Abbas Araghchi :గత కొన్ని సంవత్సరాలుగా అమెరికాతో సాగిస్తున్న యుద్ధంలో తుది పోరుకు తాము సిద్ధంగా ఉన్నామని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీ స్పష్టం చేశారు. అయినప్పటికీ చివరి అవకాశంగా చర్చల ద్వారా సమస్య పరిష్కారం లభించాలని ఆశిస్తున్నట్టు అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. అమెరికాలో జరుగుతున్న మిడ్ టర్మ్ ఎన్నికల తరువాత దాడులు మరింత తీవ్రం చేస్తామని అధ్యక్షుడు ట్రంప్ తన సన్నిహితుల వద్ద ప్రస్తావించిన విషయాన్ని ఓ అమెరికా పత్రిక ఇటీవల ప్రచురించింది. ఈ వార్తలపై స్పందించిన అబ్బాస్‌ అరాగ్చీ మాట్లాడుతూ తాము తుదిపోరుకు సిద్ధమేనని తేల్చి చెప్పారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మళ్లీ యుద్ధం చేయడానికి మేము పూర్తి సన్నద్ధతతో ఉన్నాము. ఎలాంటి దాడులనైనా తిప్పి కొట్టేందుకు సిద్ధంగా ఉన్నాము. అది తుది పోరు అయినా మేము వెనకడుగు వేయబోము. కాబట్టి, తదుపరి ఏం చేయాలనేది తేల్చుకోవాల్సింది అమెరికా అధ్యక్షుడే’ అంటూ ఆయన తేల్చి చెప్పారు.
కాగా హర్మూజ్ తెరిచేందుకు పలు షరతులతో కూడిన ప్రతిపాదనలను ఇటీవల ఇరాన్ అమెరికా ముందుంచిన విషయం తెలిసిందే. దీనికి ఖతారీ మధ్యవర్తుల ద్వారా ఈ ప్రతిపాదనలు పంపించింది. వీటిపై అధ్యక్షుడు ట్రంప్ స్పందిస్తూ వాటిని తిరస్కరించానని తేల్చి చెప్పారు. అంతేకాదు ఓటమి అంచున ఉన్న వారు డీల్ కోసం తహతహలాడుతున్నారని కూడా ట్రంప్‌ పేర్కొన్నారు.

అయితే, ఈ విషయమై అబ్బాస్‌ మాట్లాడుతూఈ డీల్‌ను తిరస్కరించిన విషయాన్ని అమెరికా తమకు మధ్యవర్తుల ద్వారా ఇంకా తెలియజేయలేదని తెలపడం విశేషం. తమ షరతుల్లో కొత్తవేమీ లేవని, గతంలో వీటిని అమెరికా అంగీకరించిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ‘విదేశాల్లో అక్రమంగా సీజ్ చేసిన మా డబ్బు, ఆస్తులు మాకు కావాలి. ముడి చమురును స్వేచ్ఛగా విక్రయించుకునే అవకాశం మాకు ఉండాలి. ఇవేమీ కొత్త షరతులు కావు’ అని ఆయన స్పష్టం చేశారు. గతంలో అమెరికాతో కుదిరిన అవగాహన ఒప్పందంలో ఈ అంశాలు ఉన్నాయని అబ్బాస్‌ గుర్తు చేశారు.

కాగా, ఈ యుద్ధం అతి త్వరలో ముగియనుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం ప్రకటించారు. ఆ తరువాత ముడి చమురు ధరలు కూడా దిగొస్తాయని పేర్కొన్నారు. ఆర్థికంగా ఒత్తిడి పెంచడంతో పాటు మిలిటరీ చర్యలతో ఇరాన్‌పై విజయం సాధిస్తున్నామని ట్రంప్‌ స్పష్టం చేశారు.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.