ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సీక్రెట్‌గా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో పర్యటించడం ఇప్పుడు అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. యూఏఈ రాజధాని అబుధాబిలో అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో నెతన్యాహు ఓ గదిలో భేటీ అయ్యారు. ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు విరుచుకుపడి ఘోర మారణహోమానికి ఒడిగట్టిన ఘటనకు మూడేళ్లు కావస్తుంది. ఈ క్రమంలో రహస్య భేటీ జరగడంతో పెను దుమారం రేపుతోంది. అయితే ఈ పర్యటనకు సంబంధించి ఇరు దేశాల దౌత్య కార్యాలయాలు లేదా ప్రభుత్వాల నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Also Read : UNSCలో శాశ్వత స్థానానికి భారత్‌కు రష్యా మద్దతు, జర్మనీ-జపాన్ ఏం అన్నాయంటే..?

అయితే 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ సరిహద్దుల్లోకి చొరబడి హమాస్ మిలిటెంట్లు వందలాది మంది అమాయక పౌరులను పొట్టనబెట్టుకున్నారు. అనేక మందిని బందీలుగా గాజాకు తరలించిన దారుణ ఘటన ప్రపంచాన్నే దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే ఈ దాడి జరగడానికి సరిగ్గా 10 రోజుల ముందే హమాస్ ప్లాన్ చేస్తున్న భారీ ఆపరేషన్ గురించి యూఏఈ ఇంటెలిజెన్స్ వర్గాలు ఇజ్రాయెల్‌ను స్పష్టంగా హెచ్చరించాయని తెలుస్తోంది.

ఈ ముందస్తు భద్రతా సమాచారం నేరుగా ప్రధాని నెతన్యాహుకే అందిందని.. కానీ ఆయన ఈ కీలకమైన ఇన్ఫర్మేషన్‌ను తమ దేశ సైన్యానికి గానీ, అంతర్గత ఇంటెలిజెన్స్ ఏజెన్సీలైన షిన్ బెట్, మొస్సాద్‌లకు గానీ అందించకుండా తొక్కిపెట్టారని ఆ నివేదిక ఆరోపించింది. అయితే అక్టోబర్ 7 నాటి భద్రతా వైఫల్యానికి వేలాది మంది ప్రాణాలు కోల్పోవడానికి మిలిటెంట్ల చేతుల్లో బందీలుగా మారడానికి నెతన్యాహు నిర్లక్ష్యమే కారణమని, తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు ఆరోపిస్తు్న్నాయి. సొంత దేశంలోనే తీవ్ర నిరసనలు, వ్యతిరేకత వెల్లువెత్తుతున్న వేళ, నెతన్యాహు అకస్మాత్తుగా యూఏఈకి వెళ్లడం రాజకీయ వర్గాల్లో అనేక అనుమానాలకు తావిస్తోంది.

తనపై వస్తున్న తీవ్ర ఆరోపణలను ప్రధాని నెతన్యాహు పూర్తిగా తోసిపుచ్చారు. తమ ప్రభుత్వంపై, తన వ్యక్తిగత ప్రతిష్టపై దెబ్బకొట్టేందుకే కొన్ని మీడియా సంస్థలు ఇలాంటి అసత్య, కల్పిత కథనాలను ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. దేశ భద్రత విషయంలో తాను ఎప్పుడూ రాజీపడలేదని, హమాస్ దాడికి సంబంధించిన ఎలాంటి ముందస్తు సమాచారం తనకు అందలేదని స్పష్టం చేశారు. మరి ఈ సీక్రెట్ పర్యటన వెనుక ఉన్న కారణాలు ఏంటో తెలియాల్సి ఉంది.

Also Read : H-1B వీసా వినియోగదారులకు బిగ్ షాక్.. ఐటీ కంపెనీలకు ట్రంప్ డెడ్ లైన్!