Nepal Landslide : నేపాల్‌లో హిమానీనదం (గ్లేసియర్‌) విరిగిపడడం మూలంగా భారీ వరదలతో అతలాకుతలమైన విషయం తెలిసిందే. ఆ ప్రమాదం నుంచి ఇంకా కోలుకోకముందే నేపాల్‌ను మరో ముప్పు వెంటాడుతోంది. తాజాగా అక్కడి అధికారులు జారీచేసిన వరద ప్రమాద హెచ్చరికలు ప్రజలను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. నేపాల్‌ లో ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాల మూలంగా దార్చులా జిల్లాలోని భట్టార్‌ ప్రాంతంలో మరోసారి కొండచరియలు విరిగిపడ్డాయి. విరిగిపడిన కొండ చరియలు చౌలానీ నది ప్రవాహానికి అడ్డంకిగా మారడంతో పెద్ద ఎత్తున నీరు నిలిచిపోయింది. కొండలపై నుంచి జారిపడిన రాళ్లు, మట్టితో నదీ ప్రవాహం పాక్షికంగా నిలిచిపోవడంతో స్థానికులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం విరిగిపడిన రాళ్లు తొలగిపోతే ఒక్కసారిగా దిగువ ప్రాంతాలను వరద ముంచెత్తే ప్రమాదం ఉందని సంబంధిత అధికారులు హెచ్చరించారు.

Also Read : ఇరాన్‌తో యుద్ధం వేళ సౌదీకి అమెరికా భారీ డీల్‌.. రూ.42 వేల కోట్ల బాంబులు!

ప్రమాదాన్ని పసిగట్టిన అధికారులు నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చిరించారు. అలాగే ప్రస్తుత పరిస్థితిని పర్యవేక్షించేందుకు పోలీసులను రంగంలోకి దించారు. సహాయక చర్యల కోసం అత్యవసర ఫోన్‌ నంబర్లను కూడా విడుదల చేశారు. మొన్నటి వరదలతో అతలాకుతలమైన నేపాల్‌ దెబ్బతిన్న ప్రాంతాలు ఇంకా కోలుకోకముందే.. మరో కొత్త ముప్పు పొంచి ఉండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది.

Also Read : టిక్‌టాక్‌ ఫాలోవర్ల కోసం చెల్లితో గొడవ.. 15 ఏళ్ల చెల్లిని కత్తితో చంపిన అక్క!

కాగా విరిగిపడిన కొండ చరియల మూలంగా పరిస్థితి మరింత తీవ్రమైతే మట్టి, రాళ్లతో నది పూర్తిగా మూసుకుపోయే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే ఎగువ ప్రాంతాల్లో నీరు నిలిచి.. ఒక్కసారిగా దిగువ ప్రాంతాల వైపు భారీగా ప్రవహించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో నదీ తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిక జారీ చేశారు. దాంతో పాటు కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. దీని మూలంగా ఎదురయ్యే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భద్రతా సిబ్బందిని కూడా రంగంలోకి దించినట్లు అధికారులు తెలిపారు. నదికి సమీపంలో ఉన్న ప్రజలు అనవసరంగా బయటకు వెళ్లవద్దని సూచించారు. నీటి మట్టంలో మార్పులు కనిపించినా, నదీ ప్రవాహం అకస్మాత్తుగా పెరిగినా.. వెంటనే అప్రమత్తం అవ్వాలని సూచించారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో నదీ తీర ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరించారు.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.