Explosion In Russia : రష్యలోని తూర్పు అముర్ ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అముర్ గ్యాస్ అండ్‌ కెమికల్ కాంప్లెక్స్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు మృతిచెందగా.. మరో 152 మంది గాయపడ్డారు. వీరిలో తీవ్రగాయాలైన 36 మందిని ఆస్పత్రులకు తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఈ పేలుడులో మరో 9 మంది ఆచూకీ గల్లంతైంది. మృతుల్లో ఆరుగురు చైనా జాతీయులు ఉన్నట్లు ఏజీసీసీ యాజమాన్యం వెల్లడించింది.

Also Read : అతిపెద్ద డ్యాం నిర్మిస్తున్న చైనా.. భారత్‌కు పొంచి ఉన్న మెగా ముప్పు

ఏజీసీసీ ప్లాంట్ ప్రారంభానికి ముందు ప్రీ-కమిషనింగ్ పనులు జరుగుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్లాంట్‌లో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో పెద్దఎత్తున మంటలు ఎగిసి పడ్డాయి. దట్టమైన పొగ ఆ ప్రాంతం మొత్తం విస్తరించింది. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా, రష్యాలోని స్వోబోడ్నీ సమీపంలో అముర్ గ్యాస్ కెమికల్ కాంప్లెక్స్‌ను రష్యా, చైనా దేశాలు కలిసి సంయుక్తంగా నిర్మించాయి. ఈ ప్రాజెక్టు విలువ సుమారు 10 బిలియన్ డాలర్లుగా చెబుతారు. రష్యన్ పెట్రోకెమికల్ కంపెనీ సిబూర్, చైనా ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు, గ్యాస్ దిగ్గజం సినోపెక్ లు కలిసి దీనిని నిర్మించాయి.

పాలిథిలీన్, పాలీప్రొపిలీన్‌ను ఉత్పత్తి చేసేందుకు ప్రపంచంలోనే అతి పెద్ద పరిశ్రమగా దీనిని రెండు దేశాలు నిర్మించాయి. ప్రతి రోజు నిర్మాణ పనుల్లో సుమారు 30,000 మంది కార్మికులు పాల్గొంటున్నారు. ఈ కాంప్లెక్స్ సమీపంలోని అమూర్ గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంట్ (అమూర్ GPP) నుంచి ముడి పదార్థాలను సేకరించి వాటిని ప్లాస్టిక్ తయారీ పదార్థాలుగా మార్చేందుకు ఏజీసీసీని నిర్మించారు. పరిశ్రమ పూర్తి కార్యకలాపాలు ప్రారంభిస్తే ప్రతి ఏటా సుమారు 2.3 మిలియన్ టన్నుల పాలిథిలీన్, నాలుగు లక్షల టన్నుల పాలీప్రొపిలీన్‌ను ఉత్పత్తి చేస్తుందని అంచనా వేశారు. కానీ, ఈ లోపే ప్రమాదం చోటు చేసుకుంది.

Also Read : అది భూకంపం కాదు.. హిమనీ సరస్సు బద్ధలవడమే … నేపాల్‌ వరదలపై అమెరికా

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.