
పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొంది. అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ దేశాల మధ్య రగులుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు ఏ క్షణంలోనైనా మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసేలా ఉన్నాయి. శాంతి చర్చల ప్రతిపాదనలకు ఇరాన్ సహకరించకపోతే వచ్చే వారం నుండి ఆ దేశంపై మునుపెన్నడూ చూడని విధంగా భీకరమైన సైనిక దాడులు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రమైన హెచ్చరిక జారీ చేశారు. వైట్ హౌస్ లోని అత్యంత రహస్యమైన ‘సిచువేషన్ రూమ్’ లో రక్షణ రంగ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం ముగిసిన వెంటనే ట్రంప్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read : హోర్మూజ్ జలసంధికి ప్రత్యామ్నాయం: గల్ఫ్ దేశాల మాస్టర్ ప్లాన్ రెడీ!
ట్రంప్ హెచ్చరికలు ముగిసిన కొద్దిసేపటికే అమెరికా సైన్యం ఇరాన్ భూభాగంపై విరుచుకుపడింది. సాధారణంగా శత్రుదేశాలపై రాత్రి వేళల్లో రహస్యంగా దాడులు చేసే అగ్రరాజ్యం.. ఈసారి పగటిపూటే ఇరాన్ సరిహద్దుల్లో బాంబుల వర్షం కురిపించింది. హర్మూజ్ జలసంధి సమీపంలో, ఇరాన్ తీర ప్రాంతాలలోని ప్రధాన సైనిక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా డ్రోన్లు విరుచుకుపడ్డాయని యూఎస్ సెంట్రల్ కమాండ్ అధికారికంగా ప్రకటించింది.
ముఖ్యంగా గ్రేటర్ తున్బ్ ద్వీపంలో ఇరాన్ నిర్మించుకున్న క్షిపణి స్థావరాలను, రక్షణ వ్యవస్థలను అమెరికా బలగాలు పూర్తిగా ధ్వంసం చేశాయి. అంతర్జాతీయ నౌకాయానానికి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో ఇరాన్ ఎలాంటి దాడులకు పాల్పడకుండా.. ఆ దేశ సైనిక వెన్నుపూసను విరగ్గొట్టడమే తమ ప్రధాన లక్ష్యమని అగ్రరాజ్యం స్పష్టం చేసింది. అమెరికా హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు సిద్ధమవుతుంది.
Also Read : ‘యూనిఫాం విప్పేసి, పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేయండి’ – పాక్ ఆర్మీ చీఫ్ కు మౌలానా ఫజలూర్ బహిరంగ సవాల్









