
US-Iran War : మధ్యప్రాచ్యంలో అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఇరాన్‌పై సైనిక చర్యలను విస్తరించడంతో పాటు, ఆ దేశ చమురు ఎగుమతులకు కీలకమైన ఖార్గ్ (Kharg) ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ విదేశాంగ శాఖ తీవ్రస్థాయిలో మండిపడింది. తమ భూభాగంపైకి అమెరికా సైన్యం అడుగుపెడితే గట్టి బుద్ధి చెబుతామని హెచ్చరించింది. అగ్రరాజ్యం ఏ రకమైన సాహసానికి ఒడిగట్టినా తీవ్ర పర్యవసానాలు అనుభవించక తప్పదని స్పష్టం చేసింది.
ఈ పరిణామాలపై ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘేయి (Esmaeil Baghaei) స్పందిస్తూ అగ్రరాజ్యానికి నేరుగా సవాల్ విసిరారు. “అమెరికా సైన్యం ఒకవేళ భూతల దండయాత్రకు తెగబడితే, వారిని ఆహ్వానించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆ ప్రాంత ప్రజలు, సైన్యం వారి రాక కోసం నిమిషాలు లెక్కిస్తూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు” అని వ్యాఖ్యానించారు. అమెరికా చేసే ఎలాంటి దాడికైనా తక్షణమే, ఊహించని రీతిలో బదులిస్తామని ఆయన పేర్కొన్నారు.
Also Read : దుబాయ్ లో వైభవం.. అంగరంగ వైభవంగా బోనాల పండుగ!
In response to a question about Trump’s comments on seizing Kharg Island, Iran’s Foreign Ministry spokesperson @IRIMFA_SPOX stated: “They will face the repercussions. There are numerous people in those very regions who are eagerly awaiting their arrival.” pic.twitter.com/G2HKNVeiEU
— IRNA News Agency ☫ (@IrnaEnglish) July 20, 2026
ఇరాన్‌లోని బుషెహర్ ప్రావిన్స్ తీరానికి సుమారు 55 కిలోమీటర్ల దూరంలో పర్షియన్ గల్ఫ్‌లో ఖార్గ్ ద్వీపం ఉంది. ఇది ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైన వెన్నెముక వంటిది. ఆ దేశ మొత్తం చమురు ఎగుమతుల్లో సుమారు 90 శాతం ఒక్క ఈ ద్వీపం నుంచే జరుగుతాయి. అత్యంత ఆధునికమైన ఆయిల్ టెర్మినల్స్, నిల్వ కేంద్రాలు ఇక్కడ ఉన్నాయి. ఈ ద్వీపాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటే ఇరాన్ చమురు వ్యాపారాన్ని దెబ్బతీసి, ఆ దేశాన్ని ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తీయవచ్చని అమెరికా భావిస్తోంది.
ఇదే సమయంలో అమెరికాతో కుదిరిన మధ్యంతర అవగాహన ఒప్పందంపై ఇరాన్ తమ వైఖరిని పునరుద్ధరించింది. ఈ ఒప్పందంలో ఉన్న 14 నిబంధనలు (Clauses) చాలా స్పష్టంగా ఉన్నాయని, వాటిని ఉల్లంఘించడానికి అమెరికాకు ఎలాంటి సాకులూ లేవని బఘేయి తెలిపారు. ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) నిర్వహణ, భద్రతా బాధ్యతలు పూర్తయినా ఇరాన్ ఆధీనంలోనే ఉంటాయని స్పష్టం చేశారు. ఈ అంశంపై మిత్రదేశమైన ఒమన్‌తో పాటు ప్రాంతీయ దేశాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు.
అమెరికా సైన్యానికి ఖార్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునే సాంకేతిక, సైనిక సామర్థ్యం ఉన్నప్పటికీ, దాన్ని దీర్ఘకాలం పాటు తమ ఆధీనంలో ఉంచుకోవడం అత్యంత ప్రమాదకరమని అంతర్జాతీయ భద్రతా నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇరాన్ సమీపంలోనే ఉండటంతో, ఖార్గ్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణులు (Missiles), విధ్వంసకర డ్రోన్లతో దాడులు చేసే అవకాశం ఉంది. దీనివల్ల పర్షియన్ గల్ఫ్‌లో నౌకాయానం పూర్తిగా నిలిచిపోయి, ప్రపంచ చమురు సరఫరా తీవ్రంగా దెబ్బతింటుంది.
ఈ యుద్ధ ప్రచారంతో ప్రపంచ ఇంధన విపణిలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకవేళ ఖార్గ్ ద్వీపంపై దాడి జరిగి, చమురు ఉత్పత్తి నిలిచిపోతే అంతర్జాతీయంగా ముడిచమురు (Crude Oil) ధరలు ఆకాశాన్నంటే ముప్పు ఉంది. అమెరికా కేవలం దౌత్యపరమైన ఒత్తిడి కే పరిమితం కాకుండా సైనిక మోహరింపులకు దిగితే, ఇది రెండు దేశాల మధ్య మాత్రమే కాకుండా మొత్తం మధ్యప్రాచ్య ప్రాంతాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేస్తుందని భద్రతా విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
Also Read : జపాన్ ఓపెన్ విజేతగా పీవీ సింధు.. సరికొత్త చరిత్ర సృష్టించిన భారత షట్లర్









