
CHINA : చైనాను గుడ్డిగా నమ్మడం ఎంత ప్రమాదకరమో చాటిచెప్పేలా మరో సంచలన విషయం బయటపడింది. ఈసారి నేరుగా బ్రిటన్ సైన్యానికి చెందిన అత్యంత సున్నితమైన రహస్య విభాగానికి సంబంధించిన డ్రోన్లు చైనా జూమ్ కిందకు వచ్చాయి. శత్రువులపై నిఘా పెట్టేందుకు బ్రిటన్ రాయల్ నేవీ, స్పెషల్ ఫోర్సెస్ ఉపయోగిస్తున్న K3 స్కౌట్ డ్రోన్లలోని కెమెరాల నుంచి చైనాలోని ఒక ఐపీ అడ్రస్‌కు వరుసగా హార్ట్‌బీట్ సిగ్నల్స్ వెళ్తున్నట్లు వెలుగుచూసింది. సిస్టమ్ పనిచేస్తుందో లేదో తెలియజేసేందుకు ఈ సిగ్నల్స్ ఉపయోగపడతాయి. అయితే ఈ కనెక్షన్ ఎలా ఏర్పడిందనేది ప్రస్తుతం బ్రిటన్ రక్షణ రంగాన్ని కలవరపెడుతోంది. ఎలాంటి సమాచారం లీక్ కాలేదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read : సీటు బెల్టు పెట్టుకోనన్న చిన్నారి… విమాన సర్వీస్‌ను రద్దు చేసిన సిబ్బంది
సుమారు 1.2 కోట్ల పౌండ్ల ఖర్చుతో తయారు చేసిన ఈ డ్రోన్ల వ్యవస్థను మార్చి నెల నుంచి వినియోగిస్తున్నారు. ఈ డ్రోన్లను స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా వీటిలోని కెమెరాలు పనిచేసే అవకాశం ఉందనే ఆందోళన నెలకొంది. ప్రత్యేకంగా బ్రిటన్ స్పెషల్ బోట్ సర్వీస్ హెడ్‌క్వార్టర్స్ వంటి అత్యంత కీలకమైన, రహస్య సమావేశాలు జరిగే ప్రాంతాల్లో ఈ డ్రోన్లను వాడటంతో కీలక విషయాలు లీక్ అయ్యాయేమోనని సైనిక అధికారులు భయపడుతున్నారు.
ఇరాన్, చైనాల మధ్య మంచి సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఈ విషయం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. పశ్చిమ ఆసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ, ప్రపంచంలోనే అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గమైన స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ వద్ద ఈ డ్రోన్లను మోహరించాల్సి ఉంది. ఒకవేళ ఇక్కడ ఆపరేషన్లకు సంబంధించిన వివరాలు గనక చైనా ద్వారా ఇరాన్‌కు చేరితే, అది కేవలం బ్రిటన్‌కే కాక మొత్తం ప్రపంచ భద్రతకే పెద్ద ముప్పుగా మారే అవకాశం ఉంది.
ఈ భద్రతా లోపానికి ప్రధాన కారణం మిలటరీ సప్లై చైన్. అమెరికా భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉందంటూ ఒక థర్డ్ పార్టీ సరఫరాదారు అందించిన ఈ కెమెరాల్లో చైనాకు చెందిన పరికరాలు ఉన్నట్లు తేలింది. ఈ K3 స్కౌట్ డ్రోన్ వ్యవస్థను కేవలం బ్రిటన్ మాత్రమే కాకుండా, అమెరికా స్పెషల్ ఆపరేషన్స్ కమాండ్ , నాటో ఆర్మీ విన్యాసాల్లో కూడా ఉపయోగించారు. దీంతో ఇది ఒక దేశానికే కాకుండా మొత్తం నాటో కూటమి భద్రతకే సంక్షోభంగా మారింది.
Also Read : అగ్రరాజ్యానికి మైండ్ బ్లాంక్.. ఇరాన్ వేసిన మాస్టర్ ప్లాన్‌కు యూటర్న్ తీసుకున్న ట్రంప్!









