Brahmaputra River : హిమాలయ దేశం నేపాల్‌లో జలప్రళయం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. వరదల కారణంగా అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. వెయ్యిమందికి పైగా ప్రజలు గల్లంతయ్యారు. ఈ నేపథ్యంలో బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తోన్న భారీ డ్యామ్‌తో మన ఈశాన్య రాష్ట్రాలకు కూడా నేపాల్‌ లాంటి ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చైనా ఆధీనంలో ఉన్న టిబెట్ అటానమస్ రీజియన్‌లో ఈ ఆనకట్ట నిర్మాణం చేపట్టింది. అయితే ఈ రీజియన్ ప్రాంతంలో తరచూ భూకంపాలు సంభవిస్తున్నాయి. ఒకవేళ డ్యామ్ నిర్మించాక భూకంపం ఏర్పడితే భారత్, బంగ్లాదేశ్‌లపై తీవ్ర ప్రభావం పడుతుందన్నది నిపుణుల అభిప్రాయం. ఇక్కడ సంభవించే భూకంపాల కారణంగా భారీ వరదలు ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. అందుకే మైడాగ్ డ్యామ్ భారత్‌కు వాటర్ బాంబ్‌లాగా మారనుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ ఆనకట్ట వల్ల ఈశాన్య రాష్ట్రాలకు ప్రమాదం పొంచి ఉందని అంచనా వేస్తున్నారు.

Also Read : నేపాల్ వరదల్లో చిక్కుకున్న ఈశ ఫౌండేషన్ బృందం.. 80 మంది గల్లంతు?

బ్రహ్మపుత్రపై చైనా నిర్మిస్తున్న భారీ డ్యామ్ మూలంగా భారత్‌ కు ప్రమాదం పొంచి ఉంది. అయితే బీజింగ్‌తో మనకు నదీజల వివాద పరిష్కార ఒప్పందాలు, ఇతర మార్గాలు లేవు. కాకపోతే బ్రహ్మపుత్రలో ప్రవాహ హెచ్చుతగ్గులు, నీటి బాష్పీభవనం, వర్షపాతం వంటి సమాచారం మాత్రం ఇచ్చిపుచ్చుకోవడానికైతే ఒక అవగాహనా ఒప్పందం మాత్రమే ఉంది. దాన్ని అయిదేళ్లకు ఒకసారి పునరుద్ధరించుకునే అవకాశం ఉంది. ఒకవేళ డ్యామ్‌ నిర్మాణం తర్వాత చైనా దాన్ని పునరుద్ధరించకపోతే.. భారత్‌కు పెను ముప్పుగా మారునుందని తెలుస్తోంది. దీనికి తోడు ఈ నిర్మాణం చేపట్టే ప్రాంతంలో ప్రకృతి విపత్తులకూ ఆస్కారం ఎక్కువే అని నిపుణులు తెలిపారు. అందువల్ల భవిష్యత్తులో ఈ నదిలో టిబెట్‌ వైపు ఏదైనా విపత్తు సంభవించినట్లయితే. చైనా దాన్ని భారత్‌కు చేరవేయకపోతే ఈశాన్య రాష్ట్రాలు వరదల్లో మునిగే ప్రమాదం ఉందని భారతీయ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కాగా బ్రహ్మపుత్ర నది ని టిబెట్‌లో యార్లంగ్‌ జాంగ్బో అని పిలుస్తారు. ఈ నదిపైనే చైనా ఏకంగా 167 బిలియన్‌ డాలర్ల అంచనా వ్యయంతో భారీ జలవిద్యుత్తు ప్రాజెక్ట్‌ నిర్మిస్తున్నది. దీనికోసం డ్యామ్‌ నిర్మాణం చేపడుతోంది. చైనా గతంలో నిర్మించిన ప్రపంచంలో అతిపెద్దదైన త్రీగోర్జెస్‌ డ్యామ్‌కన్నా ఇది మూడురెట్లు పెద్దది. బ్రహ్మపుత్ర నది ‘గ్రేట్‌ బెండ్‌’గా పిలిచే భారీ వంపు ప్రాంతంలో నీరు రెండువేల మీటర్ల దిగువకు ప్రవహిస్తుంది. స్వల్పదూరంలో పైనుంచి పడటంవల్ల అక్కడ జల విద్యుత్తు ఉత్పత్తి ఎక్కువగా చేయవచ్చని చైనా భావిస్తోంది. ఇక్కడ ఏటా 60వేల మెగావాట్ల విద్యుత్‌ను ఇది ఉత్పత్తి చేయాలని చైనా భావిస్తోంది. అయితే, ఈ నిర్మాణ ప్రాంతమే ఇప్పుడు భారత్‌కు సమస్యగా మారనుంది.

ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణం పై ఆ మధ్య చైనా జియలాజికల్‌ సర్వే పర్యవేక్షణలో ఓ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న ప్రాంతం అడుగు భాగంలోనే ‘పైజెన్‌ ఫాల్ట్‌’ (పగులు) ఉందని గుర్తించారు, ఇది అక్కడున్న రాళ్లను చీల్చుతుందని పేర్కొన్నారు. ఇది ప్లిస్టోసిస్‌ (మంచుయుగం) కాలం నుంచి చురుగ్గా ఉన్నట్లు అంచనా వేశారు. ఈ బీటలు జల విద్యుత్‌ ప్రాజెక్టు సమీపంలో నిర్మించే డ్యామ్‌లు, రోడ్లు, వంతెనలు, సొరంగాల వంటి మౌలిక సదుపాయాలను గణనీయంగా దెబ్బతీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు. అందువల్ల భూకంపాలు సంభవిస్తే ఇక్కడ పరిస్థితిని అంచనా వేయడం కూడా కష్టమేనని నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అలాగే మైడాగ్ నిర్మాణంపై భారత్ ఆందోళనలను వ్యక్తం చేస్తోంది. ఈ నిర్మాణం పూర్తయితే బ్రహ్మపుత్ర జలాలు పూర్తిగా చైనా ఆధీనంలోకి వెళ్లిపోతాయి. చైనా ఆ జలాలను ఎక్కువ కాలం నిల్వ ఉంచి ఒకేసారి విడుదల చేస్తే ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వరదలు సంభవిస్తాయి. అలాగే వేసవిలో చైనా అసలు జలాలనే విడుదల చేయకపోతే నీటి ఎద్దడి నెలకొంటుంది. ఈ నదిపై కోట్లాది మంది భారతీయుల జీవనాధారం ఆధారపడి ఉంది. అస్సాం, అరుణాచల్‌ రాష్ట్రాల ప్రజలకు బ్రహ్మపుత్రనే పూర్తి ప్రాణాధారం. ప్రతిసారి బ్రహ్మపుత్ర వరదల వల్ల ఈశాన్య రాష్ర్టాలు ఇబ్బందులు ఎదుర్కొంటాయి. ఇక డ్యామ్ పూర్తయితే మనదేశానికి చుక్కనీరు రాదు. అదే సమయంలో రెండు దేశాల మధ్య ఎదైనా గొడవ జరిగి ప్రాజెక్టు గేట్లు ఎత్తివేస్తే ఈశాన్య రాష్ర్టాలకు తీవ్ర నష్టం తప్పదు. అందుకే బీజింగ్ మెగా డ్యామ్‌ సమస్యను ఎదుర్కొనేందుకు భారత్‌ కూడా 11వేల మెగావాట్ల సియాంగ్‌ అప్పర్‌ మల్టీపర్పస్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని సియాంగ్‌ నదిలో నిర్మించతలపెట్టిన ఈ డ్యామ్‌.. ఎగువ నుంచి వచ్చే నీటి ప్రవాహాన్ని నియంత్రించేందుకు ఉపయోగపడనుంది.

Also Read : TMC రెబల్ ఎంపీలకు బిగ్ షాక్.. లోక్‌సభ నోటీసులు!

నేపాల్‌ ను హెచ్చరించని చైనా

కాగా, చైనా నేపాల్‌ మధ్య సమాచార మార్పిడికి సంబంధించిన ఒప్పందం లేకపోవడం వల్ల మంచు చరియలు విరగడంతో టిబెట్‌ వైపు వరద సంభవించినట్లు చైనాకు ముందే తెలిసినా తమను హెచ్చరించలేదని నేపాల్‌ఆరోపిస్తోంది. రెండు దేశాల మధ్య దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ఒప్పందం లేకపోవడం వల్ల నేపాల్‌ను బీజింగ్‌ ముందస్తుగా అప్రమత్తం చేయలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. నేపాల్‌ కాలమానం ప్రకారం ఉదయం 8.15 గంటలకు టిబెట్‌లోని కెరుంగీ కౌంటీలో మెరుపు వరదలు సంభవించినట్లు తెలుస్తోంది. ఈ ఘటన జరిగిన దాదాపు 45 నిమిషాల తర్వాత నేపాల్‌కు వరదల విషయం తెలిసింది. అంత సమయం ఉన్నా కూడా చైనా అధికారులు నేపాల్‌ను అప్రమత్తం చేయలేదని నేపాల్‌ ఆరోపించింది. అయితే కొంతమంది స్థానికుల ద్వారా విషయం తెలిసి నేపాల్‌ అప్రమత్తమయ్యే సమయానికి జరగకూడని నష్టం జరిగిపోయింది.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.