Saudi :  ఇరాన్‌తో యుద్ధం కొనసాగుతున్న వేళ అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. సౌదీ అరేబియాకు సుమారు 5 బిలియన్ డాలర్ల విలువైన బాంబులు, వాటిని లక్ష్యానికి కచ్చితంగా చేరవేసే గైడెన్స్ కిట్లు, ఇతర సైనిక పరికరాలను అమ్మేందుకు అమెరికా ఆమోదం తెలిపింది. అమెరికా-ఇజ్రాయెల్‌ దాడుల నేపథ్యంలో ఇరాన్‌, ఇరాన్‌ మద్దతున్న యెమెన్‌ హౌతీ తిరుగుబాటుదారుల నుంచి సౌదీపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు జరుగుతున్నాయి. ఈ పరిస్థితిలో సౌదీ రక్షణ సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ డీల్‌ ఉపయోగపడుతుందని అమెరికా చెబుతోంది.

Also Read : లీక్‌ దొంగలెవరు ..? మిలిటరీ అధికారులకు ట్రంప్‌ లైడిటెక్టర్‌ పరీక్షలు!

ఈ ఆయుధాల వల్ల సౌదీకి గాల్లో నుంచి వచ్చే దాడులను ఎదుర్కొనే సామర్థ్యం పెరుగుతుందని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఉన్న, భవిష్యత్తులో వచ్చే ప్రాంతీయ ముప్పులను ఎదుర్కోవడానికి ఇవి ఉపయోగపడతాయని చెప్పింది. అలాగే సౌదీ భద్రతను పెంచడంతో పాటు అమెరికా, గల్ఫ్‌ దేశాల సైనిక వ్యవస్థలతో కలిసి పనిచేసే సామర్థ్యం కూడా మెరుగవుతుందని పేర్కొంది.

సౌదీ అరేబియా అమెరికాకు ప్రధాన నాన్-నాటో మిత్రదేశం. ఈ డీల్‌ వల్ల సౌదీ భద్రత పెరుగుతుందని, తద్వారా అమెరికా విదేశాంగ విధానం, జాతీయ భద్రత లక్ష్యాలకు కూడా మేలు జరుగుతుందని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. అయితే ఈ ఆయుధాల అమ్మకం ఇంకా పూర్తిగా ఖరారు కాలేదు. డీల్‌ గురించి అమెరికా విదేశాంగ శాఖ ఇప్పటికే కాంగ్రెస్‌కు సమాచారం ఇచ్చింది. తుది ఆమోదం అమెరికా చట్టసభ సభ్యులు ఇవ్వాల్సి ఉంది.

అమెరికా ఆమోదించిన ప్యాకేజీలో 10,000కు పైగా JDAM-ER ప్రెసిషన్ గైడెన్స్ కిట్లు, అలాగే సుమారు 10,000 బాంబులు ఉన్నట్లు తాజా రిపోర్టులు చెబుతున్నాయి. ఇదే సమయంలో అమెరికా సౌదీకి మరో $750 మిలియన్ విలువైన AGT-1500 ట్యాంక్ ఇంజిన్ల అమ్మకానికీ అనుమతి ఇచ్చింది. ఈ డీల్‌కు హనీవెల్ ప్రధాన కాంట్రాక్టర్‌గా ఉంది.

Also Read : ఇరాన్‌లో ఈ కొండను పేల్చేస్తానన్న ట్రంప్.. అసలు కథ ఏంటి?

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.