
అమెరికా వైమానిక దళానికి చెందిన అత్యంత విలువైన సీ-130 హెర్క్యూలస్ (C-130H) సైనిక రవాణా విమానాన్ని ఒక వ్యక్తి కేవలం గొడ్డలి, ప్రమాదకర రసాయనంతో పూర్తిగా ధ్వంసం చేశాడు. అమెరికా మిలిటరీకి కీలకమైన ‘ట్రాన్స్ అట్లాంటిక్ హబ్’గా పేరున్న ఐర్లాండ్‌లోని షానన్ విమానాశ్రయంలో నవంబర్ 11న ఈ దాడి జరిగింది. దాదాపు 60 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.560 కోట్లు) విలువ చేసే ఈ భారీ యుద్ధ రవాణా విమానం ఏమాత్రం పనికి రాకుండా పోవడంతో అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఈ ఘటనకు పాల్పడిన 48 ఏళ్ల డైథీ ఓకొర్రిన్ అనే నిందితుడిని భద్రతా సిబ్బంది అరెస్ట్ చేశారు.
కట్టుదిట్టమైన భద్రత ఉండే అంతర్జాతీయ విమానాశ్రయంలోకి నిందితుడు చొరబడిన తీరు అధికారులను విస్మయానికి గురిచేస్తోంది. డైథీ ఓకొర్రిన్ ‘డేవిడ్ కరన్’ అనే నకిలీ పేరుతో ఎయిర్‌పోర్టు భద్రతా తనిఖీలను దాటుకుని లోపలికి ప్రవేశించాడు. నేరుగా ట్యాక్సీవేపై నిలిపి ఉంచిన అమెరికా సైనిక విమానం వద్దకు చేరుకున్నాడు. తన వెంట తెచ్చుకున్న గొడ్డలి, ఇతర బలమైన పనిముట్లతో విమానం వెనుక వైపు తలుపు తాళాలను బద్దలు కొట్టి లోపలికి దూరాడు. లోపలికి వెళ్లిన తర్వాత విమానం కీలక భాగాలైన వైర్ బండిల్స్, హైడ్రాలిక్ లైన్లు, కాక్‌పిట్ గేజ్‌లు, ఎయిర్ డక్ట్‌లను విచక్షణారహితంగా ధ్వంసం చేశాడు.
Also Read : హనీట్రాప్ వెనుక 9 బిలియన్ డాలర్ల డేటా సెంటర్ సామ్రాజ్యం
ఈ విధ్వంసానికి నిందితుడు కేవలం గొడ్డలితోనే ఆగకుండా అత్యంత ప్రమాదకరమైన రసాయన ఆయుధాన్ని కూడా ఉపయోగించాడు. విమానాల తయారీలో ప్రధానంగా వాడే అల్యూమినియం లోహాన్ని నిమిషాల్లో కరిగించి నాశనం చేసే ‘గాలియం’ అనే ద్రవాన్ని విమాన భాగాలపై చల్లాడు. అనంతరం విమానం పైకప్పు భాగంలో ఉన్న ఎమర్జెన్సీ తలుపు (హాచ్) గుండా పైకి ఎక్కి, విమానం బయటి కవచాన్ని కూడా తీవ్రంగా దెబ్బతీశాడు. అంతేకాకుండా విమానం ఇంధన ట్యాంక్ లాక్స్ పగలగొట్టి, లోపల బాల్బేరింగ్స్ వేశాడు. విమానం వద్ద అనుమానాస్పద శబ్దాలు రావడంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని.. చాలా సేపు శ్రమించి విమానం పైకప్పు మీదనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన అధికారులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. నిందితుడు ఏదో ఆవేశంలో కాకుండా, పూర్తి అవగాహనతో, పక్కా ప్రణాళిక ప్రకారమే ఈ దాడికి పాల్పడినట్లు నిర్ధారణ అయింది. విమానంలోని కంట్రోల్ వైర్లు, ఆక్సిజన్ పైపులైన్లు ఎక్కడ ఉంటాయో అతడికి ముందే పూర్తిగా తెలుసు. విమానం బాడీని అల్యూమినియంతో తయారు చేస్తారని తెలిసి, దాన్ని నాశనం చేయడానికి ఇంటర్నెట్లో సెర్చ్ చేసి మరీ ‘గాలియం క్యాప్సుల్స్’ను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి కొనుగోలు చేశాడని దర్యాప్తులో తేలింది.
ఈ దాడి ధాటికి విమానం అంతర్గత వ్యవస్థలు, బాడీ పూర్తిగా దెబ్బతిన్నాయని, ఇకపై అది ఎగరడానికి ఏమాత్రం పనికిరాదని రక్షణ నిపుణులు తేల్చి చెప్పారు. అత్యంత భద్రత ఉండే విమానాశ్రయంలో అమెరికా సైనిక విమానంపై ఇలాంటి దాడి జరగడం భద్రతా లోపాలను ఎత్తి చూపుతోంది. ప్రస్తుతం నిందితుడి వెనుక ఎవరైనా ఉన్నారా? ఈ దాడికి అసలు కారణం ఏంటి అనే కోణంలో అధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారు.
Also Read : బట్టతలకు శాశ్వత పరిష్కారం.. దాదాపు 100 శాతం జుట్టును తిరిగి పెంచే అద్భుతమైన ఎలక్ట్రిక్ దువ్వెన!









