అమెరికా, ఇరాన్ దేశాల మధ్య రగులుతున్న యుద్ధం తీవ్రమైంది. గత 24 గంటల్లో అమెరికా సైన్యం ఇరాన్‌పై వరుసగా మూడోసారి భీకరమైన వైమానిక దాడులకు పాల్పడింది. అయితే అమెరికా చేసిన ఈ తాజా బాంబుల దాడిలో ఇరాన్‌లోని అహ్వాజ్ నగరంలో ఉన్న ‘షాహిద్ బఘాయ్’ ఆసుపత్రి తీవ్రంగా దెబ్బతింది. ముఖ్యంగా అమాయక చిన్న పిల్లలకు కీమోథెరపీ చికిత్స అందించే క్యాన్సర్ వార్డుపై బాంబులు పడటంతో ఆసుపత్రి భవనం ధ్వంసమైంది. దీంతో చిన్నారులను అత్యవసరంగా వేరే ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది.

Also Read : హోర్మూజ్ జలసంధికి ప్రత్యామ్నాయం: గల్ఫ్ దేశాల మాస్టర్ ప్లాన్ రెడీ!

ఈ అమెరికా దాడుల్లో ఇరాన్ సైనిక శిబిరాలు కూడా ధ్వంసమయ్యాయి. ఇప్పటివరకు జరిగిన దాడుల్లో కనీసం 35 మంది ప్రాణాలు కోల్పోగా.. 300 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌తో పాటు అక్కడి ఏకైక పౌర అణు విద్యుత్ కేంద్రం ఉన్న బుషెహర్ నగరంపై కూడా అమెరికా క్షిపణుల వర్షం కురిపించింది. అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన ‘హర్మూజ్ జలసంధి’ గుండా వెళ్లే నౌకలపై ఇరాన్ దాడులు చేయకుండా అడ్డుకోవడమే తమ లక్ష్యమని, అందుకే ఆ దేశ సైనిక సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నామని అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. అలాగే ఇరాన్‌కు వెళ్తున్న ఒక ఖాళీ చమురు నౌకపై కూడా అమెరికా హెల్‌ఫైర్ క్షిపణులతో దాడి చేసి నిలిపివేసింది.

అమెరికా దాడులపై ఇరాన్ కూడా అంతే తీవ్రంగా స్పందించింది. బహ్రెయిన్‌లో ఉన్న అమెరికా 5వ నౌకాదళ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ఎదురుదాడికి దిగారు. అలాగే ఇరాన్ సరిహద్దుల్లోకి దూసుకొచ్చిన అమెరికాకు చెందిన అత్యంత అధునాతన ‘MQ-9 రీపర్’ డ్రోన్‌ను తమ సరికొత్త క్షిపణి రక్షణ వ్యవస్థ ద్వారా విజయవంతంగా కూల్చివేసినట్లు ఇరాన్ ప్రకటించింది.

ఇరాన్ ప్రయోగించిన మూడు క్షిపణులను జోర్డాన్ సైన్యం గాల్లోనే కూల్చివేయగా.. ఇరాక్ సరిహద్దుల్లో అమెరికా దౌత్య కార్యాలయం వైపు దూసుకొచ్చిన 8 పేలుడు డ్రోన్లను అమెరికా రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయి. ఈ ఉద్రిక్తతల మధ్యే, సౌదీ అరేబియాకు 1.96 బిలియన్ డాలర్లు, కువైట్‌కు 484 మిలియన్ డాలర్ల విలువైన భారీ ఆయుధాల విక్రయానికి అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ప్రస్తుతం శాంతి చర్చలకు రావాలని అనుకుంటోందని, ఒకవేళ చర్చలకు రాకపోతే వచ్చే వారం నుండి ఆ దేశంపై దాడులు చేస్తామని హెచ్చరించారు.

Also Read : ఇరాన్‌పై అమెరికా క్షిపణుల వర్షం.. ట్రంప్ డెడ్‌లైన్.. ఇక అంతమేనా?