దేశంలో విచ్చలవిడిగా పెరిగిపోతున్న సైబర్ నేరాలు, మోసపూరిత ఫిషింగ్ కాల్స్, అంతర్జాతీయ స్థాయి డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లకు చెక్ పెట్టేందుకు కేంద్ర టెలికమ్యూనికేషన్ల శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ఫోన్‌లో రిజిస్టర్డ్ సిమ్ కార్డు లేకుండా కేవలం వై-ఫై లేదా సెకండరీ ఇంటర్నెట్ ఆధారంగా నడుస్తున్న మెసేజింగ్ యాప్‌లకు చెక్ పెట్టేందుకు “సిమ్-బైండింగ్” నిబంధనలను కఠినతరం చేస్తోంది. ఈ సరికొత్త రూల్స్ 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. దీనికోసం మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లు తమ సిస్టమ్స్‌లో అవసరమైన మార్పులు చేసుకోవడానికి 2026 డిసెంబర్ 31 వరకు గడువుగా నిర్ణయించింది.

Also Read : ఐరోపాపై భానుడి విలయతాండవం.. ఎండ దెబ్బకు 50 వేల మంది మృతి.. గ్లోబల్ వార్మింగ్ బాంబ్!

ఈ కొత్త నిబంధన అమలులోకి వచ్చిన తర్వాత.. ఒకవేళ మీరు మీ మెసేజింగ్ ఖాతాకు అనుసంధానించిన సిమ్ కార్డును ఫోన్ నుంచి తీసివేసినా, దాన్ని డీయాక్టివేట్ చేసినా లేదా వేరే ఫోన్‌లోకి మార్చినా, మీరు మీ వాట్సాప్, టెలిగ్రామ్ ఖాతాల అకౌంట్‌ను వెంటనే కోల్పోతారు. భారతీయ మొబైల్ నంబర్లతో పనిచేసే ప్రతి మెసేజింగ్ యాప్.. సదరు యూజర్ ఉపయోగిస్తున్న పరికరంలో ఆ రిజిస్టర్డ్ నంబర్ కలిగిన యాక్టివ్ ఫిజికల్ సిమ్ లేదా ఈ-సిమ్ ఉందో లేదో తప్పకుండా చెక్ చేసుకోవాలి.

అసలు కేంద్ర ప్రభుత్వం ఈ స్థాయిలో కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రధాన కారణం విదేశాల నుంచి జరుగుతున్న సైబర్ దాడులే. మోసగాళ్లు భారతదేశంలో నకిలీ ఐడెంటిటీలతో సిమ్ కార్డులు కొనుగోలు చేసి వాటిపై వాట్సాప్, టెలిగ్రామ్ అకౌంట్లను యాక్టివేట్ చేస్తున్నారు. ఆ తర్వాత సిమ్ కార్డులను తీసిపారేసి, విదేశాల నుంచి అదే అకౌంట్లతో భారతీయ పౌరులను బురిడీ కొట్టిస్తూ కోట్లాది రూపాయల డిజిటల్ దోపిడీకి పాల్పడుతున్నారు. ఈ సిమ్-బైండింగ్ నిబంధన రాకతో యాక్టివ్ సిమ్ లేకపోతే అకౌంట్ పనిచేయదు. కాబట్టి సరిహద్దుల దాటి నుంచి జరిగే సైబర్ నేరాలకు పెద్ద అడ్డుకట్ట పడనుంది.

ఈ మార్పు వల్ల సాధారణ వినియోగదారులపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటే.. ముఖ్యంగా ఒక ఫోన్‌లో సిమ్ కార్డు ఉంచి, మరొక సెకండరీ ఫోన్ లేదా ట్యాబ్‌లో వాట్సాప్ ఉపయోగించే వారికి అకౌంట్ సెటప్ పూర్తయ్యాక సిమ్ తీసివేసే వారికి ఇది పెద్ద తిప్పలు తెచ్చిపెట్టనుంది. అలాగే డ్యూయల్ సిమ్ వాడేవారు కూడా తమ మెసేజింగ్ అకౌంట్‌కు లింక్ అయిన సిమ్ నిరంతరం యాక్టివ్‌గా ఉండేలా చూసుకోవాలి. అయితే ఐఫోన్ లేదా ఆండ్రాయిడ్ పరికరాలలో ఈ యాప్‌లు పనిచేయవనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదు.ఇది కేవలం సిమ్‌కు సంబంధించిన నిబంధన మాత్రమేనని అధికారులు స్పష్టం చేశారు. ఫిజికల్ సిమ్ లేదా ప్రొఫైల్ యాక్టివ్‌గా ఉన్న ఈ-సిమ్ కలిగిన పరికరాల్లో ఎలాంటి ఆటంకం లేకుండా ఈ సేవలు కొనసాగుతాయి.

Also Read : స్వర్గం పేరుతో 190 మంది ఆకలి చావులు.. చర్చ్‌లో 400 శవాలు