
Dubai Bonalu 2026: దుబాయ్‌లో ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ (ETCA) ఆధ్వర్యంలో శ్రీ మహంకాళి అమ్మవారి బోనాల మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. 2026 జూలై 19వ తేదీన రాస్ అల్ ఖైమాలోని మైప్తి ఫార్మ్స్‌లో నిర్వహించిన ఈ వేడుకకు యూఏఈలోని వివిధ ఎమిరేట్స్‌ల నుండి సుమారు 400 మంది తెలంగాణ ప్రవాసులు కుటుంబ సమేతంగా హాజరై భక్తిప్రపత్తులతో పాల్గొన్నారు. ఎడారి నేలపై తెలంగాణ సంస్కృతిని, ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రతిబింబిస్తూ ETCA వరుసగా నాలుగో ఏడాది ఈ బోనాల పండుగను ఘనంగా నిర్వహించడం విశేషం.
ఈ కార్యక్రమం సంప్రదాయబద్ధంగా గౌరీ పూజతో ప్రారంభమైంది. అమ్మవారికి ప్రత్యేక పూజలు, బోనాల సమర్పణ, కుంకుమార్చన, అష్టోత్తర శతనామార్చన, మహాహారతులు నిర్వహించారు. మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో, రంగురంగుల పూలతో అలంకరించిన బోనాలను తలపై మోసుకుంటూ నిర్వహించిన ఊరేగింపు వేడుకకే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఒగ్గు డోలు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలు, జముకుల వాయిద్యాల మధ్య సాగిన ఈ ఊరేగింపు, తెలంగాణ పల్లె వాతావరణాన్ని గుర్తుకు తెచ్చింది.
Also Read : జపాన్ ఓపెన్ విజేతగా పీవీ సింధు.. సరికొత్త చరిత్ర సృష్టించిన భారత షట్లర్
–> దుబాయ్‌లో ఘనంగా శ్రీ మహంకాళి అమ్మవారి బోనాల మహోత్సవం
–> ETCA ఆధ్వర్యంలో రాస్ అల్ ఖైమాలో వైభవంగా బోనాల వేడుకలు
–> యూఏఈలోని ఏడు ఎమిరేట్స్ నుంచి సుమారు 400 మంది తెలంగాణ ప్రవాసులు పాల్గొన్నారు
–> వరుసగా నాలుగో ఏడాది బోనాల మహోత్సవాన్ని నిర్వహించిన ETCA
–> వెండి బోనాలు,… pic.twitter.com/YfrhmlyXNq
— RTV (@RTVnewsnetwork) July 20, 2026
ఈ కార్యక్రమానికి మైప్తి ఫార్మ్స్ నిర్వాహకులు కొత్తి జైపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విదేశాల్లో ఉన్నా తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాలను భావితరాలకు అందిస్తున్న ETCA సభ్యుల కృషిని ఆయన ప్రశంసించారు. ETCA వ్యవస్థాపక అధ్యక్షుడు కిరణ్ కుమార్ పీచర, ప్రస్తుత అధ్యక్షుడు జగదీష్ రావు మాట్లాడుతూ, యూఏఈలో నివసిస్తున్న ప్రవాసులకు, ముఖ్యంగా విదేశాల్లో పుట్టిన పిల్లలకు మన గొప్ప సంస్కృతిని పరిచయం చేయడమే అసోసియేషన్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. బోనాలు కేవలం పండుగ మాత్రమే కాదు, తెలంగాణ ఐక్యతకు ప్రతీక అని వారు పేర్కొన్నారు.
ఈ మహోత్సవాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన వాలంటీర్లు, కళాకారులు, దాతలు హాజరైన ప్రవాసులందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. చివరగా నిర్వహించిన దీపోత్సవం భక్తులను విశేషంగా ఆకట్టుకోగా, సామూహిక హారతితో ఆధ్యాత్మిక కార్యక్రమం ముగిసింది. అనంతరం అందరికీ మహాప్రసాదం వడ్డించారు. సంప్రదాయ తెలంగాణ వంటకాలతో కూడిన భోజనంతో, స్వగ్రామంలో పండుగ చేసుకున్న అనుభూతిని పొందామని ప్రవాసులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ETCA ప్రతినిధులు, వివిధ విభాగాల సభ్యులు, మహిళా విభాగం పెద్ద సంఖ్యలో తెలంగాణ ప్రవాసులు పాల్గొన్నారు.
Also Read : ట్రంప్ సంతకానికి విలువే లేదు: ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ సంచలన వ్యాఖ్యలు









