
Cyber Fraud : తెలంగాణ రాజధాని నగరంలో సరికొత్త హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్ ముఠాల భయం ఎక్కువైంది. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రద్దీగా ఉండే ఆర్టీసీ బస్సులు, బహిరంగ ప్రదేశాల్లో కొన్ని ముఠాలు సీనియర్ సిటిజన్లు, సాంకేతిక పరిజ్ఞానం తక్కువగా ఉన్న అమాయకులను లక్ష్యంగా చేసుకుని ఈ ముఠాలు ఫోన్లను దొంగిలిస్తున్నాయి. ఇలాంటి ముఠాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనర్ హెచ్చరించారు. స్మార్ట్ఫోన్లు వాడుతున్న వృద్ధులను, అమాయకులను లక్ష్యంగా చేసుకుని వీరు ఫోన్ల చోరీలకు పాల్పడుతున్నారని ఆయన వివరించారు. వృద్ధులను, అమాయకులను గుర్తించి వారు.. స్క్రీన్ లాక్ ఎలా ఓపెన్ చేస్తున్నారో వారి వెనుక నిలబడి నిశితంగా గమనిస్తారని, అనంతరం చోరీ చేస్తున్నట్లు తమ విచారణలో తేలిందని సజ్జనార్ తెలిపారు.
Also Read : మరో ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం… ఏడుగురు మృతి
అమాయకులు, వృద్దుల ఫోన్ లాక్ అయి.. పాస్వర్డ్ తెలియకపోతే వీరు అత్యంత చాకచక్యంగా ‘సోషల్ ఇంజినీరింగ్’ నాటకాలకు తెరలేపుతారని సీపీ వివరించారు. ‘‘బాధితుడు తన పోయిన ఫోన్‌కు కాల్ చేయగానే నిందితులు లిఫ్ట్ చేసి.. తాము బస్సు కండక్టర్ లేదా డ్రైవర్ అని చెప్పి ఫోన్ తమకు బస్సులో దొరికిందని చెబుతారు. వచ్చే స్టాప్‌లో ఇచ్చేస్తామని నమ్మిస్తారు. ఆ తర్వాత వారి వివరాలు సరిచూడాలనే నెపంతో బాధితుడితోనే స్క్రీన్ లాక్ పాస్వర్డ్ చెప్పించుకుంటారని సీపీ వివరించారు. మరికొన్ని సందర్భాల్లో రోడ్డుపై ఫోన్ దొరికిందని.. వేరొకరు కూడా ఆ ఫోన్ తమదే అని అంటున్నారని చెబుతారు. ఫోన్ మీదే అని రుజువు కావాలంటే స్క్రీన్ పాస్వర్డ్ చెప్పాలని నమ్మించి అన్‌లాక్ వివరాలు రాబట్టి ఫోన్ కొట్టేస్తున్నారని సజ్జనార్ వివరించారు.
Also Read : ప్రముఖ బాలీవుడ్ నటుడు అరెస్ట్… ఎండీ డ్రగ్స్ స్వాధీనం
ఒకవేళ ఫోన్ పోయినట్లయితే వెంటనే సంబంధిత టెలికాం సర్వీస్ ప్రొవైడర్‌ను సంప్రదించి తమ సిమ్ కార్డును బ్లాక్ చేయించాలని సూచించారు. అలాగే బ్యాంక్ కస్టమర్ కేర్‌కు కాల్ చేసి నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ సేవలను తాత్కాలికంగా ఫ్రీజ్ చేయించుకోవాలన్నారు. అనంతరం కేంద్ర ప్రభుత్వానికి చెందిన అధికారిక పోర్టల్ www.ceir.gov.inలో మొబైల్ IMEI నంబర్ నమోదు చేసి ఫోన్‌ను వెంటనే బ్లాక్ చేయించాలని సూచించారు. ఒకవేళ ఫోన్ ద్వారా ఖాతా నుంచి డబ్బులు కట్ అయినట్లు గుర్తిస్తే వెంటనే జాతీయ సైబర్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు కాల్ చేయాలని సీపీ వారికి వివరించారు. ముఖ్యంగా ఇంట్లోని యువత తమ కుటుంబాల్లోని సీనియర్ సిటిజన్లు, వృద్ధులకు ఈ తరహా సరికొత్త నేరాల పట్ల అవగాహన కల్పించాలని, వారు ప్రయాణాల్లో ఫోన్లు వాడేటప్పుడు అప్రమత్తంగా ఉండేలా చూసుకోవాలి’’ అని సీపీ సజ్జనార్ సూచించారు.









