కాంగోలో ప్రారంభమైన ప్రాణాంతక ఎబోలా వైరస్(Ebola Virus) మహమ్మారి ఆఫ్రికా ఖండంలోని ఇతర దేశాలకు వేగంగా విస్తరిస్తూ ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగిస్తోంది. కాంగోతో పాటు ఇప్పటికే ఉగాండా, కెన్యా, నైజీరియా వంటి దేశాలకు కూడా ఈ వ్యాధి పాకింది. ఫ్రాన్స్‌లోనూ ఒక కేసు నమోదైంది. అరుదైన బుండిబుగ్యో అనే వైరస్ రకం వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుండటం మరింత భయాందోళనలు రేకెత్తిస్తోంది. ప్రస్తుతం కాంగో ఒక్క దేశంలోనే ఏకంగా 9,500కు పైగా కేసులు నమోదు కాగా, 4,600 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ రకమైన ఎబోలా వైరస్‌కు నిర్దిష్టంగా ఆమోదించిన టీకా అందుబాటులో లేకపోవడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.

Also Read : పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. ఒక్కసారిగా దిగొచ్చిన బంగారం, వెండి ధరలు.. అసలు కారణం ఇదే!

ఎబోలా సోకిన వ్యక్తుల రక్తం, లాలాజలం, చెమట, వాంతులు లేదా మూత్రం వంటి శరీర ద్రవాలు నేరుగా వేరొకరి శరీరంలోకి ప్రవేశించడం వల్ల వ్యాపిస్తుంది. అడవుల్లో ఉండే గబ్బిలాలు, కోతులు, చింపాంజీల వంటి జంతువుల ద్వారా ఇది ముందుగా మానవులకు సోకుతుంది. వ్యాధి సోకిన జంతువుల మాంసాన్ని సరైన రీతిలో ఉడికించకుండా తినడం వల్ల కూడా ఈ వైరస్ వస్తుంది. వ్యాధిగ్రస్తులకు పరిచర్యలు చేసే కుటుంబ సభ్యులు, వైద్య సిబ్బంది, మరణించిన బాధితుల అంత్యక్రియల్లో పాల్గొనేవారికి భౌతిక స్పర్శ ద్వారా ఈ వైరస్ సులభంగా వ్యాపిస్తుంది. సరిపడా శానిటేషన్ సదుపాయాలు లేకపోవడం, ఆసుపత్రుల్లో సరైన రక్షణ పరికరాలు వాడకపోవడం, వ్యాధి సంకేతాలను ప్రారంభంలోనే గుర్తించకపోవడం వల్ల ఈ వైరస్ వ్యాపిస్తోంది.

ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశించిన 2 నుంచి 21 రోజుల్లో లక్షణాలు బయటపడతాయి. హఠాత్తుగా తీవ్రమైన జ్వరం, విపరీతమైన తలనొప్పి, కండరాల నొప్పులు, గొంతు మంట, తీవ్ర నీరసం, వాంతులు -విరేచనాలు కావడం ఈ వ్యాధి ప్రధాన సంకేతాలు అని నిపుణులు చెబుతున్నారు. బుండిబుగ్యో వైరస్ రకంలో లేదా బాహ్యంగా రక్తస్రావం అయ్యే అవకాశం తక్కువగా ఉన్నప్పటికీ, కణజాలాలను, అవయవాలను ఇది తీవ్రంగా దెబ్బతీస్తుంది.

ఇప్పటివరకూ బుండిబుగ్యో రకం వైరస్‌కు ప్రత్యేకంగా టీకా అందుబాటులో లేనందున, ముందు జాగ్రత్త చర్యలు, అవగాహన మాత్రమే ఈ వైరస్ నుంచి మనల్ని కాపాడగలవు. వ్యాధి లక్షణాలు ఉన్న వ్యక్తులతో భౌతిక దూరంగా ఉండాలి. ప్రతిరోజూ క్రమం తప్పకుండా సబ్బు, నీరు లేదా ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్‌తో చేతులను శుభ్రం చేసుకోవాలి. అడవి జంతువుల మాంసాన్ని పూర్తిగా దూరంగా ఉంచాలి. పాలు, నీరు, ఆహారాన్ని బాగా మరిగించి, ఉడికించి మాత్రమే తీసుకోవాలి. అలాగే వైద్య సిబ్బంది, కుటుంబ సభ్యులు తప్పనిసరిగా పిపిఇ కిట్లు, గ్లౌజులు, మాస్కులు ధరించాలి. జ్వరం, తీవ్ర అలసట వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సంబంధిత వైద్యులను సంప్రదించాలి. అయితే ఎబోలా వల్ల మరణించిన వారి మృతదేహాల నుండి కూడా వైరస్ వ్యాపించే ప్రమాదం ఉంది. కావున జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read : రాగికి గోల్డెన్ డేస్.. డేంజర్‌లో బంగారం.. ఇకపై కాపర్ ముట్టుకుంటే షాకే!