IRAN : అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్ కీలక హెచ్చరిక చేసింది. తమ భద్రతకు ముప్పు వస్తే ప్రపంచంలోని ఏ మౌలిక సదుపాయాలు కూడా సురక్షితంగా ఉండవని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాఘెర్ గాలిబాఫ్ అన్నారు. హోర్ముజ్ జలసంధి విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ఇరాన్ భద్రతను దెబ్బతీసే ప్రయత్నం జరిగితే తమ నుంచి గట్టి స్పందన ఉంటుందని హెచ్చరించారు.

Also Read : అమెరికాతో తుది పోరుకు సిద్ధం… ఇరాన్ విదేశాంగ మంత్రి సంచలన ప్రకటన

ప్రపంచానికి చమురు సరఫరాలో హోర్ముజ్ జలసంధి చాలా కీలకం. ఈ ప్రాంతంలో ఇరాన్ నుంచి చమురు బయటకు వెళ్లకపోతే.. ఇతర దేశాలు కూడా అక్కడి నుంచి చమురు తరలించలేవని గాలిబాఫ్ అన్నారు. తమ భద్రతకు హామీ లేకపోతే ఎలాంటి మౌలిక సదుపాయాలు సురక్షితంగా ఉండవని పేర్కొన్నారు. అమెరికా బెదిరింపులకు ఇరాన్ భయపడబోదని గాలిబాఫ్ అన్నారు. తమ దేశంపై దాడి లేదా ఇతర చర్యలు జరిగితే దానికి వేగంగా, కఠినంగా స్పందిస్తామని హెచ్చరించారు. గతంలో ఇరాన్‌పై జరిగిన యుద్ధాలు, ఆంక్షలను ప్రస్తావించిన ఆయన.. ఒత్తిడి, బెదిరింపులతో తమ దేశాన్ని వెనక్కి తగ్గించలేరని అన్నారు. అమెరికా తమపై సముద్ర మార్గంలో ఆంక్షలు విధించడం, వాణిజ్య మార్గాలను అడ్డుకోవడం వంటి చర్యలు చేపట్టినా వాటిని ఎదుర్కొనేందుకు ఇరాన్ సిద్ధంగా ఉందని చెప్పారు.

ఇదిలా ఉంటే అమెరికా, ఇరాన్ మధ్య పరోక్ష చర్చలు కొనసాగుతున్నాయి. ఖతార్ వంటి మధ్యవర్తుల ద్వారా ఇరు దేశాల ప్రతినిధులు సంప్రదింపులు జరుపుతున్నారు. హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం, ఆంక్షలు, ఇరాన్ అణు కార్యక్రమం వంటి అంశాలు ఈ చర్చల్లో ప్రధానంగా ఉన్నాయి. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి న్యూయార్క్‌లో ఖతార్ మధ్యవర్తులతో చర్చలు జరిపిన తర్వాత టెహ్రాన్‌కు బయలుదేరారు. అమెరికా నుంచి అధికారిక సమాధానం కోసం ఇరాన్ ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఇటీవల ఇరాన్.. హోర్ముజ్ జలసంధిని తెరవడం, అణు చర్చలు తిరిగి ప్రారంభించడం వంటి ప్రతిపాదనలు చేసింది. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆ ప్రతిపాదనను తిరస్కరించారు.

Also Read : చట్టాన్ని పక్కన పెట్టి చైనాకు ఆయుధాలు.. ట్రంప్ స్కెచ్ అదేనా?

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.