అమెరికా రాజకీయాల్లో కృత్రిమ మేధ వినియోగానికి సంబంధించిన వివాదం తెరపైకి వచ్చింది. దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ అధికారిక నిర్ణయాలు, విధానాల రూపకల్పనలో ఎలాన్ మస్క్‌కు చెందిన ‘గ్రోక్’ అనే ఏఐ చాట్‌బాట్‌ను విస్తృతంగా ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అరెస్టు చేసే సైనిక ఆపరేషన్‌కు ముందు ట్రంప్ ఈ ఏఐ చాట్‌బాట్‌ను సంప్రదించారని జోరుగా ప్రచారం సాగుతోంది.

Also Read : అమెరికా ఆర్మీ సంచలన నిర్ణయం.. యుద్ధం ముందే సామూహిక సమాధుల శిక్షణ.. కారణమిదే!

ఈ పరిణామాల నేపథ్యంలో డెమొక్రాటిక్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు, ప్రతినిధులు జేమీ రాస్కిన్, రాబర్ట్ గార్సియా తదితరులు వైట్ హౌస్‌కు ఒక అధికారిక లేఖ రాశారు. అధికారిక కార్యక్రమాలు, విధుల్లో ఉన్నప్పుడు అధ్యక్షుడు ట్రంప్, ఆయన సిబ్బంది చాట్‌జీపీటీ, గ్రోక్ వంటి ఏఐ సాధనాలతో జరిపిన అన్ని రకాల సంభాషణలు, ప్రశ్నలు, వాటికి వచ్చిన సమాధానాల రికార్డులను భద్రపరచాలని వారు డిమాండ్ చేశారు. ఈ డిజిటల్ రికార్డులు ఎట్టి పరిస్థితుల్లోనూ చెరిగిపోకుండా లేదా నాశనం కాకుండా సురక్షితంగా ఉంచాలని వారు స్పష్టం చేశారు.

వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను పదవి నుంచి తొలగించి అరెస్టు చేస్తే ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందని ట్రంప్ గ్రోక్ ఏఐని అడిగినట్లు నివేదికలు వెల్లడించాయి. దానికి సమాధానంగా మదురో ఒక నియంత అని, ఆయన తొలగింపును వెనిజులా ప్రజలు ఘనంగా వేడుక చేసుకుంటారని గ్రోక్ బదులిచ్చిందని సమాచారం. ఒక ఏఐ చాట్‌బాట్ అందించిన అభిప్రాయాలు లేదా సలహాల ఆధారంగా అమెరికా ప్రభుత్వం అంతర్జాతీయ విధానాలు లేదా సైనిక నిర్ణయాలు తీసుకుందా అనే కోణంలో డెమోక్రటిక్ చట్టసభ సభ్యులు తీవ్రంగా దర్యాప్తు జరుపుతున్నారు.

ఈ సంచలన అంశంపై సమగ్ర వివరణ ఇవ్వాలని నవంబర్ 11వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు పూర్తి నివేదికను అందించాలని వైట్ హౌస్‌ను డెమొక్రాట్లు కోరారు. అయితే చట్టపరంగా అధ్యక్ష కార్యాలయంలో భద్రపరచాల్సిన అన్ని రికార్డులు, పత్రాలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిబంధనల ప్రకారం సురక్షితంగా భద్రపరుస్తోందని వైట్ హౌస్ వర్గాలు స్పష్టం చేశాయి. మరోవైపు ప్రభుత్వ పనుల్లో ఏఐ వినియోగంపై రక్షణ శాఖ ఇప్పటికే కొన్ని మార్గదర్శకాలను ప్రకటించినప్పటికీ.. కీలకమైన దేశ భద్రత, విదేశీ వ్యవహారాల విషయంలో ప్రైవేట్ ఏఐ చాట్‌బాట్ల ప్రమేయం ఉండటంపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Also Read : ఇజ్రాయెల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. నెతన్యాహు మైండ్ గేమ్.. విపక్ష నేతకే బిగ్ ఆఫర్!