Islamic NATO :  ముస్లిం దేశాలన్నీ తమ విభేదాలను పక్కనబెట్టి, పరస్పర రక్షణ కోసం సైనిక కూటమిగా ఏర్పడాలని పాకిస్థాన్ రక్షణశాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ పిలుపునిచ్చారు. నాటో తరహాలోనే ముస్లిం దేశాల కోసం కూడా ఒక బలమైన సైనిక వ్యవస్థ ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్థాన్ దేశాలు కలిసి కుదుర్చుకున్న రక్షణ ఒప్పందంలోకి ఇతర ముస్లిం దేశాలు కూడా చేరాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఇటీవల సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌లు కలిసి మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్ పై సంతకాలు చేశారు. మధ్యప్రాచ్యంలో అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, చమురు ఎగుమతిదారులపై క్షిపణి దాడుల నేపథ్యంతో ఈ మూడు దేశాలు తమ భద్రతా సహకారాన్ని పెంచుకోవడానికి ఈ ఒప్పందం చేసుకున్నాయి.

Also Read : బాలి సమీపంలో ఫెర్రీలో అగ్నిప్రమాదం…స్పాట్ లో 131 మంది?

ఈ ఒప్పందంలోని ముఖ్యమైన అంశం ఏంటంటే.. ఈ కూటమిలోని ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా, అది మిగతా రెండు దేశాలపై జరిగిన దాడిగానే పరిగణిస్తారు. నాటోలోని ఆర్టికల్ 5 సూత్రం ఆధారంగానే ఈ ఒప్పందం రూపుదిద్దుకుంది. పాకిస్థాన్ అణు ఆయుధాలు ఉన్న ఏకైక ముస్లిం దేశంగా, అత్యుత్తమ సైనిక అనుభవాన్ని అందిస్తుంది. ఇక సౌదీ అరేబియా కొండంత ఆర్థిక బలాన్ని, ప్రాంతీయ ప్రాభవాన్ని తెస్తుంది. అటు టర్కీ నాటోలో రెండవ అతిపెద్ద సైన్యం కలిగి ఉండటంతో పాటు, ఆధునిక ఆయుధ తయారీ సాంకేతికతను అందిస్తుంది.

ఈ రక్షణ ఒప్పందం కేవలం కొన్ని దేశాలకే పరిమితం కాకూడదని ఇదోక ప్రత్యేక క్లబ్ కాదని ఖవాజా ఆసిఫ్ తెలిపారు. రాబోయే రోజుల్లో ఈజిప్ట్ వంటి మరిన్ని ముస్లిం దేశాలు ఈ కూటమిలో చేరే అవకాశం ఉందట. టర్కీ విదేశాంగ మంత్రి హాకాన్ ఫిదాన్, పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మాట్లాడుతూ.. ఈ కూటమి ఏ దేశానికీ వ్యతిరేకం కాదని, కేవలం తమ సొంత భద్రత, ప్రాంతీయ శాంతి స్థిరత్వాల కోసమే ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు.

ఈ ఒప్పందం వల్ల ఈ దేశాలు ఇతర దేశాలతో చేసుకున్న పాత ఒప్పందాలు ఏవీ రద్దు కావు. ఇది కేవలం ఈ మూడు దేశాల రక్షణ, శాంతి భద్రతల కోసమే రూపొందించుకున్న అగ్రిమెంట్ మాత్రమే. ఒక దేశంపై దాడి జరగ్గానే మిగతా దేశాలు వెంటనే యుద్ధంలోకి దూకేయవు. సాయం ఎలా చేయాలనేది ఆ సమయానికి చర్చల ద్వారానే నిర్ణయం తీసుకుంటారు. పాకిస్థాన్ వద్ద అణుబాంబులు ఉన్నప్పటికీ, వాటిని కేవలం తన సొంత దేశ రక్షణ కోసమే ఉపయోగిస్తుంది.

Also Read : ట్రంప్ రూం నంబర్ ఇరాన్ కు ఎలా తెలిసింది? పక్కా ప్లాన్ తో లేపేందుకు స్కెచ్?.. షాకింగ్ రిపోర్ట్!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.