US-Iran War: మిడిల్ ఈస్ట్‌లో (పశ్చిమాసియా) పరిస్థితులు అత్యంత వేగంగా విషమిస్తున్నాయి. అమెరికా, ఇరాన్ దేశాలు ఒకరినొకరు లక్ష్యంగా చేసుకుని సరిహద్దులు దాటి దాడులకు తెగబడుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి ఇరాన్ అంతర్గత మౌలిక సదుపాయాలపై అమెరికా బలగాలు విరుచుకుపడ్డాయి. వరుసగా ఏడో రోజు కూడా ఈ దాడులు కొనసాగాయని, ఇరాన్‌లోని నిఘా కేంద్రాలు, మిలిటరీ లాజిస్టిక్స్ విభాగాలతో పాటు భూగర్భ ఆయుధ నిల్వ కేంద్రాలను విజయవంతంగా లక్ష్యంగా చేసుకున్నట్లు శనివారం తెల్లవారుజామున యూఎస్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) అధికారికంగా నివేదించింది.

అమెరికా వైమానిక దాడులకు ప్రతిచర్యగా ఇరాన్ సైన్యం కూడా భీకరమైన ప్రతీకార దాడులకు తెగబడింది. జోర్డాన్‌ దేశంలో ఉన్న రెండు కీలకమైన అమెరికన్ సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణులతో దాడి చేసింది. ఈ దాడుల వల్ల పలువురు అమెరికా సైనికులు గాయపడినట్లు ప్రాథమిక నివేదికలు అందుతున్నప్పటికీ, యూఎస్ అధికారిక వర్గాలు దీనిని ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది. మిడిల్ ఈస్ట్‌లోని అమెరికా మిలిటరీ స్థావరాలను దెబ్బతీయడమే లక్ష్యంగా తాము కొత్తగా దాడుల పర్వాన్ని ప్రారంభించినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) శుక్రవారం స్పష్టం చేసింది.

తమ పరిధిని మరింత విస్తరిస్తూ సిరియా, కువైట్, ఒమన్, బహ్రెయిన్, జోర్డాన్ దేశాలలో మోహరించి ఉన్న అమెరికా రక్షణ లక్ష్యాలపై ఏకకాలంలో దాడులు చేసినట్లు ఐఆర్‌జీసీ (IRGC) ప్రకటించింది. ఈ దాడి సమయాల్లో అమెరికాకు చెందిన అత్యాధునిక ‘పెట్రియాట్ క్షిపణి నిరోధక వ్యవస్థ’ (Patriot Missile Defense System) ఇరాన్ ప్రయోగించిన కొన్ని క్షిపణులను అడ్డుకోవడంలో విఫలమైనట్లు రక్షణ రంగ నివేదికలు సూచిస్తున్నాయి. అమెరికా బలగాలకు ఆశ్రయం ఇస్తోన్న దేశాలపై తమ దాడులు ఇలాగే కొనసాగుతాయని ఇరాన్ మీడియా హెచ్చరించింది.

ప్రస్తుతం జోర్డాన్ దేశంలో దాదాపు 3000 నుండి 4000 మంది వరకు యూఎస్ సైనికులు వివిధ రక్షణ విధుల్లో మోహరించి ఉన్నారు. అక్కడ ఉన్న రాయల్ జోర్డాన్ వైమానిక దళానికి చెందిన ‘మువఫ్పాక్ సాల్టి’ బేస్ అమెరికాకు ప్రధాన వ్యూహాత్మక కేంద్రంగా ఉంది. ఇక్కడి నుంచే అమెరికా తన యుద్ధ విమానాలు, డ్రోన్లను ఇరాన్ వ్యతిరేక కార్యకలాపాల కోసం ఉపయోగిస్తోంది. శనివారం నాడు ఇరాన్ ఈ మువఫ్పాక్ సల్టీ ఎయిర్ బేస్‌తో పాటు ‘ప్రిన్స్ హసన్’ ఎయిర్ బేస్‌లపై భారీగా విరుచుకుపడటంతో జోర్డాన్ రక్షణ వలయంలో అలజడి రేగింది.

Also Read : పాకిస్థాన్‌లో ఘనంగా జగన్నాథుని రథయాత్ర.. వేలాది మంది భక్తుల సమక్షంలో!

