
కేవలం పారిశ్రామిక అవసరాలకు, గృహోపకరణాలకు మాత్రమే పరిమితమైన రాగి పాత్ర ఇకపై పూర్తిగా మారబోతోంది. ఇది భవిష్యత్తులో అరుదైన, విలువైన వనరుగా మారి బంగారం పొందే స్థాయికి చేరుకుంటుందని ఓ నివేదిక తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకూ రాగి వినియోగం పెరిగిపోతుంటే.. దానికి తగినట్లుగా ఉత్పత్తి, సరఫరా లేకపోవడం వల్ల మున్ముందు తీవ్రమైన కాపర్ కొరత తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read : వణికిపోతున్న ఆఫ్రికా.. మళ్లీ విస్తరిస్తున్న ఎబోలా.. ఈ ప్రాణాంతక మహమ్మారి నుంచి బయటపడేది ఎలా?
ఈ కాపర్ కొరత వెనుక అనేక కారణాలు ఉన్నాయని నివేదిక చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా కొత్తగా రాగి నిక్షేపాలను కనుగొనడం గణనీయంగా తగ్గిపోయింది. ఇప్పటికే తవ్వకాలు జరుగుతున్న పాత గనులలో ఖనిజ నాణ్యత పడిపోతుండటంతో ఎక్కువ తవ్వకాలు జరిపినా లభించే స్వచ్ఛమైన రాగి పరిమాణం తగ్గిపోతోంది. అంతేకాకుండా ఒక కొత్త రాగి గనిని గుర్తించి, అనుమతులు సాధించి పూర్తిస్థాయిలో ఉత్పత్తి ప్రారంభించడానికి కనీసం 16 ఏళ్లకు పైగా సమయం పడుతోంది. దీనికి తోడు తవ్వకం, సాంకేతికత, విద్యుత్, రవాణా ఖర్చులు పెరిగిపోవడం పారిశ్రామిక రంగానికి పెద్ద సవాలుగా మారింది.
ఒకవైపు సరఫరా తగ్గిపోతుంటే మరోవైపు సరికొత్త సాంకేతిక రంగాల విస్తరణ వల్ల రాగికి అనూహ్యంగా డిమాండ్ పెరుగుతోంది. సాధారణ పెట్రోల్, డీజిల్ వాహనాల కంటే ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో నాలుగింతలు ఎక్కువ రాగి అవసరమవుతుంది. అలాగే సౌర శక్తి, పవన విద్యుత్ ప్రాజెక్టుల విస్తరణకు, కరెంట్ సరఫరా చేసే గ్రిడ్ నెట్‌వర్క్‌లకు రాగి ప్రాథమిక అవసరంగా మారింది. వీటితో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్లు, స్మార్ట్ పరికరాల తయారీలో కూడా కాపర్ వినియోగం విపరీతంగా పెరుగుతోంది.
సరఫరా, డిమాండ్ల మధ్య ఉన్న ఈ భారీ వ్యత్యాసం వల్ల ప్రపంచ రాగి మార్కెట్‌పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. డిమాండ్‌కు సరిపడా రాగి దొరక్కపోతే భవిష్యత్తులో దీని ధరలు ఊహించని రీతిలో ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉంది. బంగారం ధరలు ఏ విధంగా పెరిగాయో రాబోయే రోజుల్లో కాపర్ ధరలు కూడా అదే స్థాయిలో పెరుగుతాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ క్రమంలో రాగిని ఉత్పత్తి చేస్తున్న మైనింగ్ కంపెనీలకు అంతర్జాతీయ పెట్టుబడిదారుల నుంచి ఆదరణ లభిస్తుందని అంటున్నారు. అయితే రాబోయే కాలంలో రాగి కేవలం ఒక లోహంగా కాకుండా గ్లోబల్ ఎకానమీని నడిపించే ‘రెడ్ గోల్డ్’ లా మారనుందనడంలో ఎలాంటి సందేహం లేదని నిపుణులు అంటున్నారు.
Also Read : మార్కెట్లోకి సరికొత్త సర్కాడియన్ డిప్రెషన్.. ఈ సమస్య నుంచి బయటపడటం ఎలాగంటే?









