Donald Trump :  అమెరికా విదేశాంగ శాఖ కీలక ప్రకటన చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ హయాంలో ఇప్పటివరకు విదేశీయులకు చెందిన 1,75,000కి పైగా వీసాలను రద్దు చేసినట్లుగావెల్లడించింది. వలసలపై ఉక్కుపాదం మోపుతున్న ఈ నేపథ్యంలో, వేలాది మందికి సంబంధించిన ప్రయాణ, వలస హక్కులను ప్రభుత్వం రద్దు చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.

వీసా నిబంధనలను ఉల్లంఘించిన వారు, నేరాలకు పాల్పడిన వారు, అమెరికా పౌరులపై హింసను ప్రేరేపించిన వారు, అమెరికన్లను మోసం చేసిన వారు, వలస విధానాన్ని దుర్వినియోగం చేసిన వారు, జాతీయ భద్రతకు ముప్పుగా మారిన విదేశీయులనే ఈ వీసాల రద్దులో టార్గెట్ చేసినట్లు ఆ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

Also Read : జిన్నా చేసిన నమ్మకద్రోహం.. బలూచిస్తాన్‌ను బలితీసుకున్న పాకిస్తాన్!

చట్టాన్ని అమలు చేసే సంస్థల విచారణల తర్వాతే అత్యధిక వీసాలను రద్దు చేసినట్లు విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ముఖ్యంగా దాడులు, మద్యం తాగి డ్రైవింగ్ చేయడం, దొంగతనాలు, మాదకద్రవ్యాల నేరాలే వీసాల రద్దుకు ప్రధాన కారణాలుగా ఉన్నట్లు వెల్లడించింది.

ఈ శాఖ ప్రత్యేకంగా కొన్ని కేసులను కూడా తన ప్రకటనలో వెల్లడించింది. ఒక వ్యక్తిపై ఫెలోనీ అత్యాచారం, లైంగిక వేధింపుల అభియోగాలు ఉండగా, మరో వ్యక్తిపై కిడ్నాప్, మానవ అక్రమ రవాణా కేసులున్నాయి. అలాగే పిల్లలకు సంబంధించిన అసభ్యకరమైన లైంగిక మెటీరియల్‌ను కలిగి ఉన్నాడనే ఆరోపణలతో డజనుకు పైగా అభియోగాలు ఎదుర్కొంటున్న మరొకరి వీసాను కూడా రద్దు చేశారు. ఇక ఉత్తర ఆఫ్రికాలోని ఒక యూఎస్ ఎంబసీ, తమ పిల్లలకు అమెరికా పౌరసత్వం రావాలనే ఉద్దేశంతో ప్రధానంగా పిల్లలను కనేందుకే అమెరికాకు వచ్చిన బర్త్ టూరిస్ట్ తల్లిదండ్రుల నుంచి 100కి పైగా వీసాలను రద్దు చేసినట్లు తెలిపింది.

మరోవైపు కన్జర్వేటివ్ కార్యకర్త చార్లీ కిర్క్ హత్యను సెలబ్రెట్ చేసుకున్న పలువురు విదేశీయుల వీసాలను కూడా రద్దు చేసినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. గత జనవరి నాటికే 100,000కి పైగా వీసాలను రద్దు చేసినట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది. అప్పట్లో అది ఒక రికార్డుగా నిలిచింది. సోషల్ మీడియా తనిఖీలను కఠినతరం చేయడం, స్క్రీనింగ్‌ను విస్తరించడం ద్వారా వీసాలు మంజూరు చేయడంలో ట్రంప్ యంత్రాంగం మరింత కఠినమైన విధానాన్ని అవలంబిస్తోంది. అయితే దీనిని మానవ హక్కుల నిపుణులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇవి భావప్రకటన స్వేచ్ఛకు ముప్పు కలిగిస్తాయని, వలసదారులపై నిఘా పెట్టి వారిని ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకోవడంతో సమానమని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read : కొలంబియాలో భారీ భూకంపం : 111 మంది మృతి.. శిథిలాల కింద నివాసితులు!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.