భారీ వర్షాలు, ఆకస్మిక వరదలతో నేపాల్(Nepal) దేశం తీవ్ర అతలాకుతలమైంది. ప్రకృతి సృష్టించిన ఈ ఘోర విపత్తుతో నేపాల్ దేశంలో దయనీయ పరిస్థితులను మిగిల్చింది. ఈ ఘటన జరిగి 8 రోజులు గడుస్తున్న కొద్దీ బాధితుల ఆశలు గాల్లో కలిసిపోతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న తమవారు ఇక ప్రాణాలతో తిరిగి రారనే చేదు నిజాన్ని కుటుంబ సభ్యులు ఇప్పుడిప్పుడే రియలైజ్ అవుతున్నారు. గల్లంతైన వారి కోసం ఎదురుచూసి విసిగిపోయిన కుటుంబ సభ్యులు.. ఇంకా వారి ఆచూకీ లభించలేదని, ఇక రారని భావించి వారికి కర్మకాండలు నిర్వహిస్తున్నారు.

Also Read : ఫోక్స్‌వ్యాగన్ ఉద్యోగులకు బిగ్ షాక్.. లక్ష మందిపై వేటు.. కారణమిదే!

Also Read : సన్యాసం కోసం రూ.47 కోట్ల కంపెనీ అమ్మకం.. ఐస్‌క్రీమ్ కింగ్ సంచలనం!

ఇప్పటివరకు సహాయక బృందాలు 1,259 మృతదేహాలను వెలికితీశాయి. అయితే ఇప్పటికీ 5,083 మంది ఆచూకీ అసలు దొరకలేదు. రసువా జిల్లాలోని పహరెబెసి గ్రామంలో పరిస్థితి మరింత హృదయవిదారకంగా ఉంది. గల్లంతైన వారు ప్రాణాలతో వచ్చే అవకాశం లేదని స్థానికులు ఫిక్స్ అయ్యారు. చివరకు మృతదేహాలు కూడా దొరికే అవకాశం లేకపోవడంతో హిందూ సాంప్రదాయం ప్రకారం ‘దర్భ గడ్డి’తో తమ వారి ప్రతిరూపాలను తయారుచేసి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. కొండచరియలు విరిగిపడటం వల్ల మృతదేహాలు లభించడం కష్టమని, ఒకవేళ దొరికినా గుర్తుపట్టే స్థితిలో కూడా ఉండవని స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు.

వరదల ఉధృతికి నేపాల్ నుంచి కొట్టుకొచ్చిన 19 మృతదేహాలను భారత సరిహద్దు ప్రాంతాల్లో అధికారులు వెలికితీశారు. నవాల్‌పరసి వెస్ట్ జిల్లా నుంచి ప్రవాహంలో కొట్టుకొచ్చిన ఈ మృతదేహాలను భారత్ గౌరవంగా నేపాల్ అధికారులకు అప్పగించింది. ఈ విపత్తులో తీవ్రంగా దెబ్బతిన్న చితవాన్, నవాల్‌పరసి ఈస్ట్, నవాల్‌పరసి వెస్ట్ ప్రాంతాల నుంచే అత్యధికంగా మృతదేహాలు బయటపడుతున్నాయి. ఇప్పటివరకు ఒక్క చితవాన్ జిల్లాలోనే 355, నవాల్‌పరసి వెస్ట్‌లో 218, నవాల్‌పరసి ఈస్ట్‌లో 212 మృతదేహాలు లభ్యమయ్యాయి.

మరోవైపు ప్రకృతి విపత్తు ధాటికి నేపాల్ భూభాగం మొత్తం మారిపోయింది. రసువా, నువాకోట్ జిల్లాల్లోని లోయల సహజ రూపం పూర్తిగా దెబ్బతిని.. గుర్తుపట్టలేని విధంగా తయారైంది. సరిహద్దులకు సమీపంలో ఉన్న టిబెట్ భూభాగంలోనూ దాదాపు 100 మంది నేపాలీలు గల్లంతైనట్లు తెలుస్తోంది. వీరి కోసం ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

అయితే వరదల ముప్పు నేపాల్‌కు ఇంకా ఉంది. భోటే కోశీ, త్రిశూలి నదుల ఎగువ ప్రాంతాల్లో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. రసువా, నువాకోట్ జిల్లాల్లోని ఉపనదులు, వాగులు ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తున్నాయి. కొండ ప్రాంతాల్లోని రాజధాని కాఠ్‌మాండూతో సహా మొత్తం 19 జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉందని అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. నదులన్నీ ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.