అమెరికా, ఇరాన్ వార్ రోజురోజుకు ముదురుతోంది. ఏ క్షణంలో అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై భీకర దాడులకు పాల్పడుతుందని ముందుగానే మాస్టర్ ప్లాన్ వేసింది. తమ అణు సంపత్తిని కాపాడుకోవడానికి ఇరాన్ సైన్యం ఊహించని ప్లాన్‌ను అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా నతాంజ్ ప్రాంతానికి సమీపంలో ఉన్న పికాక్స్ మౌంటెన్ అనే అజేయమైన భూగర్భ కాంప్లెక్స్‌కు వేలాది అణు సెంట్రిఫ్యూజ్‌లను రహస్యంగా తరలించినట్లు తెలుస్తోంది. సుమారు 300 అడుగులకు పైగా లోతులో గట్టి గ్రానైట్ రాళ్లను తొలిచి నిర్మించిన ఈ కేంద్రం ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ భద్రతా వర్గాలకు పెద్ద సవాలుగా మారింది. ఎందుకంటే సాధారణ బాంబులు లేదా క్షిపణులతో దీనిని ధ్వంసం చేయడం అసాధ్యమని తెలుస్తోంది.

గతేడాది జూన్‌, ఇటీవల 2026 ఫిబ్రవరిలో ఇరాన్‌కు చెందిన కీలక అణు స్థావరాలపై అమెరికా, ఇజ్రాయెల్‌లు కలిసి వైమానిక దాడులు జరిపాయి. అయితే ఈ పికాక్స్ కాంప్లెక్స్ కొండల కింద నిర్మించడం వల్ల ఎలాంటి నష్టం జరగలేదు. దీంతో శాటిలైట్ చిత్రాలను పరిశీలించగా.. గత 15 నెలలుగా ఈ కొండల సమీపంలో భారీ నిర్మాణాలు, నిరంతరం ట్రక్కుల రాకపోకలు సాగుతున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఇతర బహిరంగ స్థావరాలపై దాడులు పెరిగే కొద్దీ.. ఇరాన్ తమ అత్యంత కీలకమైన యురేనియం సుసంపన్నత పరికరాలను ఈ సేఫ్ జోన్‌కి మార్చిందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Also Read : డెంగ్యూ వ్యాక్సిన్‌కు గ్రీన్ సిగ్నల్.. నాలుగు నుంచి అరవై ఏళ్ల వారికి!

అయితే పికాక్స్ భూగర్భ కోట లోపల అసలు ఎంత పరిమాణంలో అణు కార్యకలాపాలు సాగుతున్నాయో నేరుగా తనిఖీ చేయడానికి ఇరాన్ ప్రభుత్వం ఇప్పటివరకు IAEA ఇన్‌స్పెక్టర్లకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. ఈ సైట్‌లో అణు పరిశోధనలు పునఃప్రారంభించనున్నట్లు ఇరాన్ గతంలోనే సూచించింది. అయితే ఇక్కడ ఎంతవరకు యురేనియం సుసంపన్నత జరుగుతోందో చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. అంతర్జాతీయ తనిఖీలు ఏమాత్రం లేకుండా, ఇరాన్ అక్కడ రహస్యంగా అణ్వాయుధ తయారీకి అవసరమైన స్థాయికి యురేనియంను తయారు చేస్తోందని పాశ్చాత్య దేశాలు తీవ్రంగా భయపడుతున్నాయి.

ఈ రహస్య స్థావరంపై అమెరికాతో పాటు మిగతా దేశాల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ పికాక్స్ కాంప్లెక్స్‌ను లక్ష్యంగా చేసుకుని వార్నింగ్ ఇచ్చారు. త్వరలోనే ఈ ప్లేస్‌పై భారీస్థాయిలో దాడులు చేస్తామని హెచ్చరించారు. అయితే ఈ అణుకోటపై వస్తున్న ఆరోపణలను ఇరాన్ ఖండిస్తోంది. తమ అణు కార్యక్రమం కేవలం విద్యుత్ ఉత్పాదన, వైద్య పరిశోధనలు, ఇతర పౌర అవసరాల కోసమేనని, ఆయుధాల తయారీ తమ లక్ష్యం కాదని అంటోంది. ఏదేమైనా ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయనున్నట్లు తెలుస్తోంది.

Also Read : రాహుల్ గాంధీకి తీవ్ర అస్వస్థత.. ముక్కులో నుంచి బ్లడ్!