Houthis Attacks : పశ్చిమాసియా (Middle East) ప్రాంతంలో ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరాయి. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన ఎర్రసముద్రం (Red Sea), హర్మూజ్ జలసంధి ప్రాంతాలు యుద్ధ మేఘాలతో అల్లకల్లోలంగా మారాయి. యెమెన్‌కు చెందిన ఇరాన్ మద్దతుదారైన హౌతీ తిరుగుబాటుదారులు ఎర్రసముద్రంలో ప్రయాణిస్తున్న సౌదీ అరేబియాకు చెందిన రెండు భారీ చమురు ట్యాంకర్లపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డారు. ‘ఎన్సేలియా’ (ENCELIA), ‘లైలా’ (LAYLA) అనే రెండు నౌకలను లక్ష్యంగా చేసుకుని బాలిస్టిక్ క్షిపణులు, క్రూయిజ్ క్షిపణులు, విస్ఫోటన డ్రోన్లతో ఈ దాడులకు పాల్పడినట్లు హౌతీ దళాలు ప్రకటించాయి.

ఇటీవల యెమెన్ రాజధాని సనా (Sanaa) విమానాశ్రయంపై సౌదీ దళాలు నిర్వహించిన వైమానిక దాడులకు ప్రతీకారంగానే ఈ సైనిక చర్య చేపట్టినట్లు హౌతీ దళాల అధికారిక ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ యాహ్యా సరియా (Yahya Saree) తెలిపారు. తమ దాడి ధాటికి నౌకల్లో భారీగా మంటలు చెలరేగాయని, ఈ భయంతో మరో 10 వాణిజ్య నౌకలు తమ ప్రయాణాన్ని రద్దు చేసుకుని వెనక్కి మళ్లాయని ఆయన వెల్లడించారు. ఈ దాడులపై సౌదీ అరేబియా రవాణా శాఖ (TGA) స్పందిస్తూ.. ‘ఎన్సేలియా’ నౌక ముందు భాగంపై దాడి జరిగి మంటలు చెలరేగిన మాట వాస్తవమేనని, అయితే నౌకలోని సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని తెలిపింది. గత 12 ఏళ్లుగా సౌదీ అరేబియా తమపై అక్రమ దిగ్బంధనాన్ని ప్రయోగిస్తోందని, దానికి సమాధానంగా తాము సౌదీ నౌకలపై ‘సముద్ర దిగ్బంధనం’ విధిస్తున్నామని, మళ్లీ దాడికి తెగబడితే సౌదీ భూభాగంలోకి చొచ్చుకెళ్లి భారీ సైనిక చర్యలు చేపడతామని హౌతీలు స్పష్టం చేశారు.

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలకు తోడు ఇప్పుడు హౌతీ తిరుగుబాటుదారులు మళ్లీ విరుచుకుపడటంతో అంతర్జాతీయ వాణిజ్యానికి పెద్ద విఘాతం కలిగింది. ఎర్రసముద్రం ద్వారా జరిగే నౌకాయానం ప్రమాదంలో పడటంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతోంది. ఇంధన సరఫరాలో ఆటంకాలు ఏర్పడే ప్రమాదం ముంచుకొస్తుండటంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా మండిపోతున్నాయి.

ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. హౌతీలు దాడులకు పాల్పడితే దానికి ఇరాన్ ప్రతినిధులుగా ఉన్న టెహ్రాన్ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. హౌతీల చర్యలకు ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, అవసరమైతే ఇరాన్‌పై నేరుగా బలమైన సైనిక చర్య చేపడతామని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.వాణిజ్య నౌకలపై దాడులను అరికట్టేందుకు గతంలో అమెరికా బలగాలు హౌతీలకు గట్టి బుద్ధి చెప్పాయని, అప్పటి నుంచి వారు కొంతవరకు నియంత్రణలోనే ఉన్నారని ట్రంప్ గుర్తుచేశారు. అయితే దురదృష్టవశాత్తు ఇప్పుడు మళ్లీ సౌదీ నౌకలపై దాడులు మొదలుపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 12న అమెరికా బలగాలు ఇరాన్‌పై జరిపిన దాడికి ప్రతీకారంగానే తాము ఈ చమురు నౌకలను దెబ్బతీసినట్లు హౌతీలు ప్రకటించడం గమనార్హం.

మరోవైపు, అంతర్జాతీయ వాణిజ్య నౌకలను, నావికులను బెదిరించేందుకు ఇరాన్ , దాని మద్దతుదారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని అమెరికా సెంట్రల్ కమాండ్ పేర్కొంది. ఇరాన్ దుశ్చర్యలకు అడ్డుకట్ట వేసేందుకే తమ దళాలు పశ్చిమాసియా ప్రాంతంలో వ్యూహాత్మక దాడులు నిర్వహిస్తున్నాయని, అంతర్జాతీయ జలాల్లో నౌకల రక్షణే తమ ప్రాధాన్యత అని వెల్లడించింది.ప్రపంచంలోనే అతిముఖ్యమైన చమురు రవాణా మార్గమైన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) పై మళ్లీ పూర్తి పట్టు సాధించేందుకు, నౌకల రాకపోకలు సజావుగా సాగేలా చూసేందుకు అమెరికా దళాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. హర్మూజ్‌ జలసంధిలో శాంతి భద్రతలను పునరుద్ధరించి, తమ పట్టును నిలుపుకుంటామని యూఎస్ సెంట్రల్ కమాండ్ ధీమా వ్యక్తం చేసింది.

MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.