
వివిధ కేసుల్లో అడియాలా జైలులో కఠిన శిక్ష అనుభవిస్తున్న పాకిస్థాన్ మాజీ ప్రధాని, తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ తన ఆరోగ్యం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. జైలులో తన ఆరోగ్యం పూర్తిగా రోజురోజుకు క్షీణిస్తోందని, బతికి రాలేకపోవచ్చని.. జైల్లోనే చనిపోవచ్చని అత్యున్నత న్యాయస్థానాన్ని ఇమ్రాన్ ఖాన్ హెచ్చరించారు. తనకు, తన భార్య బుష్రా బీబీకి తక్షణమే సరైన వైద్య చికిత్స అందేలా చూడాలని ఆయన పాక్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు.
నవంబర్ 11న అడియాలా జైలులో ఇమ్రాన్ ఖాన్‌ను ఆయన న్యాయవాది సల్మాన్ సఫ్దర్ ప్రత్యక్షంగా కలిశారు. ఆ సమయంలో ఇమ్రాన్ ఖాన్ తన చేతితో రాసిన ఒక లేఖను ఆయనకు అందజేశారు. ఈ విషయాన్ని న్యాయవాది ఎక్స్ వేదికగా పంచుకోవడంతో దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది. సుప్రీంకోర్టు, ఫెడరల్ రాజ్యాంగ న్యాయస్థానం, ఇస్లామాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ఈ లేఖను గమనించి గతంలో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తూచా తప్పకుండా అమలు చేయాలని ఖాన్ కోరారు. తన 74 ఏళ్ల వయస్సులో ఈ నిరంతర జైలు నరకం, ఒంటరితనం తన ప్రాణాలను బలిగొనేలా ఉందని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : జెన్ జెడ్, మిలీనియల్స్ బొమ్మలతో ఎందుకు ఆడుకుంటున్నారు? కిడల్ట్ ట్రెండ్ వెనుక అసలు స్టోరీ ఇదే!
2023 నుంచి జైలులో ఉంటూ వందకు పైగా రాజకీయ, ఇతర కేసులను ఎదుర్కొంటున్న ఇమ్రాన్ ఖాన్ తనపై జరుగుతున్న అణచివేతను తీవ్రంగా ఎండగట్టారు. గతేడాది డిసెంబర్ నుంచి తనను రోజుకు ఏకంగా 22 గంటల పాటు ఏకాంత నిర్బంధంలో ఉంచుతున్నారని ఆరోపించారు. ఈ సమయంలో తన కుటుంబ సభ్యులను కలవడం గానీ, న్యాయవాదులతో మాట్లాడటం గానీ, కనీసం పుస్తకాలు చదవడం లేదా టెలివిజన్ చూడటం వంటి ప్రాథమిక మానవ సౌకర్యాలు కూడా కల్పించడం లేదని వాపోయారు. కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ జైలు అధికారులు వాటిని బుట్టలో వేసి తన భార్య బుష్రా బీబీతో వారపు సమావేశాలను సైతం నిరంతరం అడ్డుకుంటున్నారని ఇమ్రాన్ ఖాన్ మండిపడ్డారు.
ఇమ్రాన్ ఖాన్‌తో పాటు ఆయన భార్య బుష్రా బీబీ ఆరోగ్యం కూడా తీవ్రంగా క్షీణిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఆమెకు కంటి శస్త్రచికిత్స జరిగిందని.. ప్రస్తుతం ఆమె కంటిచూపు కోల్పోయే ప్రమాదంలో ఉందని తెలిపారు. నవంబర్ 11న జరిగిన సమావేశంలో ఆమె కాంతిని కూడా అసలు తట్టుకోలేకపోయారని, కళ్లు తెరవలేకపోయారని ఖాన్ తెలిపారు. తక్షణమే ఆమెకు మెరుగైన వైద్యం అందించకపోతే శాశ్వతంగా దృష్టిని కోల్పోతారని అన్నారు. కానీ జైలు అధికారులు ఆమెను ప్రత్యేక వైద్యులను కలవడానికి కూడా అనుమతించడం లేదని ఆరోపించారు.
ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం ప్రమాదకరంగా ఉందని చెప్పవచ్చు. నవంబర్ 10న ఆయన రక్తపోటు అకస్మాత్తుగా పెరిగిపోయి 192 నుంచి 193 స్థాయికి చేరుకుందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మెదడులో రక్తస్రావం లేదా గుండెపోటు వచ్చే తీవ్రమైన ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించినట్లు తెలిపారు. సుప్రీంకోర్టు గతంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, తనను ఆసుపత్రికి తరలించడంలో, వైద్య బృందాన్ని ఏర్పాటు చేయడంలో జైలు అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. తాను ఏమాత్రం రాజకీయ లబ్ది కోసం లేదా ఎవరి దయకోసం ఈ విజ్ఞప్తి చేయడం లేదని.. కేవలం చట్టం కల్పించిన ప్రాథమిక హక్కుల కోసం, న్యాయం కోసం మాత్రమే అడుగుతున్నానని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు. నేను బ్రతికి ఉంటేనే నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకోగలనని తెలిపారు.
Also Read : పాక్ కొత్త ఎత్తుగడ.. టర్కీ నుంచి లక్ష ‘మెర్కుట్’ FPV డ్రోన్లు









