మెటా కంపెనీకి బిగ్ షాక్ తగిలింది. చిన్న పిల్లలను, టీనేజర్లను ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ యాప్‌లకు ఉద్దేశపూర్వకంగా బానిసలుగా మారుస్తున్నారనే ఆరోపణలపై మెటా సమస్యలో పడింది. ఈ సమస్య నుంచి బయటపడటానికి మెటా ఏకంగా 18 బిలియన్ డాలర్లు అనగా సుమారు రూ.1.7 లక్షల కోట్లు పరిహారంగా చెల్లించడానికి ఒప్పుకుంది. అమెరికా చరిత్రలోనే ఒక టెక్ కంపెనీ ఇంత పెద్ద మొత్తం చెల్లించడం ఇదే మొదటిసారి.

ఆపకుండా స్క్రోల్ చేసే రీల్స్, లైక్ బటన్లు, తరచూ వచ్చే పుష్ నోటిఫికేషన్లు పిల్లల మెదడు ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని అమెరికాలోని 48 రాష్ట్రాల అటార్నీ జనరల్స్ కోర్టులో ఆధారాలతో నిరూపించారు. ఈ ఫీచర్ల వల్ల పిల్లలు గంటల తరబడి ఫోన్లకే అతుక్కుపోతూ డిప్రెషన్, తీవ్రమైన ఆందోళన, నిద్రలేమి, ఆహార సంబంధిత సమస్యలకు గురవుతున్నారని తెలిపింది. ఈ సమస్య పరిష్కారం కోసం మెటా చెల్లించే 18 బిలియన్ డాలర్ల మొత్తాన్ని 10 సంవత్సరాల వ్యవధిలో ఆ 48 రాష్ట్రాలకు పంపిణీ చేయనున్నారు. ఈ నిధులను పాఠశాలల్లో పిల్లల మానసిక ఆరోగ్య కార్యక్రమాలు, వేసవి శిబిరాలు, డిజిటల్ అవగాహన కల్పించే కౌన్సెలర్ల నియామకం కోసం ఉపయోగిస్తారు.

Also Read : అతిపెద్ద డ్యాం నిర్మిస్తున్న చైనా.. భారత్‌కు పొంచి ఉన్న మెగా ముప్పు

టీనేజర్ల విషయంలో మెటా కొన్ని రూల్స్‌ను మార్చనుంది. పిల్లల ఖాతాలకు రోజుకు గరిష్టంగా 2 గంటల వాడకం మాత్రమే డిఫాల్ట్ సెట్టింగ్‌గా ఉండేలా అమర్చాలి. ఆ సమయం ముగిసిన తర్వాత యాప్ వాడకాన్ని పొడిగించాలంటే తల్లిదండ్రుల ప్రత్యేక అనుమతి తప్పనిసరి. పిల్లలు పాఠశాలల్లో చదువుకునే సమయంలో వారి దృష్టి మళ్లకుండా ఉండేందుకు.. ఆ వేళల్లో ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ల నుండి ఎలాంటి పుష్ నోటిఫికేషన్లు పంపించకూడదు. సోషల్ మీడియాలో పోస్టులకు వచ్చే లైక్స్ చూసి పిల్లలు ఒకరితో ఒకరు పోల్చుకుంటూ ఒత్తిడికి గురికాకుండా ఉండటానికి, తమ పోస్టుల లైక్‌ల సంఖ్యను ఇతరులకు కనిపించకుండా దాచుకునే లేదా పరిమితం చేసే సౌకర్యం కల్పిస్తున్నారు. రాత్రి పూట ఆలస్యంగా పిల్లలు ఫోన్లు చూడకుండా నిరోధించేందుకు ఆటోమేటిక్ నైట్ మోడ్, పాజ్ ఫీచర్లు అమలులోకి వస్తాయి. దీనివల్ల నిర్దిష్ట సమయం తర్వాత యాప్స్ వాడకుండా విరామం లభిస్తుంది. బాడీ షేమింగ్, సైబర్ బెదిరింపులు, హానిని ప్రోత్సహించే ప్రమాదకరమైన పోస్టులను పిల్లల ఫీడ్ నుంచి పూర్తిగా తొలగిస్తారు.

అయితే ఈ ఒప్పందంలో మెటా ఒక షరతు పెట్టింది. తమతో పోటీపడుతున్న టిక్‌టాక్, యూట్యూబ్ వంటి ఇతర ప్లాట్‌ఫారమ్‌లు కూడా పిల్లల భద్రత కోసం ఇలాంటి కఠిన నిబంధనలను అమలు చేస్తేనే.. మొత్తం జరిమానా మొత్తంలో 30 శాతం నిధులను (సుమారు రూ.50 వేల కోట్లు) విడుదల చేస్తామని పేర్కొంది. నిబంధనలు పరిశ్రమ అంతటా ఒకేలా లేకపోతే పిల్లలు ఒక యాప్‌ను వదిలి మరొక దానికి మారిపోతారని కంపెనీ వాదిస్తోంది.

Also Read : నేపాల్‌లో భీకర వరదలు.. 105 మంది భారతీయులు, 384 మంది టూరిస్టులు మిస్సింగ్!