
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరికొత్త ప్లాన్‌కు తెరతీశారు. నవంబర్ 3న జరగనున్న మిడ్-టర్మ్ ఎన్నికలు ముగిసిన వెంటనే ఇరాన్‌పై భయంకరమైన రీతిలో విరుచుకుపడేందుకు ఇజ్రాయెల్‌తో కలిసి ప్లాన్ చేశారు. రాబోయే దాడులు అత్యంత తీవ్రంగా, స్వల్పకాలిక మిలిటరీ ఆపరేషన్‌గా ఉండబోతున్నాయని, దీనికి తగినట్లుగా సిద్ధంగా ఉండాలని అమెరికా ఇప్పటికే గల్ఫ్ అరబ్ దేశాలను హెచ్చరించింది. ఈ మేరకు అమెరికా రక్షణ దళాలు తమ వద్ద ఉన్న ఆయుధ సంపత్తిని, క్షిపణులను పెద్ద ఎత్తున భర్తీ చేసుకోవడంతో పాటు బాంబర్ విమానాలు, జెట్ ఫైటర్లను దాడుల కోసం సర్వసన్నద్ధం చేస్తున్నాయి.
ఇరాన్ గురిచేసే క్షిపణి దాడులను తిప్పికొట్టేందుకు అమెరికా టెక్సాస్ నుంచి అత్యంత శక్తివంతమైన ప్యాట్రియాట్ పేట్రియాట్ ఎయిర్ అండ్ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్‌ను రప్పించి తన సైనిక స్థావరాల వద్ద రక్షణను నిగూఢం చేసింది. అంతేకాకుండా ప్రమాదకరమైన ప్రాంతాల్లో ఉన్న తమ సైనికులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. వచ్చే నెలలో దాదాపు 20 యుద్ధనౌకలతో పాటు మరొక యుద్ధనౌక క్యారియర్ స్ట్రైక్ గ్రూప్, మెరైన్ ఎక్స్‌పెడిషనరీ యూనిట్ మిడిల్ ఈస్ట్‌లో ల్యాండ్ కానున్నాయి. ఇరాన్‌పై దాడికి ముందే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్షేత్రస్థాయిలో సర్వశక్తులనూ మోహరిస్తున్నారనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Also Read : 24 గంటల్లో 5 భూకంపాలు.. అర్నాబ్ తుఫాన్ తెచ్చిన ప్రళయమా? సముద్రంలో ఏం జరుగుతోంది?
మరోవైపు ఇరాన్‌తో సాగిస్తున్న యుద్ధం అమెరికా ఖజానాను ఖాళీ చేస్తోంది. పెంటగాన్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం ఇరాన్ యుద్ధం కోసం అమెరికా సైన్యం ఇప్పటివరకు ఏకంగా 47 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువే ఖర్చు చేసింది. గతేడాది జూలైలో రక్షణ శాఖ అంచనా వేసిన దానికంటే ఇది 25 శాతం ఎక్కువ. యుద్ధంలో ఉపయోగించిన ఆయుధాలను పునరుద్ధరించడానికే దాదాపు 29 బిలియన్ డాలర్లు వెచ్చించగా.. ధ్వంసమైన సైనిక పరికరాల స్థానంలో కొత్తవి తేవడానికి 6 బిలియన్ డాలర్లు, సైనికుల ఇతర ఖర్చుల కోసం 11.9 బిలియన్ డాలర్లు ఖర్చయ్యాయి. జూలై నాటికే యుద్ధ ఖర్చు 37.5 బిలియన్ డాలర్లుగా ఉందని డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సెత్ ప్రకటించారు.
ఇరాన్ తమతో శాంతి ఒప్పందానికి రాకపోతే వారిపై ‘లిటిల్ ఎపిక్ ఫ్యూరీ’ పేరుతో మరో ప్రళయకర దాడి చేస్తామని ప్రెసిడెంట్ ట్రంప్ ఫ్లోరిడా ఎన్నికల ప్రచారంలో బహిరంగంగానే తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఎన్నికల కంటే ముందే దాడి చేసే ఉద్దేశం లేదని ఆయన స్పష్టం చేసినప్పటికీ.. మధ్యలో రాయబారులు మాత్రం ఈ దాడి ఎప్పుడైనా జరగొచ్చని సంకేతాలు ఇస్తున్నారు. ఫిబ్రవరి 28న ప్రారంభమైన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ యుద్ధం ఇంకా సాగుతూనే ఉందన్న విషయాన్ని ఇక్కడ గుర్తుచేసుకోవాలి.
అసలు ఇరాన్‌పై అమెరికా ప్రధానంగా విరుచుకుపడటానికి కారణం వారి అణుబాంబు తయారీ కలలను నాశనం చేయడమే. 2025 జూన్‌లో ఇరాన్‌లోని ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్‌లోని మూడు ప్రధాన అణు కేంద్రాలను తమ బలగాలు పూర్తిగా ధ్వంసం చేశాయని, వారి అణు ప్రాజెక్టును దశాబ్దాల వెనక్కి నెట్టామని ట్రంప్ ప్రకటించారు. దీనిపై అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ స్పందిస్తూ గడిచిన రెండేళ్లలో ఇరాన్ దెబ్బతిన్న అణుకేంద్రాలను పునర్నిర్మించే ప్రయత్నాలు ఏవీ చేయలేదని ధృవీకరించింది. అయినప్పటికీ ఇరాన్ మళ్లీ అణు ఆయుధాలు తయారుచేయకుండా శాశ్వతంగా వారి ప్రాజెక్టును తుడిచిపెట్టేందుకే ట్రంప్ ఈ నయా దాడులకు ప్లాన్ చేస్తున్నారని అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్నారు.
Also Read : స్క్రీన్ దాటి వచ్చే సువాసనలు.. డిజిటల్ ప్రపంచంలో సరికొత్త విప్లవం!









