US Iran War : పశ్చిమాసియా ప్రాంతం మళ్లీ యుద్ధ జ్వాలలతో దద్దరిల్లుతోంది. అమెరికా, ఇరాన్‌ల మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చి పతాకస్థాయికి చేరుకున్నాయి. జోర్డాన్‌లోని తమ కీలక సైనిక స్థావరాలు, కమాండ్ సెంటర్లపై ఇరాన్ క్షిపణి దాడులకు తెగబడటంతో, దానికి ప్రతిగా అమెరికా మిలిటరీ దక్షిణ ఇరాన్‌పై అత్యంత శక్తివంతమైన వైమానిక, క్షిపణి దాడులు ప్రారంభించింది. ఈ ఊహించని పరిణామాలతో టెహ్రాన్ తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతోంది.

అమెరికా చేపట్టిన ఈ ప్రతిదాడితో ఇరాన్‌లోని వ్యూహాత్మక ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దక్షిణ ఇరాన్‌లోని ఖేష్మ్ ద్వీపంతో పాటు, అత్యంత కీలకమైన అణువిద్యుత్ కేంద్రం ఉన్న తీరనగరం బుషెహర్‌ను లక్ష్యంగా చేసుకుని యూఎస్ బలగాలు విరుచుకుపడ్డాయి. ఖేష్మ్ ద్వీపంలోని నివాస ప్రాంతాలపై కూడా క్షిపణులు పడటంతో తీవ్ర నష్టం వాటిల్లిందని ఇరాన్ స్థానిక మీడియా వెల్లడించింది.

అంతకుముందు, జోర్డాన్‌లోని అమెరికా ఎయిర్‌బేస్‌పై బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ధ్రువీకరించింది. అమెరికా నుంచి ముప్పు, బెదిరింపులు కొనసాగినంత కాలం తమ వైపు నుంచి ప్రతీకార చర్యలు తప్పవని ఐఆర్‌జీసీ హెచ్చరించింది. అయితే, ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులను విజయవంతంగా అడ్డుకున్నామని తెలిపిన యూఎస్ సెంట్రల్ కమాండ్, ప్రతిగా ఇరాన్‌లోని డజన్ల కొద్దీ వ్యూహాత్మక లక్ష్యాలపై బాంబుల వర్షం కురిపించినట్లు పేర్కొంది.

Also Read : ఐరోపాను వణికిస్తున్న కార్చిచ్చులు: ప్రాన్స్ రక్షణ రంగానికి ముప్పు, స్పెయిన్‌లో తీవ్ర విధ్వంసం

ఇదిలా ఉండగా, ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ యుద్ధం క్రమంగా ఇతర ప్రాంతాలకూ విస్తరిస్తోంది. ఇరాన్, గల్ఫ్ దేశాలకే పరిమితమైన పోరు ఈజిప్ట్‌లోని డమియెట్టా పోర్ట్‌కూ తాకింది. అక్కడ అమెరికాకు చెందిన తేలియాడే ఇంధన నిల్వ కేంద్రం (LNG) వద్ద ద్రవీకృత సహజ వాయువును లోడింగ్ చేస్తున్న సమయంలో డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడి వల్ల భారీగా మంటలు చెలరేగి పక్కనే ఉన్న గ్రీకు గ్యాస్ ట్యాంకర్‌కూ విస్తరించాయి.

డమియెట్టా పోర్ట్‌లో చెలరేగిన అగ్నికీలల నుంచి అత్యవసర సహాయక బృందాలు నావికులను సురక్షితంగా బయటకు తరలించాయి. ఈ ప్రమాదంలో రెండు సహజ వాయువు ట్యాంకర్లు తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఈజిప్టు పెట్రోలియం మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది. కాగా, ఈ దాడి వెనుక ఇరాన్ ప్రమేయం ఉందా అనే కోణంలో ఇంకా అధికారికంగా నిర్ధారణ రాకపోయినప్పటికీ, అంతర్జాతీయంగా ఇంధన భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఈజిప్టులో అమెరికా ఇంధన సదుపాయాలపై దాడి జరిగిన వెంటనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఫాక్స్ న్యూస్‌కి ఇచ్చిన ఫోన్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. “ఇప్పుడు మా వంతు వచ్చింది. ఇరాన్‌పై అత్యంత ఘోరంగా దెబ్బకొడతాం. శత్రువులకు గట్టి బుద్ధి చెబుతాం” అని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ తీరని పరిణామాలు ఎదుర్కోక తప్పదని, ఆ దేశాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తామని వ్యాఖ్యానించారు.

శాంతి యత్నాలు తాత్కాలిక విరామానికే పరిమితమవ్వడం, దౌత్య చర్చల ఆశలను అడియాశలు చేస్తోంది. గతంలో జరిగిన 10 రోజుల తీవ్ర దాడుల తర్వాత ఒప్పందాలు కుదిరి కాస్త ప్రశాంతత లభించినప్పటికీ, తాజా వరుస దాడులతో పరిస్థితులు మళ్లీ మొదటికి వచ్చాయి. నాయకులు చేస్తున్న ఘాటు వ్యాఖ్యలు, సైనిక చర్యలు అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళనకు దారితీస్తున్నాయి.

ఈ యుద్ధ పరిణామాలు ప్రపంచాన్ని తీవ్ర ఇంధన సంక్షోభంలోకి నెట్టేసే ప్రమాదం పొంచి ఉంది. చమురు ఉత్పత్తి, రవాణా కేంద్రాలైన గల్ఫ్, ఎర్రసముద్ర ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం నెలకొనడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు, గ్యాస్ ధరలు ఆకాశాన్నంటే అవకాశముంది. ఘర్షణలు మరింత విస్తరిస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా నష్టపోతుందని ఆర్థిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Also Read : ఇండియన్స్‌కు ఊరట.. అమెరికా గ్రీన్ కార్డ్ బిల్లులో కీలక ప్రతిపాదనలు..!

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.