మనం పీల్చే గాలి వేడెక్కుతోంది.. మనం నివసించే భూమి మండుతోంది.. అయినా ప్రపంచ దేశాల అడుగుల్లో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ఇది కేవలం ఒక హెచ్చరిక కాదు.. మానవాళి భవిష్యత్తును చెప్పే సత్యం. పరస్పరం ఎన్నో ఒప్పందాలు చేసుకుంటున్నా, వేదికలెక్కి గొప్ప వాగ్దానాలు చేస్తున్న భూగోళం వేడెక్కడం మాత్రం క్షణం కూడా ఆగడం లేదు. ప్రపంచ దేశాలు తమ తాజా వాతావరణ లక్ష్యాలను పూర్తిగా, వంద శాతం అమలు చేసినప్పటికీ.. ఈ శతాబ్దం చివరి నాటికి ప్రపంచ ఉష్ణోగ్రతలు పారిశ్రామిక పూర్వ స్థాయి కంటే ఏకంగా 2.6 డిగ్రీల సెల్సియస్ పెరిగిపోతాయని ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం తన వార్షిక నివేదికలో సంచలన హెచ్చరిక జారీ చేసింది. పారిస్ వాతావరణ ఒప్పందంలో అంగీకరించిన ఆశయాలకు, ఆచరణలో దేశాలు అనుసరిస్తున్న స్వార్థపూరిత విధానాలకు మధ్య ఎంతటి పెద్ద అగాధం ఉందో ఈ నివేదిక కళ్లకు కట్టినట్లు చూపింది.

అయితే పారిస్ ఒప్పందం ప్రకారం ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు మాత్రమే పరిమితం చేయాలని అంతా కలిసికట్టుగా నిర్ణయించుకున్నారు. కానీ.. గడిచిన దశాబ్దాలలో రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు కేవలం మాటలు చెపుతూ కాలయాపన చేశారే తప్ప తగిన ఆచరణాత్మక చర్యలు తీసుకోలేదు. ఫలితంగా ఆ చారిత్రక లక్ష్యాన్ని చేరుకునే సువర్ణ అవకాశాన్ని ప్రపంచం ఇప్పటికే కోల్పోయిందని నివేదిక తెలిపింది.

Also Read : సిమ్ కార్డు తీస్తే వాట్సాప్ బంద్.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం!

ఈ విషయాన్ని వివరిస్తూ ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 1.5 డిగ్రీల పరిమితిని దాటవేయడాన్ని ఇకపై ప్రపంచం అడ్డుకోలేదు. దీని వినాశకరమైన దుష్పరిణామాలు ఇప్పటికే మన కళ్ల ముందు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడికక్కడ ఊహించని రీతిలో ముంచుకొస్తున్న ప్రాణాంతక వరదలు, ఎండ వేడికి తట్టుకోలేక కుప్పకూలుతున్న జనం, భీకరమైన వడగాల్పులు, అడవులను కబలిస్తున్న కార్చిచ్చులు, వేలాది మంది ప్రాణాలు కోల్పోవడం, కుంటుపడుతున్న ఆర్థిక వ్యవస్థలు.. వీటన్నింటికీ ఈ ఉష్ణోగ్రతల పెరుగుదలే ప్రధాన కారణమని స్పష్టం చేశారు.

వాతావరణాన్ని ఇంతలా భస్మాసుర హస్తంలా మారుస్తున్న అసలు శత్రువు ఎవరంటే.. బొగ్గు, చమురు, సహజ వాయువు వంటి శిలాజ ఇంధనాలే. వీటిని విపరీతంగా తగలబెట్టడం వల్ల వాతావరణంలోకి విడుదలవుతున్న కార్బన్ ఉద్గారాలు ఏమాత్రం తగ్గకపోగా, రికార్డు స్థాయిలోనే కొనసాగుతున్నాయి. ఒకవేళ ఇప్పటికైనా కళ్లు తెరవకుండా ప్రస్తుత విధానాలనే ఏ మార్పూ లేకుండా అలాగే కొనసాగిస్తే.. ఈ శతాబ్దంలో భూమి వేడెక్కడం ఏకంగా 2.8 డిగ్రీలకు చేరుకుంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు భయానక అంచనా వేస్తున్నారు. 1.5 డిగ్రీల కంటే పెరిగే ప్రతి అదనపు డిగ్రీ ఉష్ణోగ్రత వల్ల భయంకరమైన తుఫాన్లు, తీవ్రమైన కరువు కాటకాలు రావడమే కాకుండా సముద్ర గర్భంలోని పగడపు దిబ్బలు సర్వనాశనం కావడం, ధృవ ప్రాంతాల మంచు కొండలు పూర్తిగా కరిగి సముద్ర మట్టాలు పెరిగిపోవడం వంటి కోలుకోలేని విపత్తులు ముంచుకొస్తాయని హెచ్చరిస్తున్నారు.

ఈ మహా సంక్షోభానికి ప్రధాన బాధ్యులు ఎవరనే ప్రశ్న వచ్చినప్పుడు.. ప్రపంచవ్యాప్తంగా వెలువడే మొత్తం ఉద్గారాలలో కేవలం జీ-20 దేశాల వాటానే ముప్పావు వంతు ఉందని నివేదిక స్పష్టం చేస్తోంది. అందుకే పర్యావరణాన్ని అత్యధికంగా కలుషితం చేస్తున్న ఈ పెద్ద దేశాలు, ముఖ్యంగా అగ్రరాజ్యాలు తమ బాధ్యతను గుర్తించి భూమి వేడెక్కడాన్ని ఆపడానికి మరింత చురుగ్గా, యుద్ధ ప్రాతిపదికన కృషి చేయాలని గుటెర్రెస్ గట్టిగా కోరారు. అయితే పరిస్థితిని మరింత దిగజార్చేలా అమెరికా వంటి దేశాలు పారిస్ ఒప్పందం నుండి అధికారికంగా తప్పుకోవడం, పైగా శిలాజ ఇంధనాల ఉత్పత్తిని మరింత పెంచుకోవడం వంటి చర్యలకు పాల్పడటం ఆందోళనకరం. ప్రపంచాన్ని రక్షించాల్సిన పెద్ద దేశాలే ఇలా వ్యవహరిస్తే ఎలా అనే ప్రశ్న తలెత్తుతోంది.

Also Read : పిల్లలు నిరసన చేస్తే తల్లిదండ్రులకు ఫైన్.. దేశంలోనో తెలుసా?