ఇరాన్ తన బాలిస్టిక్ క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్ల ద్వారా పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలను ముట్టడిస్తోంది. కువైట్‌లోని క్యాంప్ అల్-ఉదైరి, అలీ అల్-సలేం ఎయిర్ బేస్, బహ్రెయిన్‌లోని షేక్ ఇసా ఎయిర్ బేస్‌లలోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. ఈ దాడుల వల్ల అమెరికాకు చెందిన ఫైటర్ జెట్ కమాండ్ సెంటర్లు, డ్రోన్ హ్యాంగర్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని, అమెరికా సైన్యానికి భారీగా ప్రాణనష్టం జరిగిందని ఇరాన్ క్లెయిమ్ చేస్తోంది. ఈ తీవ్ర భయాందోళనల నేపథ్యంలో కువైట్ ప్రభుత్వం తన దేశంలోని విమాన ఆపరేషన్లను తాత్కాలికంగా నిలిపివేసింది.

మరోవైపు, ప్రపంచ దేశాల ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన ‘హర్ముజ్ జలసంధి’ (Strait of Hormuz) యుద్ధ భూమిగా మారింది. యుద్ధం మొదలైన కొత్తలో ఇరాన్ ఈ జలమార్గంలో అమర్చిన సముద్రపు మందుపాతరలు (Sea Mines) ఇప్పుడు అంతర్జాతీయ నౌకలకు శాపంగా మారాయి. అమెరికా ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారంతో ప్రయాణించిన రెండు భారీ చమురు ట్యాంకర్లు ఈ సీమైన్లను ఢీకొట్టడం వల్ల జలసంధిలో పేలిపోయాయని ఐఆర్‌జీసీ శనివారం వెల్లడించింది. అలాగే ఈ మార్గంలో నిబంధనలు ఉల్లంఘించి వెళ్లేందుకు ప్రయత్నించిన మరో నాలుగు నౌకలను తాము విజయవంతంగా అడ్డుకున్నట్లు ఇరాన్ పేర్కొంది.

అయితే, హర్ముజ్ జలసంధిలో సముద్రపు మందుపాతరల వల్ల చమురు ట్యాంకర్లు పేలిపోయాయన్న ఇరాన్ ప్రకటనను అమెరికా తీవ్రంగా ఖండించింది. అంతర్జాతీయంగా భయాందోళనలు సృష్టించడానికి ఐఆర్‌జీసీ ఎప్పటికప్పుడు ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తోందని యూఎస్ సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ కీలక జలమార్గంలో రాకపోకలను నియంత్రించడానికి ఇరు దేశాల నౌకాదళాలు ముమ్మరంగా ప్రయత్నిస్తుండటంతో, అంతర్జాతీయ సముద్ర వాణిజ్యానికి తీవ్ర అంతరాయం కలుగుతోంది.

అమెరికా దాడుల వల్ల దక్షిణ ఇరాన్ ప్రాంతంలో భారీ పేలుళ్లు సంభవిస్తుండటంతో ఇరాన్ గట్టి హెచ్చరికలు జారీ చేసింది. తమ దేశ విద్యుత్ , ఇతర సివిల్ మౌలిక సదుపాయాలపై దాడులు ఆపకపోతే, ఎర్రసముద్రంలోని ‘బాబ్ అల్ మాండెబ్’ జలసంధిని పూర్తిగా మూసివేయాలని ఇరాన్ తన మద్దతుదారైన హూతీ రెబెల్స్‌ను కోరింది. మరో రెండు రోజులు ఇలాగే దాడులు కొనసాగితే ఏ సరిహద్దు కూడా సురక్షితంగా ఉండదని, తాము పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతామని ఇరాన్ స్పష్టం చేసింది. ఒకవేళ ఇరాన్-హూతీలు కలిసి బాబ్ అల్ మాండెబ్ మూసివేతకు పాల్పడితే గ్లోబల్ ట్రేడ్ సంక్షోభంలో పడుతుందని యూఎస్ మాజీ దౌత్యవేత్త కల్నల్ అబ్బాస్ దహౌక్ ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read : మెక్సికోలో భారీ భూకంపం!

MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.