ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యలలో బట్టతల ఒకటి. ముఖ్యంగా పురుషులలో సాధారణంగా కనిపించే మేల్-ప్యాటర్న్ బాల్డ్‌నెస్ సమస్యకు ఇప్పటివరకు పూర్తిస్థాయి, శాశ్వత పరిష్కారం లేదనే చెప్పాలి. అయితే తాజాగా చైనాకు చెందిన శాస్త్రవేత్తలు ఈ సమస్యకు చెక్ పెట్టే ఒక అద్భుతమైన ఆవిష్కరణ చేశారు. కేవలం తల దువ్వుకోవడం ద్వారా రాలిపోయిన జుట్టును వేగంగా తిరిగి పెంచే ఒక ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ దువ్వెనను రూపొందించారు. డిటాంగిల్ అని పిలిచే ఈ అత్యాధునిక దువ్వెన బట్టతలను నివారించడంలో దాదాపు 100 శాతం ఫలితాలను ఇస్తోందని పరిశోధకులు ప్రకటించారు.

బీజింగ్‌లోని బీహాంగ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తల బృందం ఈ వినూత్న పరిశోధనను నిర్వహించింది. ఈ అధ్యయనానికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రముఖ అంతర్జాతీయ సైన్స్ జర్నల్ నేచర్ కమ్యూనికేషన్స్ ఈ నెలలో ప్రచురించింది. సాధారణంగా జుట్టు రాలడాన్ని అరికట్టడానికి ప్రస్తుతం వాడుతున్న మందులు, చికిత్సల కంటే ఈ డిటాంగిల్ ఎలక్ట్రిక్ దువ్వెన ఎంతో వేగంగా, ప్రభావవంతంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ పరికరం ప్రయోగాత్మక దశలో ఉన్నప్పటికీ.. ఎలుకలపై జరిపిన పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు రావడం ఆశలు రేకెత్తిస్తోంది.

ఈ ఎలక్ట్రిక్ దువ్వెన పనిచేసే విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. సాధారణ దువ్వెనల మాదిరిగా కాకుండా.. దీని పళ్లలో వేర్వేరు ఎత్తులతో కూడిన ఎలక్ట్రోడ్లు, ఔషధాలను మోసుకెళ్లే ప్రత్యేక అణువులు అమర్చి ఉంటాయి. ఈ దువ్వెనతో తల దువ్వుకున్నప్పుడు, అది తల చర్మంలోని జుట్టు కుదుళ్ల ప్రాంతంలో ఒక సున్నితమైన విద్యుత్ క్షేత్రాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ విద్యుత్ ప్రేరణ వల్ల జుట్టు కుదుళ్లు ఉత్తేజితమవ్వడమే కాకుండా.. దువ్వెనలోని ఔషధ అణువులు చర్మం లోతుల్లోకి నేరుగా చేరుతాయి. దీనివల్ల నిద్రాణంగా ఉన్న కుదుళ్లు తిరిగి చురుకుగా మారి, కొత్త జుట్టు వేగంగా పెరగడానికి దోహదపడుతుంది.

Also Read : హనీట్రాప్ వెనుక 9 బిలియన్ డాలర్ల డేటా సెంటర్ సామ్రాజ్యం

బట్టతల చికిత్సలో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మినోక్సిడిల్ అనే మందును ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే ఈ మినోక్సిడిల్ చికిత్సతో పోలిస్తే తాము రూపొందించిన డిటాంగిల్ ఎలక్ట్రిక్ దువ్వెన ఎన్నో రెట్లు మెరుగైన ఫలితాలను ఇచ్చిందని పరిశోధకులు నిరూపించారు. బట్టతల సమస్య ఉన్న ఎలుకలపై ఒక నెల రోజుల పాటు ఈ దువ్వెనతో పరీక్షలు నిర్వహించగా.. సాధారణ మినోక్సిడిల్ చికిత్స వల్ల 70 శాతం మాత్రమే జుట్టు తిరిగి రాగా, ఈ ఎలక్ట్రిక్ దువ్వెన ఉపయోగించడం వల్ల ఏకంగా 100 శాతానికి దగ్గరగా జుట్టు తిరిగి పెరిగినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు.

ప్రపంచ జనాభాలో దాదాపు 80 శాతం మంది పురుషులు తమ జీవితకాలంలో ఏదో ఒక దశలో బట్టతల సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇది కేవలం శారీరక మార్పు మాత్రమే కాకుండా, ఎంతో మందిలో ఆత్మ న్యూనతా భావాన్ని, మానసిక ఒత్తిడిని కలిగిస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సలలో అనేక పరిమితులు, దుష్ప్రభావాలు ఉన్నాయి. ఉదాహరణకు మినోక్సిడిల్ వాడటం వల్ల ఫలితాలు కనిపించడానికి ఏడాది సమయం పట్టడమే కాకుండా, జీవితాంతం దాన్ని వాడుతూనే ఉండాలి. పైగా దీనివల్ల తల దురద, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. మరో మందు ఫినాస్టెరైడ్ వాడటం వల్ల లైంగిక సామర్థ్యం తగ్గడం, డిప్రెషన్ వంటి తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంది. ఇక హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ శస్త్రచికిత్స అత్యంత ఖర్చుతో కూడుకున్నది. నొప్పిని కలిగించే ప్రక్రియ.

ఈ నేపథ్యంలో చైనా శాస్త్రవేత్తలు ఆవిష్కరించిన ఈ డిటాంగిల్ ఎలక్ట్రిక్ దువ్వెన బట్టతల బాధితులకు ఒక వరంగా మారే అవకాశం ఉంది. ఎటువంటి నొప్పి లేకుండా, కేవలం దువ్వెనను ఉపయోగించడం ద్వారా జుట్టును తిరిగి పొందవచ్చనే ఆలోచన ఎంతో ఆకర్షణీయంగా ఉంది. అయితే ఈ సాంకేతికతను ఇప్పటివరకు కేవలం ఎలుకలపై మాత్రమే పరీక్షించారని, మనుషులపై ఇది ఎంతవరకు పనిచేస్తుందనే దానిపై ఇంకా అధికారిక ఆధారాలు లేవని నిపుణులు గుర్తు చేస్తున్నారు.

ఎలుకలపై జరిగిన ప్రయోగాలలో వచ్చిన విజయం మనుషులపై చికిత్సకు ఒక ప్రామాణికంగా ఉపయోగపడుతుందని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే మనుషులపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి ముందు మరిన్ని భద్రతా పరీక్షలు జరపాల్సి ఉంటుంది. ఈ దువ్వెన మనుషులకు పూర్తిగా సురక్షితమని, సమర్థవంతంగా పనిచేస్తుందని నిర్ధారణ అయిన తర్వాత ఇది సాధారణ ప్రజలకు అందుబాటులోకి రానుంది.

Also Read : అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు.. హర్మూజ్‌లో ఎల్‌పీజీ నౌకపై దాడి.. భారత నావికుడు గల్లంతు!