ఛోచేన్ ఖోలా, పురేపు త్సాంగ్‌పో నదులు ,ఈ సరస్సును పరిశీలిస్తే, భారత్ దీనికి ఉత్తరంగా సుమారు 120-140 కిలోమీటర్ల దూరంలో ఉంది. భౌగోళిక దూరం పరంగా ఇది అంత ఎక్కువ కాకపోవచ్చు. కానీ అసలు సమస్య నదుల మార్గాల కలయికతో మొదలవుతుంది. ఇక్కడి నుండి వెలువడే నీరు నేపాల్ గుండా అత్యంత వేగంగా ముందుకు సాగుతుంది. ఇది గండక్ నది నుండి బీహార్‌లోకి ప్రవేశిస్తుంది.
ఎగువన ఒత్తిడి బాగా పెరిగినా లేదా ఈ సహజసిద్ధమైన ఆనకట్ట విరిగిపోయినా, కొండచరియలు విరిగిపడటం వల్ల ఏర్పడిన ఈ సరస్సు ఒక్కసారిగా పగిలిపోతే (Outburst Flood) తీవ్ర నష్టం జరుగుతుంది. నీరు అత్యంత వేగంగా కిందికి ప్రవహిస్తుంది. దీనితో పాటు శిథిలాలు, చెట్లు, మట్టి,పెద్ద పెద్ద బండరాళ్ళు కూడా కొట్టుకొస్తాయి. ఛోచేన్ ఖోలా, పురేపు త్సాంగ్‌పో నుండి వచ్చే నీరు మొదట నేపాల్ నదీ వ్యవస్థలో చేరుతుంది. ఆ తర్వాత భోటోకోషి నీరు త్రిశూలి నదితో కలుస్తుంది. ఈ నీరే ముందుకు సాగి గండక్ లేదా నారాయణి నదిలో కలిసి, ఆపై భారత్‌లోకి ప్రవేశిస్తుంది.
అంటే ఈ సరస్సుతో భారత్‌కు నేరుగా సంబంధం లేకపోయినా, ఈ నీరు ప్రవహించే నదీ వ్యవస్థ వల్ల బీహార్, ఉత్తరప్రదేశ్ (UP) రాష్ట్రాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎగువ ప్రాంతాల్లో హఠాత్తుగా నీటి ప్రవాహం పెరిగితే, దిగువ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు కష్టాలు పెరుగుతాయి. కాబట్టి ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలు అత్యంత అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. సరస్సులోని నీరు స్థిరంగా ఉంటుందా లేదా వేగంగా కిందికి కొట్టుకొస్తుందా అనే దానిపైనే తదుపరి పరిస్థితి ఆధారపడి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరో 72 గంటలు గడిస్తే గానీ, నదీ ప్రవాహ స్థితిని అంచనా వేయలేమని అధికారులు వెల్లడించారు.









