Exciting Days Lie : ఇంటర్నెట్ అంటే ఇప్పటివరకు కేవలం మనకు కనిపించే దృశ్యాలు, వినిపించే శబ్దాలకే పరిమితం అనుకుంటున్నాం. కానీ ఇకపై మనం వాడే స్క్రీన్ల నుంచి ఇష్టమైన సువాసనలను కూడా ఆస్వాదించే అద్భుతమైన రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. అమెరికాలోని ఒహాయో స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చైనాకు చెందిన జెజియాంగ్‌ ల్యాబొరేటరీ పరిశోధకులు సంయుక్తంగా చేసిన పరిశోధనలు ఈ అద్భుతానికి ప్రాణం పోశాయి. డాక్టర్ చున్యు యాంగ్ నేతృత్వంలో రూపుదిద్దుకుంటోంది.

ఈ విప్లవాత్మక టెక్నాలజీ అసలు ఎలా పనిచేస్తుందనే ఆసక్తి అందరిలోనూ కలుగుతుంది. డిజిటల్ సిగ్నల్స్, ఏఐ సహాయంతో వాసనలను ప్రసారం చేయడం చేస్తుంది. ఇందులోని ‘ఎలక్ట్రానిక్ నోస్‌’ పరికరం వాసనల్లోని రసాయన సమ్మేళనాలను పసిగట్టి దానిని డిజిటల్ డేటాగా మారుస్తుంది. ఈ సమాచారం ఇంటర్నెట్ ద్వారా అవతలి వైపు ఉన్న రిసీవింగ్ పరికరానికి చేరుతుంది. అక్కడ ఉన్న మైక్రో-అటామైజర్లు లేదా స్ప్రేయర్ల ద్వారా అచ్చం అలాంటిదే అయిన కమ్మటి పరిమళం గదిలో వ్యాపిస్తుంది. ఉదాహరణకు వేల మైళ్ల దూరంలో ఉన్న స్నేహితుడు తాగుతున్న కాఫీ సువాసనను మనం ఇక్కడే ల్యాప్‌టాప్ లేదా ఫోన్ ద్వారా అనుభవించే అద్భుతాన్ని ఇది సాధ్యం చేస్తుంది.

Also Read : అమెరికా డేటాలోకి చొరబడ్డ AI.. ‘ఆంథ్రోపిక్’ సంచలన ప్రకటన

అయితే వాసన అణువులు నేరుగా ఇంటర్నెట్ ద్వారా ప్రయాణించవని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. దానికి బదులుగా కేవలం డిజిటల్ డేటా మాత్రమే ప్రసారమవుతుంది. రిసీవర్ వైపు ఉన్న ప్రత్యేక పరికరాలు స్థానికంగా ఆ వాసనను ఉద్దీపన చేసి బయటికి వెదజల్లుతాయి. ఇందుకోసం సుమారు 6 అంగుళాల గ్యాస్ సెన్సర్‌ శ్రేణిని, మణికట్టు పట్టీలు లేదా నెక్లెస్‌ల రూపంలో అమర్చగలిగే చిన్నపాటి రిసీవర్లను ఉపయోగిస్తున్నారు. పీజోఎలెక్ట్రిక్ టెక్నాలజీ ఆధారంగా పనిచేసే ఈ పరికరాలు, కచ్చితమైన సువాసనలను స్థానికంగా పునఃసృష్టించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

ప్రస్తుతానికి ఈ ‘సెంట్రోనిక్‌’ టెక్నాలజీ కేవలం ఐదు రకాల వాసనలను మాత్రమే గుర్తించి పంపగలదు. కాఫీ, కేక్, బెర్రీ, ఆరెంజ్, రెడ్‌ వైన్ వంటి పరిమళాలను మాత్రమే ఇది ప్రస్తుతం ప్రసారం చేయగలదు. వివిధ వాసనలు ఒకదానితో ఒకటి కలిసిపోయినప్పుడు వాటిని వేరు చేసి గుర్తించడం, పరికర పరిమాణాన్ని మరింత తగ్గించడం, తక్కువ ఖర్చుతో తయారు చేయడం వంటి అంశాలపై ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయి.

ఈ టెక్నాలజీ మొబైల్ ఫోన్లలో ఒక సాధారణ ఫీచర్‌గా అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పట్టవచ్చు. అయినప్పటికీ, భవిష్యత్తులో ఆన్‌లైన్ షాపింగ్ రంగంలో పరిమళాలను ముందే పరీక్షించుకోవడానికి, వర్చువల్ రియాలిటీ అనుభూతులను మరో స్థాయికి తీసుకెళ్లడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వైద్య రంగంలో రోగుల వాసన కోల్పోయే సమస్యలను పరీక్షించడానికి, చికిత్స అందించడంలో ఈ సాంకేతికత ఒక విప్లవాత్మక మార్పును తెస్తుందని నిపుణులు నమ్ముతున్నారు.

Also Read : ఒక్క నంబర్ మిస్.. బర్త్ డేకు రూ.30 కోట్ల జాక్‌పాట్