
మిడిల్ ఈస్ట్‌లో మళ్లీ హైటెన్షన్ నెలకొంది. ప్రపంచానికి ఎంతో కీలకమైన హోర్ముజ్ జలసంధి పరిసరా ప్రాంతాల్లో అమెరికా, ఇరాన్ బలగాల మధ్య పరస్పర దాడులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. అమెరికాకు చెందిన విమానవాహక నౌకతో పాటు గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్‌పై తాము బాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేసినట్లు ఇరాన్ ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రతిదాడితో అమెరికా నౌకలు దెబ్బతిని అక్కడి నుంచి వెనక్కి పారిపోయాయని ఇరాన్ మీడియా వెల్లడించింది. అయితే ఇరాన్ చేసిన ఈ ప్రకటనలను అమెరికా సెంట్రల్ కమాండ్ తీవ్రంగా ఖండించింది.
Also Read : జాగ్వార్ ల్యాండ్ రోవర్ కీలక నిర్ణయం… 4 వేల ఉద్యోగాలకు కోత
ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను తమ నౌకాదళం విజయవంతంగా అడ్డుకుందని, అమెరికా యుద్ధనౌకలకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని, నేవీ సిబ్బంది ఎవరికీ గాయాలు కాలేదని అమెరికా స్పష్టం చేసింది. ఇరాన్ దళాలు అనవసరంగా ఉసిగొల్పే చర్యలకు పాల్పడుతున్నాయని వాషింగ్టన్ మండిపడింది. దాడులకు దారితీసిన అసలు కారణాలు ఈ ఘర్షణకు ఇరుదేశాల మధ్య నిరంతరం సాగుతున్న నౌకాదళ ఆధిపత్య పోరే ప్రధాన కారణం. అమెరికా బలగాలు తమ వాణిజ్య నావలను నిరోధిస్తున్నాయని, హోర్ముజ్ జలసంధి వద్ద నావికా దిగ్బంధం విధించేందుకు యత్నిస్తున్నాయని ఇరాన్ ఆరోపించింది.
శనివారం ఉదయం ఇరాన్‌కు చెందిన మూడు క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లపై అమెరికా సైన్యం దాడి చేసి దెబ్బతీసినట్లు IRGC తెలిపింది. దీనికి ప్రతీకారంగానే తాము అమెరికా యుద్ధనౌకలతో పాటు అమెరికాతో సంబంధం ఉన్న ఇతర నౌకలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు ప్రయోగించామని IRGC ప్రకటించింది. మరోవైపు అంతర్జాతీయ జలసంధిలో ఇరాన్ అక్రమంగా నౌకల రాకపోకలను నియంత్రించాలని చూస్తోందని అమెరికా ఆరోపిస్తోంది.
ఇరాన్ ప్రయోగించిన క్షిపణి దాడులకు ప్రతిస్పందనగా, ఖార్గ్ ఐలాండ్, జస్క్ తీరప్రాంతాల్లో ఇరాన్‌కు చెందిన ‘M/T డౌనీ’, ‘M/T స్టార్క్ 1’, ‘M/T కైలో’ అనే మూడు ఆయిల్ ట్యాంకర్లను శాశ్వతంగా ధ్వంసం చేసినట్లు అమెరికా రక్షణ శాఖ ప్రకటించింది. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి మార్గంలో ఇరుదేశాల దాడులు కలకలం రేపుతున్నాయి. అనుమతి లేని జలమార్గాల్లో ప్రయాణించే ఏ నౌకనైనా తాము వదిలేది లేదని, అమెరికా హెచ్చరికలను నమ్మి అనుమానాస్పద కదలికలు జరిపితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ దళాలు అంతర్జాతీయ నౌకలకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశాయి.
Also Read : ఇరాన్‌లో ఈ కొండను పేల్చేస్తానన్న ట్రంప్.. అసలు కథ ఏంటి?









