అమెరికాలో ఉద్యోగం చేయాలనే విదేశీయులకు ట్రంప్ ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా భారతీయ ఐటీ ఉద్యోగులకు అత్యంత కీలకమైన హెచ్-1బీ వీసా విధానంలో రానున్న ఏడాది కాలంలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. అమెరికా ప్రభుత్వం హెచ్-1బీ వీసా మార్గంలో జరుగుతున్న అక్రమాలు, మోసాలపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం అమల్లో ఉన్న వీసా ప్రక్రియను పూర్తిగా తొలగించే అవకాశాలు ఉన్నాయని అమెరికా కార్మిక శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆంటోనీ డీఎస్పోసిటో సంచలన సంకేతాలు ఇచ్చారు.

ఆంటోనీ డీఎస్పోసిటో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హెచ్-1బీ వీసాల దుర్వినియోగానికి సంబంధించి షాకింగ్ వివరాలను వెల్లడించారు. వీసా మోసాలకు పాల్పడుతున్న వారిని అరెస్టు చేసేందుకు తగిన ఆధారాలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో ఆయన మా వద్ద సంకెళ్లు సిద్ధంగా ఉన్నాయని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కార్మిక శాఖలోని ఆఫీస్ ఆఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ జాతీయ స్థాయిలో హెచ్-1బీ వీసాల దుర్వినియోగం, విదేశీ కార్మికుల అక్రమ రవాణా, మోసపూరిత కన్సల్టెన్సీ ప్రాక్టీసులపై దర్యాప్తును వేగవంతం చేసిందని స్పష్టం చేశారు.

రాబోయే 365 రోజులలో అమెరికా ఫారెన్ లేబర్ వీసా ప్రోగ్రామ్ స్వరూపమే పూర్తిగా మారిపోతుందని ఆంటోనీ స్పష్టం చేశారు. అమెరికా ప్రజల ఉద్యోగ హక్కులను కాపాడేందుకు, మోసాలను ప్రపంచానికి ఎత్తిచూపేందుకు తాము నిశ్చయంతో ఉన్నామన్నారు. అమెరికన్ల ఉద్యోగాలు విదేశీయుల పాలు కాకుండా నిరోధించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ‘ప్రాజెక్ట్ ఫైర్‌వాల్’ వంటి కఠిన చర్యలు చేపట్టిందని గుర్తుచేశారు.

హెచ్-1బీ మోసాల దర్యాప్తులో భాగంగా అమెరికా కార్మిక శాఖ ఇప్పటికే డజన్ల కొద్దీ సమన్లు, సెర్చ్ వారెంట్లు జారీ చేసింది. కాగ్నిజెంట్, క్లౌడ్‌ఎరా వంటి ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీలకు సంబంధించిన కొన్ని హెచ్-1బీ వీసా అప్లికేషన్లను అమెరికా ప్రభుత్వం ఇప్పటికే సస్పెండ్ చేసింది. వీటిపై క్రిమినల్ విచారణలు పెండింగ్‌లో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. తప్పుడు పద్ధతుల్లో వీసాలు పొందే కంపెనీలు, ఏజెన్సీలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది.

డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే కొన్ని రకాల హెచ్-1బీ వీసా ఉద్యోగులు అమెరికాలోకి ప్రవేశించకుండా 2027 సెప్టెంబర్ 21 వరకు కఠిన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వీసా జారీ విధానం పూర్తిగా మారిపోనుండటంతో రాబోయే రోజుల్లో అమెరికా వెళ్లాలనుకునే భారతీయ నిపుణులు, ఐటీ కంపెనీలు మరింత కఠినమైన నిబంధనలను ఎదుర్కోవాల్సి రావచ్చు.